కొంతమంది ఎప్పుడూ చూసినా కొట్లాడుకుంటేనే ఉంటారు. ఇలాంటి భార్యా భర్తలు ఒకరికోసం ఒకరు కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. భాగస్వామితో సరిగ్గా మాట్లాడనప్పుడు ఇలా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు భర్తలు చెప్పే చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే తమాషాకు కూడా భర్తలు భార్యలకు ఇలాంటి విషయాలను చెప్పకపోవడమే మంచిది. భార్యలకు ఎలాంటి విషయాలను చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ పని సరిగ్గా చేయడం రాదు
అందరికీ అన్ని పనులు వచ్చి ఉండాలి అన్న రూల్ లేదు. కొందరికి కొన్ని పనులొస్తే.. ఇంకొందరికి అవి కూడా రాకపోవచ్చు. అందుకే మీ భార్య ఏ పనినైనా సరిగ్గా చేయకపోతే.. నీకు ఏ పని సరిగ్గా చేయడం రాదు.. నీకు ఏ పని చేత కాదన్న మాటలను మీ భార్యతో అనకండి. దీనివల్ల వాళ్లు బాధపడతారు. ఈ మాటల వల్ల ఆమె మీకు దూరంగా ఉండటమే బెటర్ అనుకుంటుంది. అందుకే ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడకండి.
వేరే వాళ్లతో పోల్చడం, పొగడటం
మీ భార్యతో పోల్చితే వేరేవాళ్లు మీకు మంచిగా అనిపించి ఉండొచ్చు. కానీ మీ భార్యను వేరే మహిళతో పోల్చడం సరికాదు. ఏ ఒక్కరూ ఒకేలా అస్సలు ఉండరు. ఇలా మీరు వేరే ఆడవాళ్లతో పోల్చితే.. మీ భార్య చాలా బాధపడుతుంది. మీతో గొడవ కూడా పెట్టుకోవచ్చు. అందుకే ఇలాంటి పనులను అస్సలు చేయకండి.
భార్య కుటుంబాన్ని ఎగతాళి చేయడం
మీ భార్య కుటుంబం గురించి ఎగతాళి చేసినా.. చెడుగా మాట్లాడినా వాళ్లకు అస్సలు నచ్చదు. ఒక వేళ ఇలా ఎగతాళిగా మాట్లాడే అలవాటుంటే ఈ రోజు నుంచి మానుకోండి. లేదంటే మీ భార్యకు మీ పై ప్రేమ తగ్గుతుంది. గొడవలు జరిగే ఛాన్స్ కూడా ఉంది.