
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, భారతదేశంలో వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశారు.
V2V సాంకేతికత ద్వారా రోడ్డుపై వెళ్లే వాహనాలు ఒకదానితో ఒకటి రియల్ టైమ్‌లో సమాచారాన్ని మార్చుకుంటాయి. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు డ్రైవర్లను అప్రమత్తం చేసి ప్రాణనష్టాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా మంత్రుల వార్షిక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ వెహికల్-టు-వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో వాహనాలు మొబైల్ నెట్‌వర్క్‌పై ఆధారపడకుండా నేరుగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. దీనికోసం టెలికాం శాఖ (DoT) 30 MHz (5.875–5.905 GHz) స్పెక్ట్రమ్‌ను కేటాయించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
ఈ టెక్నాలజీలో భాగంగా వాహనాల్లో సిమ్ కార్డు తరహాలో ఉండే ఒక పరికరాన్ని లేదా ఆన్-బోర్డ్ యూనిట్‌ను (OBU) అమర్చుతారు. ఇది సమీపంలోని ఇతర వాహనాల వేగం, లొకేషన్, బ్రేకింగ్, కదలికలకు సంబంధించిన డేటాను వైర్‌లెస్ పద్ధతిలో గ్రహిస్తుంది. దీనివల్ల మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కూడా వాహనాలు సమర్థంగా సమాచారాన్ని మార్చుకోగలుగుతాయి.
భారతదేశంలో ఏటా దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, సుమారు 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో 66 శాతం మంది 18 నుండి 34 ఏళ్ల మధ్య వయసున్న యువకులే కావడం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో V2V టెక్నాలజీ డ్రైవర్లకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ V2V టెక్నాలజీ ప్రాజెక్టును 2026 చివరి నాటికి నోటిఫై చేసి, దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదట కొత్తగా వచ్చే వాహనాల్లో ఈ పరికరాలను అమరుస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 5,000 కోట్లుగా ఉండవచ్చని సమాచారం.
ఒక్కో వాహనానికి V2V సిస్టమ్ అమర్చుకోవడానికి రూ. 5,000 నుండి రూ. 7,000 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీని ధర ఎంత ఉంటుందనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ తరహా టెక్నాలజీ ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఖరీదైన కార్లలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉంది. ఇది రాడార్, సెన్సార్లపై ఆధారపడి పనిచేస్తుంది. అయితే కొత్తగా రాబోయే V2V టెక్నాలజీ, ఈ ADAS వ్యవస్థతో సమన్వయం చేసుకుని పనిచేస్తుంది. సెన్సార్లు గుర్తించలేని ప్రమాదాలను కూడా V2V కమ్యూనికేషన్ ద్వారా పసిగట్టవచ్చు.
అంటే, కేవలం కంటికి కనిపించే వాటినే కాకుండా, అవతల ఉన్న ప్రమాదాలను కూడా ఇది పసిగట్టి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఇది భద్రతను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఐఐటీ ఢిల్లీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రోడ్డు భద్రతను మరింత పటిష్ఠం చేయడానికి మోటారు వాహనాల చట్టంలోనూ ప్రభుత్వం 61 సవరణలు తీసుకురానుంది. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ఈ చర్యలన్నీ భారతీయ రవాణా వ్యవస్థను ఆధునీకరించడమే కాకుండా, లక్షలాది మంది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం భావిస్తోంది.