మనం తినే ఆహారమే (Meals) మన ఆరోగ్యానికి రక్ష. అయితే రోజులో ఎన్నిసార్లు తినాలన్న దానిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఇక అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అయితే రోజుకు ఎన్నిసార్లు తినాలన్న విషయంలో మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. ఒకరు రోజులో ఒకసారి మాత్రమే పూర్తి స్థాయిలో భోజనం చేస్తారు. మరికొందరు రెండుసార్లు చేస్తారు. ఇంకొందరు మూడుసార్లు చేస్తారు. మరికొందరు కొంచెం కొంచెంగా తింటూ నాలుగైదు సార్లు భోజనం తింటూ ఉంటారు. ఒక వ్యక్తి ఎన్ని సార్లు తింటే ఆరోగ్యకరమో తెలుసుకోండి.
24
సమతుల్య భోజనం
రోజులో ఎన్నిసార్లు తింటామన్నది ముఖ్యం కాదు.. మన శరీరానికి సమతుల్య భోజనం, ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందా లేదా అన్నది చూసుకోవాలి. మీకు వీలైనట్టు రోజుకు రెండు నుండి మూడుసార్లు భోజనం తినడం ఉత్తమం. ఆ రెండు మూడు భోజనాల్లో అల్పాహారం ఎంతో ప్రధానమైనది. ఇక మధ్యాహ్న భోజనం తప్పనిసరి. రాత్రి భోజనం చాలామంది తినరు. ఆ సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు వంటివి తింటూ ఉంటారు. ఏదైనా సరే ఆకలితో పొట్టను ఎక్కువసేపు ఉంచకూడదు. మీ భోజనం సమతుల్యంగా ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఖనిజాలు అన్నీ నిండి ఉండేలా చూసుకోవాలి.
34
రోజులో ఒకసారి మాత్రమే తింటే
కొంతమంది ఈరోజుకు ఒకసారి మాత్రమే పూర్తి భోజనం చేస్తారు. ఈ పద్ధతి బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. కానీ సురక్షితమైన పద్ధతి మాత్రం కాదు. శారీరక శ్రమ అధికంగా చేసేవారు లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా ఒకసారి తినడం అనేది వారికి అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఒకసారి పూర్తిస్థాయిలో భోజనం చేసేవారు ప్రతి రెండు మూడు గంటలకి ఏదో ఒక ఆహారాన్ని తింటూ ఉండాలి. నట్స్, సీడ్స్, పండ్లు, క్యారెట్లు వంటివి తింటూ ఉంటే ఎలాంటి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడవచ్చు.
ఇక రోజుకి రెండు మూడుసార్లు తినే వారితో ఇలాంటి సమస్య లేదు. మరి కొందరు నాలుగైదు సార్లు భోజనాన్ని తింటారు. అయితే వాటిని చిన్నచిన్న భోజనాలుగా విడదీసుకొని తింటారు. ఇది నిజానికి మంచి పద్ధతి. జీవక్రియను చురుకుగా ఉంచుతుంది. శరీరానికి శక్తి అందేలా చేస్తుంది. అదే నాలుగైదు సార్లు భోజనం చేసేవారు తక్కువ పరిమాణంలోనే తినాలి. ప్రతిసారి ఎక్కువ పరిమాణంలో తింటే త్వరగా బరువు పెరిగిపోతారు. క్యాలరీలు అధికంగా శరీరంలో చేరుతాయి. ఇక జంక్ ఫుడ్, పంచదార కలిసిన స్వీట్లు వంటివి మాత్రం తీసుకోవడం మంచిది కాదు.