
విజయ్ అఫిడవిట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉన్న భారీ మొత్తం. చెన్నైలోని సాలిగ్రామం బ్రాంచ్‌లో విజయ్ సేవింగ్స్ ఖాతాలోనే రూ.213.36 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది.
ఇది ఎలాంటి షేర్లు లేదా మార్కెట్ పెట్టుబడులు కాదు. సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోనే ఈ మొత్తం ఉండటం ఆశ్చర్యంగా మారింది. విజయ్ మొత్తం ఆస్తుల్లో దాదాపు మూడో వంతు ఈ ఖాతాలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే వివిధ బ్యాంకుల్లో రూ.100 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. వీటిలో యాక్సిస్ బ్యాంక్‌లో రూ.40 కోట్లు,
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రూ.25 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ.20 కోట్లు, ఎస్‌బీఐలో రూ.15 కోట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే విజయ్ సంపదలో రూ.313 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్ల రూపంలోనే ఉన్నట్లు అఫిడవిట్ చెబుతోంది.
విజయ్ స్టాక్ మార్కెట్‌లో పెద్దగా పెట్టుబడులు పెట్టలేదని అఫిడవిట్ ద్వారా తెలుస్తోంది. ఆయన వద్ద ఉన్న షేర్ల మొత్తం విలువ కేవలం రూ.19.37 లక్షలు మాత్రమే. జయా నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్లు, సన్ పేపర్ మిల్ షేర్లు మాత్రమే ఆయన పేరుపై ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, డిబెంచర్లు వంటి పెట్టుబడులు ఏవీ లేవని వెల్లడైంది. భారీ ఆస్తులు ఉన్నప్పటికీ విజయ్ రిస్క్ లేని పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
విజయ్ స్థిరాస్తుల విలువ సుమారు రూ.220 కోట్లుగా ప్రకటించారు. చెన్నైలోని పలు కీలక ప్రాంతాల్లో ఆయనకు ఇళ్లు, కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. నీలాంకరై, మైలాపూర్, ఎగ్మోర్, సాలిగ్రామం ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాల విలువ సుమారు రూ.115 కోట్లు. అలాగే షోలింగనల్లూరు, టీనగర్, పరివక్కం ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి.
కోప్పూర్ గ్రామంలో 2.30 ఎకరాల భూమిని 2023లో రూ.35.81 కోట్లకు కొనుగోలు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
కోడైకెనాల్ సమీపంలోని విల్పట్టి గ్రామంలో రెండు వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. వీటిని 1997లో ఒక్కోటి రూ.15 వేలకే కొనుగోలు చేయగా, ప్రస్తుతం వాటి విలువ రూ.10 లక్షలుగా చూపించారు. ఇక అద్దె రూపంలో కూడా విజయ్‌కు భారీ ఆదాయం వస్తోంది. జయా నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు విజయ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నట్లు వివరించారు.
విజయ్ వద్ద మొత్తం రూ.13.52 కోట్ల విలువైన లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా లెక్సస్ 350 రూ.3.01 కోట్లు, బీఎండబ్ల్యూ i7 – రూ.2 కోట్లు, టాటా కారవాన్ – రూ.6 కోట్లు, టయోటా వెల్‌ఫైర్ – రూ.1.63 కోట్లు ఉన్నాయి. అలాగే మారుతి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్స్‌ఎల్ వంటి సాధారణ వాహనాలు కూడా ఉన్నాయి.
ఇక బంగారం విషయానికొస్తే.. విజయ్ పేరుపై 883 గ్రాముల బంగారం, వెండి వస్తువులు కలిపి సుమారు రూ.1.35 కోట్ల ఆస్తి ఉంది. ఆయన భార్య సంగీత పేరుపై 3 కిలోలకు పైగా బంగారం, వజ్రాలు, వెండి కలిపి రూ.5 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
విజయ్ వివిధ వ్యక్తులు, ట్రస్టులు, సంస్థలకు మొత్తం రూ.75.5 కోట్ల రుణాలు ఇచ్చినట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. కొకిలాంబాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌కు రూ.20 కోట్లు, ఏఎల్‌పీ ఆంటోనియస్ బ్రిట్టోకు రూ.20 కోట్లు, భార్య సంగీతకు రూ.12.6 కోట్లు ఇచ్చినట్లు వివరించారు.
అలాగే తన కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషాకు కూడా రుణాలు ఇచ్చారు. ఇక ఆదాయపు పన్ను శాఖతో విజయ్‌కు కొన్ని వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. ‘పులి’ సినిమా సమయంలో జరిగిన ఐటీ దర్యాప్తుకు సంబంధించిన పన్ను డిమాండ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని కేసులు ప్రస్తుతం అప్పీల్ దశలో ఉన్నట్లు అఫిడవిట్ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విజయ్ ప్రకటించిన ఆదాయం రూ.184.53 కోట్లు. ఇందులో సినిమాలు, అద్దెలు, వడ్డీ ఆదాయం ప్రధాన వనరులుగా పేర్కొన్నారు.