పొల్యూషన్ నుంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే.. తప్పక తినండి..

First Published Dec 8, 2022, 3:53 PM IST

వాయు కాలుష్యం మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. అయితే కొన్ని రకాల పోషకాలను, ఆహారాలను తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

ఒక్క వాతావరణ కాలుష్యం చాలు మన ప్రాణాలు తొందరగా పోవడానికి. ఎందుకంటే కాలుష్యం మన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. భారీ లోహాలు, ప్రాణాంతక రసాయనాలు, వైరస్ లు, బ్యాక్టీరియా, విష వాయువులు వంటి జీవ కాలుష్య కారకాలు సాధారణ కాలుష్య కారకాలు. అయితే ఈ వాయు కాలుష్యం మన ఆరోగ్యంపై దాని ప్రభావం, నష్టం నుంచి రక్షించడానికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

మన దేశంలో వాయు కాలుష్యం ప్రధానంగా.. డీజిల్, పెట్రోల్ వాడకం, వాహనాలు, జనరేట్లరు, పరిశ్రమలలో డీజిల్, పెట్రోల్ ను వాడటం, బొగ్గును కాల్చడం, బయోమాస్, వ్యర్థాలను కాల్చడం, దూళి వల్ల జరుగుతుంది. ఈ వాయుకాలుష్యం గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఈ వాయు కాలుష్యానికి ఎక్కువగా పట్టణ ప్రజలే బలై పోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

వాయు కాలుష్యం వల్ల శ్వాసకోస సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం, ఊపిరితిత్తుల క్యాన్సర్, సిఓపీడీ, అకాల మరణం వంటి ఎన్నో సమస్యల బారిన పడతారు. అంతేకాదు గుండె జబ్బులు, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్, రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.
 

కాలుష్యం నుంచి రక్షించే పోషకాలు

1. ఒమేగా -3

ఒమేగా 3 పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వాయు కాలుష్య కారకాల వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే గుండె జబ్బులపై వాటి ప్రభావం పడకుండా చూస్తాయి. ఒమేగా -3 కొవ్వులు ట్రైగ్లిజరైడ్స్, గుండె పనిచేయకపోవడం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఒమేగా -3 కొవ్వులకు మంచి వనరులలో చేప నూనెలు ముందుంటాయి. అందుకే సాల్మన్, మాకేరెల్, ట్రౌట్ వంటి కొవ్వు చేపలను వారానికి కనీసం 3 సార్లైనా తినండి. ఈ ఆహారాలలో డిహెచ్ఎ,ఇపిఎ ఒమేగా -3 రూపాలు ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగుంటాయి. శాకాహారులైతే.. వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలను తినొచ్చు. వీటితో పాటుగా ఆకుకూరలు, మెంతులు, కలచానా, రాజ్మా, బజ్రా లో కూడా ఒమేగా -3 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. 
 


2. బి విటమిన్లు

విటమిన్ బి -2, విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలేట్ జీవక్రియకు ఎంతో సహాయడతాయి. ఇవి గుండె అనారోగ్య సమస్యలు, నాడీ వ్యాధులు, క్యాన్సర్లను నివారిస్తాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం హానికరమైన ప్రభావాల నుంచి మనల్ని రక్షించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్ నీటిలో కరుగుతుంది. కాబట్టి వాటిని రోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి 2.. రిబోఫ్లేవిన్ పాలు, గుడ్లు, పెరుగు, పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటుంది.  విటమిన్ బి 6.. పిరిడాక్సిన్, పౌల్ట్రీ, వేరుశెనగ, సోయా బీన్స్, ఓట్స్, అరటి, పాలలో ఉంటుంది. విటమిన్ బి 12 ఎక్కువగా జంతువుల ఆహార వనరులలో ఉంటుంది. పాలు,జున్నులో కూడా ఇది పుష్కలంగా ఉంటుంది. ఇకపోతే ఫోలేట్.. ఆకుకూరలు, వైట్ శనగలు, రాజ్మా, పెసరపప్పుల్లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
 

3. విటమిన్ సి

వాయు కాలుష్యం నుంచి బయటడాలంటే మన శరీరానికి విటమిన్ చాలా అవసరం. ఎందుకంటే వాయు కాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులే ముందుగా ప్రభావితమవుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండదు. శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఈ విటమిన్ సి మన శరీరంలో ఒక బలమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ సి సిట్రస్ పండ్లు, కొత్తిమీర, ఉసిరికాయ, జామ, టమోటా, బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. 
 

4. విటమిన్ ఇ

విటమిన్ ఇ.. మంట వల్ల కలిగే నష్టం నుంచి మనల్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్. ఈ రెండు లక్షణాలు కలుషితమైన గాలిని పీల్చడం వల్ల కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తులను రక్షించడానికి చాలా చాలా అవసరం. ఇది మన రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఇది ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. విటమిన్ ఇ.. పొద్దు తిరుగుడు గింజలు, కుసుమలు, సోయా, గోధుమలు,  వేరుశెనగ, బచ్చలికూర, దుంప ఆకుకూరలు, రెడ్ బెల్ పెప్పర్స్, బాదం, సాల్మన్ లో పుష్కలంగా ఉంటుంది.
 

5. పసుపు

పసుపు శక్తివంతమైన శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండూ వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టం నుంచి మనల్ని రక్షిస్తాయి. శ్వాసకోశ సమస్య లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి ఇది సహాయపడుతుంది. అందుకే పాలలో కషాయంగా, మీ రోజువారీ వంటలో పక్కాగా పసుపును జోడించండి. 
 

click me!