IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !

Published : Dec 21, 2025, 10:05 PM IST

Railways Ticket Price Hike : రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. డిసెంబర్ 26 నుంచి ట్రైన్ టికెట్ ధరలు పెరుగుతున్నాయి. ఎవరికి ఎంత భారం పడుతుందో, ఏ క్లాస్‌కు ఎంత పెంపు ఉందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
రైల్వే ప్రయాణికులకు షాక్: డిసెంబర్ 26 నుంచి టికెట్ ధరలు పెంపు

సామాన్యుడి విమానంగా పేరుగాంచిన భారతీయ రైల్వే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ టికెట్ ధరలను పెంచుతూ చేసిన ప్రకటన ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. ఈ కొత్త ధరలు ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

26
ఏ క్లాస్‌కు ఎంత పెరుగుతుందంటే?

రైల్వే ప్రకటించిన తాజా ఫేర్ స్ట్రక్చర్ ప్రకారం, అందరు ప్రయాణికులపై ఒకేలా భారం పడదు.

  • 215 కిలోమీటర్ల లోపు ప్రయాణం: ఎలాంటి ధరల పెంపు లేదు.
  • ఆర్డినరీ / జనరల్ క్లాస్ (215 కి.మీ పైగా): ప్రతి కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాలి.
  • మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ, ఏసీ): ప్రతి కిలోమీటరుకు 2 పైసలు అదనంగా వసూలు చేస్తారు.

ఉదాహరణకు, నాన్-ఏసీ లేదా ఏసీ కోచ్‌లో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై రూ.10 మాత్రమే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

36
రైల్వే టికెట్ ధరలు: సామాన్యులకు ఊరట ఇచ్చిన అంశాలు ఏంటి?

టికెట్ ధరల పెంపు ఉన్నప్పటికీ, కొన్ని వర్గాలకు రైల్వే ఊరట కల్పించింది. సబర్బన్ ట్రైన్స్, లోకల్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్లు (MST), తక్కువ దూర ప్రయాణాల ధరల్లో పెరుగుదల లేదు.

హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వంటి మహానగరాల్లో రోజూ లోకల్ ట్రైన్లపై ఆధారపడే లక్షలాది మందిపై ఈసారి ఎలాంటి అదనపు భారం పడలేదు.

46
రైల్వే టికెట్ ధరలు పెంచడానికి అసలు కారణాలేంటి?

గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ భారీగా జరిగింది. దీనికి అనుగుణంగా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి.

  • 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం వ్యయం: రూ.2,63,000 కోట్లు
  • మానవ వనరుల ఖర్చు: రూ.1.15 లక్షల కోట్లు
  • పెన్షన్ వ్యయం: రూ.60,000 కోట్లు

అదనంగా భద్రత, ఆధునీకరణ, ప్రత్యేక రైళ్ల నిర్వహణ వంటి అంశాలు కూడా వ్యయాన్ని పెంచాయని అధికారులు వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయాణికుల టికెట్ ధరల్లో స్వల్ప సవరణ తప్పనిసరైందని రైల్వే చెబుతోంది.

56
ముందే బుక్ చేసుకున్న టికెట్ల పరిస్థితి ఏంటి?

డిసెంబర్ 26కి ముందు బుక్ చేసుకున్న టికెట్లపై కొత్త ధరలు వర్తిస్తాయా? అనే సందేహాలు ఉన్నాయి. గత అనుభవాలను బట్టి చూస్తే, టికెట్ బుక్ చేసిన తేదీ నాటి చార్జీలే వర్తించే అవకాశం ఎక్కువ. అయితే దీనిపై అధికారిక సర్క్యులర్ రావాల్సి ఉంది.

ఇదే సమయంలో ప్రయాణికులకు మరో శుభవార్త కూడా ఉంది. ఇకపై రైలు బయల్దేరే 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయనున్నారు. దీని వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ముందుగానే స్పష్టత లభించి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది.

టికెట్ ధరల పెంపు కొంతమేర భారం అయినప్పటికీ, అది చాలా స్వల్పమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. భద్రత, సేవల మెరుగుదల, నెట్‌వర్క్ విస్తరణ కోసం ఈ నిర్ణయం కీలకమని స్పష్టం చేశాయి.

66
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ప్రభావం ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మార్గాలైన హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం వెళ్లే వారిపై ఈ పెంపు ప్రభావం ఎలా ఉంటుందో కింది అంచనాల ద్వారా తెలుసుకోవచ్చు:

1. హైదరాబాద్ - తిరుపతి (సుమారు 660 కి.మీ): 

జనరల్ టికెట్: 215 కి.మీ మినహాయింపు పోను, మిగిలిన 445 కిలోమీటర్లకు (445 x 1 పైసా) సుమారు రూ. 4.50 పెరుగుతుంది.

స్లీపర్/ఏసీ: మొత్తం దూరానికి (660 x 2 పైసలు) రూ. 13.20 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

2. హైదరాబాద్ - విశాఖపట్నం (సుమారు 700 కి.మీ):

జనరల్ టికెట్: 215 కి.మీ మినహాయింపు పోను, మిగిలిన 485 కిలోమీటర్లకు రూ. 5 వరకు పెరుగుతుంది.

స్లీపర్/ఏసీ: మొత్తం దూరానికి (700 x 2 పైసలు) సుమారు రూ. 14 వరకు టికెట్ ధర పెరిగే అవకాశం ఉంది.

గమనిక: ఇవి అంచనాలు మాత్రమే అసలైన ధరల పూర్తి వివరాలు రైల్వే వెల్లడిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories