
* రోజుకు 10 వేల మందిని కరిచేస్తున్న కుక్కలు
* కుక్క కాటుతో దేశంలో గంటకు ఇద్దరు పిల్లల మరణం
2024లో దేశంలో 37.17 లక్షల కుక్క కాట్లు నమోదయ్యాయి. అంటే, రోజుకు సగటున 10,000కుపైగా కాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారత్‌లో ప్రతీ ఏటా రేబీస్ కారణంతో ఏకంగా 18 వేల నుంచి 20 వేల మంది మరణిస్తున్నారు. బాధితుల్లో పిల్లలే అధికం. 2018లో 75.7 లక్షల కుక్క కాటు కేసులు ఉండగా, కోవిడ్ సమయంలో 2021లో కేవలం 17 లక్షలకు తగ్గాయి. కానీ తర్వాత మళ్లీ పెరిగి, 2024లో 37.2 లక్షలకు చేరుకున్నాయి.
చూశారు కదా.. ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలో వీధి కుక్కల వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వీధి కుక్కులను తొలగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ కుక్కల గొడవ ఏంటో ఇప్పుడు చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కల దాడుల వల్ల రేబిస్ కేసులు పెరిగాయి. దీంతో సుప్రీం కోర్టు వచ్చే ఎనిమిది వారాల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కుక్కల తరలింపు ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన బెంచ్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.
వీధి కుక్కల కోసం ఇప్పటికే ప్రత్యేక ప్రదేశం గుర్తించినప్పటికీ, జంతు ప్రేమికులు కోర్టుల ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో కుక్కల తరలింపు చర్యలు నిలిచిపోయాయి. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. “రేబిస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలను ఈ జంతు ప్రేమికులు తిరిగి తెస్తారా? ప్రజల ప్రాణాల కంటే జంతు సెంటిమెంట్ ముఖ్యమా?” అని ప్రశ్నించింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్న అన్ని వీధి కుక్కలను పట్టుకొని షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. షెల్టర్లలో వీధి కుక్కలకు అవసరమయ్యే ఆహారం, నీరు, టీకాలు, స్టెరిలైజేషన్ లాంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అదేశించింది. అంతేకాకుండా షెల్టర్లలో CCTV పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. కుక్క కాటు ఘటనలకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి 4 గంటల్లో స్పందించాలని సుప్రీం తెలిపింది.
సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కొందరు జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. PETA ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (FIAPO)తో పాటు ఇతర జంతు సంక్షేమ సంస్థలు సుప్రీం కోర్టు ఆదేశాన్ని విమర్శించాయి. ఢిల్లీలో సుమారు 10 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని చెబుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా సుప్రీం నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
టాలీవుడ్ నటి సదా ఒ సహజమైన భయాన్ని వ్య్తక్తం చేస్తున్నారు. ‘ఢిల్లీలో మూడు లక్షలకు పైగా వీధి కుక్కలున్నాయి.. వాటన్నింటికీ 8 వారాల్లో ప్రభుత్వం షెల్టర్స్ ఎక్కడ సిద్ధం చేయగలరు? ఇది జరగని పని. వాటన్నింటినీ షెల్టర్లలో ఉంచడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేసే పరిస్థితి వస్తుంది. మాస్ కిల్లింగ్స్ జరగుతాయని భయం వేస్తోంది.. అనేది సదా వాదన.
ఈ వ్యవహారంపై సమాజం రెండుగా చీలింది. సుప్రీం నిర్ణయానికి మద్ధతు పలికే వారు కొందరైతే వ్యతిరేకించే వారు మరి కొందరు ఉన్నారు. వీధి కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారి గురించి ఆలోచించరా.? మనుషుల ప్రాణాల కంటే కుక్కలు ముఖ్యమా.? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మరికొందరు మాత్రం మూగ జీవుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ స్పందిస్తున్నారు.
* మహారాష్ట్ర: 2022–2024లో 13.5 లక్షల కేసులు.
* తమిళనాడు: 12.9 లక్షలు.
* గుజరాత్: 8.4 లక్షలు.
* ఆంధ్రప్రదేశ్‌లో 6.5 లక్షలు.
2019 గణాంకాల ప్రకారం..
* ఉత్తరప్రదేశ్: 20.6 లక్షల వీధి కుక్కలు.
* ఒడిశా: 17.3 లక్షలు.
* మహారాష్ట్ర, రాజస్థాన్: ఒక్కోటి 12.8 లక్షలు.
* కర్ణాటక: 11.4 లక్షలు.
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీ విషయానికొస్తే ఈ ఏడాది ఇప్పటివరకు 26,334 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.
2024 మొత్తం: 68,090 కేసులు నమోదుకాగా. ఈ ఏడాది జూలై 31 వరకు 49 రేబీస్ కేసులు ఫైల్ అయ్యాయి.
జనవరి–జూన్ 2025లో 65,000 కుక్కలు స్టెరిలైజేషన్ + టీకాలు పొందాయి. 2024–2025లో 97,994 కుక్కల స్టెరిలైజేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కర్ణాటక, కేరళలో ఆందోళన పరిస్థితి
* కర్ణాటక: 2024లో 3.6 లక్షల కుక్క కాటు కేసులు, 42 రేబీస్ మరణాలు సంభవించాయి.
* గత 6 నెలల్లోనే 2.3 లక్షల కేసులు, 19 మరణాలు జరిగాయి. కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
వీధి శునకాల కోసం దేశంలో చాలా తక్కువ షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గురుగ్రామ్‌లో 50,000 వీధి కుక్కలు ఉంటే కేవలం 2 షెల్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నోయిడాలోలో ఏకంగా 1.5 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. అయితే కేవలం 4 ప్రైవేట్ శెల్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
* చాలా నగరాల్లో వీధి కుక్కల సంఖ్యపై ఖచ్చితమైన లెక్కలు లేకపోవడం.
* ఎన్ని కుక్కలకు శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) చేయించాలన్న సంఖ్య లేకపోవడంతో ప్లానింగ్ సరిగా జరగడం లేదు.
* శస్త్రచికిత్సకు కావాల్సిన వెటర్నరీ డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్లు, పరికరాలు, వాహనాలు పరిమితంగా ఉండటం.
* ఒక్కో కుక్కను పట్టుకోవడం, శస్త్రచికిత్స చేయడం, తిరిగి వదలడం. ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ, ఖర్చుతో కూడుకుంది కావడం.
* కొంతమంది వీధి కుక్కలను ఇంటి వద్ద భోజనం పెట్టడం వల్ల అవి పెద్ద గుంపులుగా చేరతాయి.
* ఒక ప్రాంతంలో నియంత్రణ చేసినా, సమీప గ్రామాలు లేదా పట్టణాల నుంచి కుక్కలు వచ్చేస్తాయి. దీనిని “vacuum effect” అని పిలుస్తారు.
* ఇందులో కొన్ని చట్టపరమైన పరిమితులు కూడా ఉన్నాయి. భారత చట్టం ప్రకారం వీధి కుక్కలను చంపడం నిషేధం. కేవలం స్టెరిలైజేషన్, టీకాలు వేసి తిరిగి వదలాలి. ఈ విధానం ఫలితాలు చూపడానికి ఎక్కువ సమయం పడుతుంది.
* థాయ్‌లాండ్ వీధి కుక్కల నియంత్రణకు క్యాచ్, వంధ్యీకరణ(Neuter), వ్యాక్సిన్, రిలీజ్ (CNVR) విధానాన్ని అవలంభిస్తున్నారు. దీనిద్వారా కుక్కలను పట్టుకొని శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) చేసి, రేబీస్ వ్యాక్సిన్ వేసి తిరిగి వదిలేస్తారు. ఇందుకోసం ఇక్కడ పెద్ద ఎత్తున మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం లక్షలాది కుక్కలకు చికిత్స అందిస్తున్నారు. దీని ఫలితంగా 10 ఏళ్లలో రేబీస్ కేసులు 80% తగ్గాయి.
* టర్కీ విషయానికొస్తే ఇక్కడ యానిమల్ షెల్టర్స్+మైక్రోచిప్పింగ్ విధానాన్ని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా వీధి కుక్కలను పట్టుకొని మైక్రోచిప్ అమర్చడం, శస్త్రచికిత్స చేయడం, శెల్టర్‌లలో ఉంచడం లేదా మళ్లీ వదిలేస్తుంటారు. ఇస్తాంబుల్ నగరంలో వీధి కుక్కలకు ఫుడ్, వాటర్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. దీంతో వీధి కుక్కల దాడుల సంఖ్య తగ్గి, పౌరులు కూడా సహకరించడానికి ముందుకు వచ్చారు.
* వీధి కుక్కల నియంత్రణకు ఆస్ట్రేలియాలో కఠినమైన లైసెన్స్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. ప్రతి కుక్కకు లైసెన్స్ తప్పనిసరి, స్టెరిలైజేషన్ చేయించని పెంపుడు కుక్క యజమానులకు భారీ జరిమానాలు విధిస్తారు.
* ఇటలీలో వీధి కుక్కలను చంపడం పూర్తిగా నిషేధం, కానీ పట్టుకొని శస్త్రచికిత్స చేసి మున్సిపల్ షెల్టర్స్‌లో ఉంచుతారు.
* సింగపూర్‌లో వీధి కుక్కలను పట్టుకొని ట్రైనింగ్, సోషలైజేసన్ చేసి దత్తతకు సిద్ధం చేస్తారు. దీని కారణంగా వీధి కుక్కలు పెంపుడు జంతువులుగా మారి, హింసాత్మక ప్రవర్తన తగ్గుతుంది.
* అమెరికాలో యానిమల్ కంట్రోల్ యూనిట్ విధానాన్ని ఫాలో అవుతారు. దీంట్లో కుక్కలను పట్టుకొని, స్పే/న్యూటర్ చేసి, దత్తతకు ఇస్తారు.