ఇండిగో బెదిరింపుల మధ్యే మరో సంఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి వారణాసీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికులు మధ్యలో బాంబు బెదిరింపు సమాచారం రావడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే లాల్‌బహాదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది.
బాంబు నిర్వీర్య బృందం విమానాన్ని ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు చేపట్టింది. ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనుగొనలేదు. అధికారులు ఈ బెదిరింపును కూడా హోక్స్‌గానే భావిస్తున్నారు.
తిరుచ్చి మంత్రుల ఇళ్లకు బెదిరింపులు, పోలీసుల దర్యాప్తు
అలాగే, తమిళనాడులోని తిరుచ్చిలో కూడా బాంబు బెదిరింపు కలకలం రేపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కే.ఎన్.నెహ్రూ, విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పోయమొజి నివాసాలపై ఇమెయిల్ బెదిరింపులు వచ్చాయి. చెన్నై పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వచ్చిన ఈ సమాచారంతో తిరుచ్చి సిటీ పోలీసులు వెంటనే మంత్రుల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద తనిఖీలు నిర్వహించారు.
బాంబు నిర్వీర్య బృందం మంత్రుల నివాసాలు, కార్యాలయాలు, చత్రం బస్‌స్టాండ్ వద్ద ఉన్న కాలేజీ ప్రాంగణాలను కూడా పరిశీలించింది. ఈ బెదిరింపులు కూడా చివరకు హోక్స్‌గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు.