జామ ఆకులను దేనిదేనికి ఉపయోగిస్తారో తెలుసా?

First Published Mar 23, 2024, 11:46 AM IST

జామకాయలే కావు జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ ఆకులను ఉపయోగించి మనం ఎన్నో సమస్యలను నయం చేసుకోవచ్చు. 
 

జామకాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న ముచ్చట చాలా మందికి తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. జామ చెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయన్న ముచ్చట. అవును జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ డయాబెటిక్, యాంటీమైక్రోబయల్, యాంటీ డయేరియాల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను ఉపయోగించి మనం ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. మరి జామ ఆకులను ఏయే వ్యాధులను తగ్గించుకోవడానికి ఉపయోగించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మెరుగైన జీర్ణక్రియ 

జామఆకులతో మన జీర్ణక్రియను మెరుగ్గా చేసుకోవచ్చు. జామ ఆకులను నమిలినా లేదా జామ ఆకుల టీ తాగినా మీ మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో అజీర్థి మలబద్దకం, వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. 

బరువు తగ్గుతారు

జామ ఆకులను బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో బరువు తగ్గేందుకు సహాయపడే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయి. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు. మీరు బరువు తగ్గాలనుకుంటే జామ ఆకుల టీని తయారు చేసుకుని తాగండి.
 

రోగనిరోధక శక్తి 

జామ కాయల్లోనే కాదు జామ ఆకుల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఈ ఆకులు మారుతున్న సీజన్ వల్ల వచ్చే అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 
 

డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది

జామ ఆకులు డయాబెటీస్ ఉన్నవారికి కూడా బాగా సహాయపడతాయి. ఈ ఆకుల్లో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అందుకే జామ ఆకులను మధుమేహులకు ఒక వరంలా భావిస్తారు. జామ ఆకుల టీని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.  
 

రక్తపోటు నియంత్రణ 

జామ ఆకులు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. ఈ ఆకుల్లో పొటాషియం, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు పెరగకుండా కాపాడుతాయి. బీపీ ఎక్కువైనప్పుడు జామ ఆకుల టీని తాగండి. కంట్రోల్ అవుతుంది. 
 

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల బరువు పెరగడంతో పాటుగా గుండెపోటు, గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే జామ ఆకులను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది. 
 

చర్మానికి మేలు 

జామ ఆకులు కూడా మన చర్మానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. 

click me!