Heat Wave: ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనిషి సాధారణంగా ఎంత వరకు ఎండను తట్టుకోగలడో ఎప్పుడైనా ఆలోచించారా.?
దేశంలో ఎండలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఈ పరిస్థితిలో ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. మన శరీరం ఎంత వరకు వేడిని తట్టుకోగలదు? ఇప్పుడు తెలుసుకుందాం.
25
‘వెట్ బల్బ్ టెంపరేచర్’ అంటే ఏమిటి?
మన శరీరం కేవలం ఉష్ణోగ్రతను మాత్రమే కాకుండా.. వేడి, తేమ కలయికను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. దీనినే ‘వెట్ బల్బ్ టెంపరేచర్’ అంటారు. ఇంతకుముందు శాస్త్రవేత్తలు మనిషి శరీరం 35°C వరకు ఈ స్థితిని తట్టుకోగలదని భావించారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం ఈ పరిమితి అంత ఎక్కువగా లేదని తెలిసింది. సుమారు 30°C నుంచి 31°C వరకు ఉన్న వెట్ బల్బ్ టెంపరేచర్‌ను మాత్రమే శరీరం సురక్షితంగా తట్టుకోగలదని నిపుణులు చెబుతున్నారు.
35
తేమ ఉన్నప్పుడు ప్రమాదం ఎందుకు ఎక్కువ?
పొడి వాతావరణంలో మన శరీరం చెమట ద్వారా చల్లబడుతుంది. చెమట ఆవిరైపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట సరిగా ఆవిరైపోదు. దీంతో శరీరం చల్లబడే ప్రక్రియ ఆగిపోతుంది. ఇది తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ప్రమాదకరంగా మారుతుంది. తేమతో కూడిన వేడి, పొడి వేడి కంటే ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది.
మన శరీర ఉష్ణోగ్రత 40°C దాటితే పరిస్థితి తీవ్రమవుతుంది. ఈ దశలో హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో శరీరం చల్లబడే వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో తలతిరగడం, గందరగోళం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సమయానికి చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు.
55
ముఖ్య అవయవాలపై ప్రభావం
అధిక వేడి కేవలం అసౌకర్యాన్ని మాత్రమే కలిగించదు, మన శరీరంలోని ముఖ్య అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. మెదడులో వాపు రావచ్చు, దీనివల్ల గందరగోళం లేదా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. హృదయం ఎక్కువగా పనిచేయాల్సి రావడం వల్ల దానిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.