Skylab: నిత్యామీనన్ 'స్కైలాబ్' సినిమా రివ్యూ

First Published Dec 4, 2021, 12:59 PM IST


స్కైలాబ్ పడటం అనేది కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన భయాందోళనతో కూడిన ఓ సంఘటన. ఈ విషయంపై సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లుకు ఓ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అందులోనూ ముఖ్యంగా ట్రైలర్ చాలా బాగుండడంతో ఏదో కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా చూడబోతున్నాం అని అనిపించింది.

 
ఈ మధ్యకాలంలో బ్రోచేవారెవరురా- జాతిరత్నాలు లాంటి చిత్రాలు చిన్న కాన్సెప్టులతో మెప్పించి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఇదే కేటగిరీలో చేరతానంటూ ఓ చిత్రం ఉత్సాహపడింది. వావ్ అనిపించేలా స్కైలాబ్ టీజర్ మ్యాజిక్ చేరసింది. చాలా కాలానికి జూ.సౌందర్యగా తెలుగు నాట పాపులరైన నిత్యామీనన్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో క్రేజ్ క్రియేటైంది.  నిత్యామీనన్ - రాహుల్ రామకృష్ణ- సత్యదేవ్ లాంటి స్టార్లు ప్రధాన బలంగా స్కైలాబ్ లాంటి ప్రయోగాత్మక ఫన్ ఫిల్డ్ సినిమా విడుదల అయ్యింది. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, కథ వినూత్నంగా ఉంటేనేవర్కవుట్ అవుతాయి. అలాగే  సినిమా చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగ చేయాలి. అలాంటి వరల్డ్ ని ఈ సినిమా క్రియేట్ చేసిందా..అసలు ఈ సినిమా కథ ఏమిటి...నిత్యామీనన్ నచ్చేసి నిర్మాతగా మారేటంత అంశాలు సినిమాలో ఏమున్నాయి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

 
కథేంటి

1979 కరీంనగర్‌ జిల్లాలో బండ లింగంపల్లి అనే ఊరు. గౌరి (నిత్యామీనన్) హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రతిబింబం పత్రికలో పనిచేసే ఔత్సాహిక జర్నలిస్ట్. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలని, ఎప్పటికైనా పెద్ద పేరు తెచ్చుకోవాలని జీవితాశయం.  అయితే ఆమెను అంతగా ఆ పత్రిక నమ్మదు. తనను తాను ప్రూవ్ చేసుకోకపోతే ఆమెకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేస్తారనే భయం. ఆనంద్ (సత్యదేవ్) సస్పెండ్ అయిన డాక్టర్.  సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)  ఓ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే తన ఆస్తులకు సంభందించిన కోర్టు గొడవలతో పూర్తిగా అప్పులు పాలై ఉంటాడు. జనాలు పీకుతూంటారు. ఆనంద్, రామారావు కలిసి అందరూ వద్దని చెబుతున్నా... ఊరిలో ఎప్పుడో మూసేసిన ప్రాథమిక ఆస్పత్రిని మళ్లీ తెరుస్తారు. మరో ప్రక్క గౌరీ ఊరు వచ్చిన తర్వాత ప్రతిబింబం ఆఫీసు నుంచి ఓ ఉత్తరం వస్తుంది.   ఇలా ఎవరి టెన్షన్ లో  వాళ్లు ఉండగా...  స్కైలాబ్ అాదే ఊరిపై పడిపోతుందన్న ప్రకటన వస్తుంది. ఇది  ఈ ముగ్గురి జీవితాలతో పాటు  ఇతర గ్రామ ప్రజలను ఎలా మారుస్తుంది, స్కైలాబ్ పడడం అనే వార్తని వారి సొంత ప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారు? చివరికి వాళ్ళు అనుకున్నది సాధించారా?  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
 
‘‘1979లో  అమెరికా స్పేస్‌ స్టేషన్‌ నాసా ప్రయోగించిన స్పేస్‌ స్టేషన్‌ స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. 1979 జూలై 11 న సముద్రంలో పడి విచ్ఛిన్నం అయిన ఆ శకలం ప్రజలను మూడు వారాలపాటు భయపెట్టింది.  దాంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలామంది మేకలు, గొర్లు, కోళ్లు కోసుకుని వండుకుని తిన్నారు. ఆస్తులు ఎక్కువగా ఉన్నవారు తక్కువ ధరకే అమ్ముకోగా, కొంతమంది తమ జీవితాలు ముగియబోతున్నాయని స్థిరాస్తులను దానం చేశారు. కొందరైతే స్కైలాబ్ ప్రభావం పడకుండా ఉండేందుకు కొన్ని రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు.పేడను ఇంటి తలుపులకు పూసి గ్యాప్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్కైలాబ్ తమ గ్రామాల సమీపంలో పడినా.. దాని ద్వారా వచ్చే విషవాయువులు ఇళ్లలోకి చొరబడవద్దని ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు స్కైలాబ్ పడుతుందన్న రోజు రాగానే గ్రామగ్రామాన దండోరా వేయించి ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రచారం చేశారు. మరునాడు బతికుంటామో లేదా అన్న ఆందోళనతోనే ఎవరి ఇళ్లలో వారు తెల్లవార్లూ నిద్రపోకుండా ఉండిపోయారు. ఇంకా రకరకాల వింతలు, భయాలతో చోటు చేసుకున్నాయి. 


ఇలాంటి గమ్మత్తైన  నేపధ్యంలో రూపొందే కథలకు సెకండాఫే కీలకం. ఫస్టాఫ్ అంతా క్యారక్టర్స్, విలేజ్ ఎట్మాస్మియర్, స్కైలాబ్ పడుతుందనే వార్త..ఇవి ఆక్రమించేస్తాయి. ఇక సెకండాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. అప్పుడు ఆ జనం ఎలా రియాక్ట్ అయ్యారు. మెయిన్ లీడ్ క్యారక్టర్స్ ఏం చేసాయి అని.  డైరక్టర్ తన దృష్టి మొత్తం  ఆ కాలానికి తగ్గ సెటప్,మూడ్ క్రియేట్ చేయటం పైనే పెట్టారు.   కథ ఎత్తుగడలో చూపించిన ఆసక్తి  ఆ  తర్వాత కంటిన్యూ చేయలేకపోయారు. అలాగే ట్రైలర్,పోస్టర్స్  చూస్తే కామెడీ అనుకుంటాం కానీ నిజానికి పూర్తి ఫన్ ఫిల్మ్  కాదు. 

Skylab


వాస్తవానికి ఇలాంటి చిన్న సినిమా కథలకు కావాల్సింది  “Intensity, Integrity, Intelligence”.ఈ మూడే ఈ స్క్రిప్టులో పూర్తిగా కాదు కాని కొంత కొరవడ్డాయి. తల్లో ఉన్న ఐడియా తెరపైకి వచ్చేసరికి చాలా సార్లు తడబడింది. స్టోరీ జర్నీలో క్యారక్టర్స్ ,వాటి చుట్టూ అల్లిన లేయర్స్ మెల్లిగా పలచబడిపోయాయి. అప్పటికీ ఈ కాలంలో కొనసాగుతున్న కుల పిచ్చి, మూఢ నమ్మకాలు వంటి వాటిని టచ్ చేసారు. కానీ పూర్తి స్దాయిలో కనెక్ట్ చేయలేకపోయారు. ప్రి క్లైమాక్స్ లో ఎలాగో చనిపోబోతున్నాం కదా అని భావించే వారి కోరికలు, వారి కథలు  ఎమోషనల్ గా టచ్ చేసారు. కథ మొత్తం పట్టి ఉంటే స్క్రీన్ ప్లేని సరిగ్గా రాసుకోలేకపోయారు. ఇది డైరక్టర్ పాయింటాఫ్ వ్యూ కథ కావటంతో కథ మరింత జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందులోనూ క్లైమాక్స్ ఎలాగూ స్కైలాబ్ పడదనే విషయం  ప్రేక్షకుడికి తెలిసిందే.  దాంతో మరింత జాగ్రత్తగా డీల్ చెయ్యాల్సిన అవసంర ఉంది. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ఆ క్యారక్టర్స్ లో రావాల్సిన  గాఢత,జీవిత సంక్లిష్టత  రాలేదు. క్యారక్టర్స్ లో ఇంటెన్సిటీ అసలే లేదు.  అలాగే వాళ్లు కామెడీ అనుకున్న చాలా చోట్ల సీన్స్ నవ్వు తెప్పించలేకపోయాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కథలో ఎమోషన్ మిస్ చేసారు. 

Skylab

 
టెక్నికల్ గా చూస్తే..

దర్శకుడు మంచి పాయింట్ ని తొలి సినిమాకు ఎంచుకున్నాడు. పీరియడ్ లుక్ తేవటం కోసం ఆర్ట్ డిజైన్, సెట్ ప్రాపర్టీస్ ని జాగ్రత్తగా వాడుకున్నాడు. అలాగే భాష,యాస విషయంలో ఫెరఫెక్ట్ అనిపించుకున్నాడు. అయితే ఇవన్ని ప్రైమరీ. అసలైన స్క్రిప్టు విషయంలోనే తడబడ్డాడు. కీ క్యారక్టర్స్ ఇంటర్నల్ మోటివేషన్స్ ని బయిటకు పెట్టే యాక్షన్స్ ని సరిగ్గా డిజైన్ చేయలేకపోయారనిపించింది.  geography మాత్రం బెస్ట్ విజువల్స్ తో  బాగా ఎస్టాబ్లిష్ చేసారు. కొద్ది పాటి జాగ్రత్త గల స్క్రిప్టుతో మంచి దర్శకుడు అవుతాడనిపించింది.

ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఆదిత్య కలర్స్ కాంబినేషన్స్  తో ఆడుకున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ ఫెరఫెక్ట్ గా పీరియడ్ సినిమాకు సింక్ అయ్యింది. నిర్మాతలు నిత్యామీనన్, ఫృధ్వీ ఇలాంటి ఓ కొత్త ప్రయత్నానికి మంచి బడ్జెట్ తో సహకరించారు. ఆర్ట్ డిపార్టమెంట్, కాస్ట్యూమ్స్ కు ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఇక కథలోనూ కదలిక ఉండదు. సినిమాను స్లో నేరేషన్ .దాంతో  సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ సహనం తగ్గుతూ ఉంటుంది. 


  పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే... చాలా రోజుల తర్వాత నిత్యా మీనన్ ని డైరక్ట్ తెలుగు సినిమాలో చూస్తున్నాం. ఆమె నమ్మి,ఇష్టపడి ,పెట్టుబడి పెట్టి మరీ చేసిన పాత్ర...లిటరల్ గా అదరకొట్టింది. పాత్ర కోసం తెలంగాణ యాస కూడా నేర్చుకోవడం విశేషం. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ విడిగా కాకుండా కథలో కలిసిపోయి సందడి చేసారు. మిగిలిన పాత్రలు పోషించిన తనికెళ్ల భరణి, తులసి, తరుణ్ భాస్కర్ కూడా వారి పాత్రల్లో బాగా చేశారు.
 

Skylab


నచ్చినవి

నిత్యా మీనన్
1970 నాటి లుక్ ని తెచ్చిన విధానం
క్లైమాక్స్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నచ్చనవి

స్లో నేరేషన్
ఎమోషనల్ కంటెంట్ లేకపోవటం
 

Skylab


ఫైనల్ థాట్

'చూసే కళ్లు, రాసే ఓపిక ఉండాలి కానీ ఊరి నిండా కథలు ఉన్నాయి' ఈ సినిమాలో డైలాగు, కానీ ఆ కథలన్ని ఇంట్రస్టింగ్ గా ఉండాలనేది సినిమా రూల్

--సూర్య ప్రకాష్ జోశ్యుల 

రేటింగ్ : 2.5/5

Skylab


ఎవరెవరు...

న‌టీన‌టులు:
నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క్ కందెరావ్‌
నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
సహ నిర్మాత: నిత్యామీనన్‌
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్‌: రవితేజ గిరిజాల
మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి
ప్రొడక్షన్‌ డిజైన్‌: శివం రావ్‌
సౌండ్ రికార్డిస్ట్‌‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి
సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌
కాస్ట్యూమ్స్‌: పూజిత తడికొండ
విడుదల తేదీ : డిసెంబర్ 4, 2021

Also read Skylab review: స్కైలాబ్ మూవీ ప్రీమియర్స్ రివ్యూ

click me!