Mumbai Family Death: గత నెలలో ముంబైలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడంతో కల్తీ ఆహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా పుచ్చకాయలో రసాయనాలు లేదా విషపదార్థాలు ఉండొచ్చన్న అనుమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ కేసుకు పూర్తిగా భిన్నమైన కోణాన్ని చూపించింది. పుచ్చకాయ వల్ల కాదు.. ఎలుకలను చంపేందుకు ఉపయోగించే విషపదార్థం కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు నిపుణులు గుర్తించారు.
25
మృతదేహాల్లో జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు
మరణించిన వారిని అబ్దుల్లా డోకాడియా (44), అతని భార్య నస్రీన్ (35), కుమార్తెలు అయేషా (16), జైనేబ్ (13)గా గుర్తించారు. వీరి మృతదేహాలకు నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లో “జింక్ ఫాస్ఫైడ్” అనే ప్రమాదకర విషపదార్థం అవశేషాలు బయటపడ్డాయి. జింక్ ఫాస్ఫైడ్ సాధారణంగా ఎలుకల మందుగా ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత తీవ్రమైన విషప్రభావం చూపుతుంది. వాంతులు, విరేచనాలు, శ్వాసలో ఇబ్బందులు, అంతర్గత అవయవాల వైఫల్యం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఫోరెన్సిక్ నిపుణుల ప్రకారం, ఈ విషప్రభావమే ఆ కుటుంబ సభ్యుల మరణానికి ప్రధాన కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
35
ఆ రాత్రి ఏం జరిగింది?
పోలీసుల వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న డోకాడియా కుటుంబం తమ బంధువులతో కలిసి ఇంట్లో చిన్న విందు ఏర్పాటు చేసింది. రాత్రి వరకు బంధువులు, పరిచయస్తులతో ఆత్మీయంగా గడిపిన కుటుంబం అనంతరం విశ్రాంతి తీసుకుంది.
అతిథులు వెళ్లిపోయిన తర్వాత అర్థరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు కలిసి పుచ్చకాయ ముక్కలు తిన్నట్లు సమాచారం. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున వారందరికీ ఒక్కసారిగా తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసులో ఇప్పుడు ప్రధాన ప్రశ్న విషం ఆహారంలోకి ఎలా చేరిందన్నదే. అధికారులు ప్రస్తుతం మూడు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఎలుకల మందు ఆహారంతో కలిసిందా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విషం కలిపారా? లేక కుటుంబం స్వయంగా ఆత్మహత్యకు పాల్పడిందా? అయితే ఇప్పటివరకు కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా ఎలాంటి బలమైన కారణాలు బయటపడలేదని అధికారులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర ఒత్తిళ్లపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆహార పదార్థాలు, ఇంటి పరిసరాలు, నిల్వ చేసిన వస్తువులపై కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
55
కొనసాగుతోన్న దర్యాప్తు
ఈ కేసును జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ బంధువులు, ఇరుగుపొరుగు వారు, విందుకు హాజరైన వ్యక్తుల వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టులో పుచ్చకాయ కల్తీపై వచ్చిన ప్రచారం తప్పని స్పష్టమైనప్పటికీ, విషం అసలు ఎలా చేరింది అనే అంశం ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ కేసులో పూర్తి నిజాలు బయటపడాలంటే దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.