Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !

Published : Jan 10, 2026, 10:01 PM IST

Atal Pension Yojana: వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చింది. అదే అటల్ పెన్షన్ యోజన. తక్కువ మొత్తంతో నెలకు రూ. 5000 పెన్షన్ అందిస్తుంది. ఈ స్కీమ్ అర్హతలు, ప్రీమియం, దరఖాస్తు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
వృద్ధాప్యానికి భరోసా.. భార్యాభర్తలిద్దరికీ పెన్షన్.. వెంటనే అప్లై చేసుకోండి!

Atal Pension Yojana : ప్రస్తుత కాలంలో ప్రజలు తమ రోజువారీ ఖర్చులను చూసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. దీనికోసం కొందరు బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే, మరికొందరు ఎస్ఐపీ లేదా ఎఫ్‌డీ వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే, అసంఘటిత రంగంలోని కార్మికులు, సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన. 

ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత, అంటే 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నడుపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ పథకంలో చేరారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ. 5000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. అసలు ఈ పథకం ఏంటి? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు గమనిస్తే..

26
అసలు ఏంటి ఈ అటల్ పెన్షన్ యోజన?

అటల్ పెన్షన్ యోజన (APY) అనేది భారత పౌరుల కోసం, ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రజలకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఈ పథకంలో చేరినవారు 60 ఏళ్లు నిండిన తర్వాత, వారు చేసిన పొదుపు ఆధారంగా ప్రతి నెలా పెన్షన్ పొందుతారు. దీనివల్ల పదవీ విరమణ సమయంలో వారికి ఒక స్థిరమైన ఆదాయ వనరు లభిస్తుంది. కనీసం 20 సంవత్సరాల పాటు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇతర పాలసీలతో పోలిస్తే ఇందులో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది, వయస్సును బట్టి మారుతుంది.

36
అటల్ పెన్షన్ యోజన అర్హతలు, నిబంధనలు ఇవే

అటల్ పెన్షన్ యోజనలో చేరాలనుకునే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. వాటిలో..

  • వయస్సు: దరఖాస్తు చేసే సమయానికి వ్యక్తి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • బ్యాంకు ఖాతా: ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కచ్చితం ఉండాలి.
  • ఆధార్, మొబైల్: కమ్యూనికేషన్ కోసం ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఇవ్వడం మంచిది.
  • ఇతర నిబంధనలు: ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు. అలాగే, ఈపీఎఫ్ (EPF) వంటి ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చేవారు ఈ పథకంలో ప్రభుత్వం అందించే సహ విరాళానికి అర్హులు కాదు. కేవలం భారత పౌరులు మాత్రమే దీనికి అర్హులు.
46
అటల్ పెన్షన్ యోజన ప్రీమియం ఎంత కట్టాలి? పెన్షన్ ఎంత వస్తుంది?

ఈ పథకంలో రూ. 1000 నుండి రూ. 5000 వరకు పెన్షన్ పొందే ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఎంచుకున్న పెన్షన్ మొత్తం, పథకంలో చేరేటప్పుడు మీ వయస్సును బట్టి ప్రీమియం నిర్ణయిస్తారు. తక్కువ వయస్సులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు, మీరు నెలకు రూ. 5000 పెన్షన్ కావాలనుకుంటే:

  • మీ వయస్సు 18 ఏళ్లు ఉంటే, మీరు నెలకు కేవలం రూ. 210 చెల్లిస్తే సరిపోతుంది.
  • అదే మీ వయస్సు 30 ఏళ్లు ఉంటే, వచ్చే 20 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 577 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రీమియం మొత్తాన్ని మీ సేవింగ్స్ ఖాతా నుండి ఆటో డెబిట్ పద్ధతిలో నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే, ప్రతి రూ. 100 కాంట్రిబ్యూషన్‌కు రూ. 1 చొప్పున పెనాల్టీ విధిస్తారు.

56
అటల్ పెన్షన్ యోజన పథకం వల్ల కలిగే ప్రయోజనాలు
  • గ్యారంటీ పెన్షన్: 60 ఏళ్లు నిండిన తర్వాత, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. ఒకవేళ పెట్టుబడిపై వచ్చిన రాబడి తక్కువగా ఉంటే, ఆ లోటును ప్రభుత్వమే భరిస్తుంది. రాబడి ఎక్కువగా ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని చందాదారుడి ఖాతాకే జమ చేస్తారు.
  • నామినీ సౌకర్యం: 60 ఏళ్ల తర్వాత చందాదారుడు మరణిస్తే, అదే పెన్షన్ మొత్తాన్ని వారి జీవిత భాగస్వామికి అందజేస్తారు.
  • కార్పస్ ఫండ్: చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన పక్షంలో, అప్పటి వరకు జమ అయిన మొత్తం పెన్షన్ కార్పస్ ఫండ్‌ను నామినీకి తిరిగి ఇస్తారు.
  • పన్ను మినహాయింపు: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈ పథకంలో చేసే పెట్టుబడికి పన్ను మినహాయింపులు కూడా వర్తిస్తాయి.
66
అటల్ పెన్షన్ యోజన: దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి?

అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి ప్రక్రియ చాలా సులభం. మీరు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు..

  • బ్యాంకును సందర్శించండి: మీకు సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు శాఖకు వెళ్లండి.
  • ఫారం నింపండి: ఏపీవై (APY) రిజిస్ట్రేషన్ ఫారం తీసుకుని, మీ బ్యాంకు ఖాతా నంబర్, పేరు, చిరునామా, కోరుకున్న పెన్షన్ మొత్తం తదితర వివరాలను నింపండి.
  • కేవైసీ (KYC): ఫారంతో పాటు ఆధార్ వివరాలు అందించండి. ఇది తప్పనిసరి కాకపోయినా, కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది.
  • ఆటో డెబిట్: నెలవారీ ప్రీమియం కటింగ్ కోసం ఆటో డెబిట్ ఆప్షన్‌ను ఎంచుకోండి. బ్యాంకు వారు మీ ఖాతాను ఈ పథకానికి లింక్ చేస్తారు.
  • ధృవీకరణ: ప్రక్రియ పూర్తయ్యాక మీకు ఒక రశీదు లేదా రిజిస్టర్ నెంబర్ ఇస్తారు.

వయస్సు 60 ఏళ్లు వచ్చే వరకు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించడం ద్వారా మీ వృద్ధాప్యాన్ని సురక్షితం చేసుకోవచ్చు. ఒకవేళ 60 ఏళ్ల లోపే పథకం నుండి వైదొలగాలని అనుకుంటే, కేవలం మీరు కట్టిన డబ్బు, దానిపై వచ్చిన వడ్డీ మాత్రమే వెనక్కి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన వాటా వెనక్కి రాదు.

Read more Photos on
click me!

Recommended Stories