ఢిల్లీ పేలుడు వెనుక డాక్టర్? ఎవరీ ఉమర్‌ మహ్మద్‌?

Published : Nov 11, 2025, 10:40 PM IST

Who Is Dr Umar Mohammad: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడుతో భారత్ ఒక్కసారిగా షాక్ గు గురైంది. ఈ బ్లాస్ట్ వెనుక డాక్టర్ ఉమర్ మహ్మద్ ఉన్నాడనీ పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఎవరీ ఉమర్ మహ్మద్? వైద్యుడి నుంచి టెర్రరిస్టుగా ఎందుకు మారాడు? ఏం జరిగింది?

PREV
15
డాక్టర్ ఉమర్ మహ్మద్: వైద్యుడి నుంచి ఉగ్రవాదిగా..

డాక్టర్‌ ఉమర్‌ మహ్మద్‌ 1989 ఫిబ్రవరి 24న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కోయిల్‌ గ్రామంలో జన్మించాడు. తండ్రి జీహెచ్‌ నబీ భట్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి షమీమా బానో గృహిణి. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్న ఉమర్‌ శ్రీనగర్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, అనంతరం ఎండీ పూర్తి చేశాడు. అనంతనాగ్‌ మెడికల్‌ కాలేజీలో కొన్నాళ్లు సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేసిన తర్వాత, ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు.

25
ఢిల్లీ పేలుడు ఘటనలో ఉమర్‌ మహ్మద్ ఉన్నారా?

సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద భారీ పేలుడు చోటుచేసుకుంది. తెలుపు రంగు హ్యుందాయ్‌ ఐ20 కారు ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్‌ ఆధారాల ద్వారా ఆ కారులో ప్రయాణించిన వ్యక్తి డాక్టర్‌ ఉమర్‌ మహ్మద్‌ గా పేర్కొంటున్నాయి.

పేలుడు జరిగే ముందు ఆ కారు సునెహ్రీ మస్జిద్‌ వద్ద సుమారు మూడు గంటలపాటు నిలిపి ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత సుభాష్‌ మార్గ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కారు బ్లాస్ట్ అయింది.

35
ఉమర్ మహ్మద్: వైట్‌ కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ లింకులు

దర్యాప్తులో ఉమర్‌ మహ్మద్ పేరు వెలుగులోకి రావడం భద్రతా సంస్థలను షాక్ గు గురిచేసింది. ఫరీదాబాద్‌లో ఇటీవల బయటపడిన వైట్‌ కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ లో అతని పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ మాడ్యూల్‌లో అరెస్టయిన మరో ఇద్దరు డాక్టర్లు అదీల్‌ అహ్మద్‌ రాథర్‌, ముజమ్మిల్‌ షకీల్‌తో ఉమర్‌ బాగా సన్నిహితుడిగా ఉన్నాడు. 

ఈ ముగ్గురు జమ్మూ కాశ్మీర్‌, హర్యానా ప్రాంతాల్లో ఉగ్రచర్యలకు మద్దతు ఇచ్చినట్లు దర్యాప్తు ఏజెన్సీలు చెబుతున్నాయి. ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో సోదాలు జరిపినప్పుడు 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలు, ల్యాప్టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

45
ఉమర్‌ అలాంటోడు కాదు: షాక్‌లో కుటుంబం

డాక్టర్‌ ఉమర్‌ తల్లి షమీమా బానో, వదిన ముజామిల్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “ఉమర్‌ చిన్నప్పటి నుంచి తనపనిలో మునిగిపోయే వ్యక్తి. ఎప్పుడూ పుస్తకాల మధ్యే గడిపేవాడు. అతడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడతాడని మేము నమ్మలేకపోతున్నాం. గత శుక్రవారం ఫోన్‌లో మాట్లాడాం. పరీక్షలు ఉన్నాయని, మూడు రోజుల తర్వాత వస్తానని చెప్పాడు” అని పేర్కొన్నారు.

అలాగే ఉమర్‌ చివరిసారిగా రెండు నెలల క్రితం పుల్వామాకు వచ్చాడనీ, ఆ సందర్శన తర్వాత కుటుంబంతో తక్కువగా మాట్లాడాడని చెప్పారు. ఉమర్‌ సోదరులు ఆషిక్‌, జహూర్‌ అహ్మద్‌లను ఢిల్లీ పోలీసులు విచారణకు తీసుకున్నారని సమాచారం.

55
ఉమర్ మహ్మద్: ఉగ్రవాద భావజాలం వైపు ఎలా మళ్లాడు?

భద్రతా వర్గాల అంచనా ప్రకారం, ఉమర్‌ సోషల్‌ మీడియాలో తీవ్రవాద భావజాలం ప్రచారం చేసే గ్రూపులతో టచ్ లోకి వచ్చాడు. సహచర డాక్టర్‌ షకీల్‌ అరెస్టు తర్వాత తాను కూడా దొరికిపోతానేమోనన్న భయంతో అతడు ఆత్మాహుతి దాడి చేశాడని అనుమానిస్తున్నారు. పేలుడుకు ఉపయోగించిన పదార్థం అమ్మోనియం నైట్రేట్‌–ఫ్యూయల్‌ ఆయిల్‌ మిశ్రమం (ANFO) అని ఫోరెన్సిక్‌ నివేదిక పేర్కొంది.

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైద్యుడిగా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఉమర్‌ మహ్మద్‌ ఎలా ఉగ్రవాద మార్గం ఎంచుకున్నాడు? అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఉమర్‌ మరణం నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories