డార్క్ చాక్లెట్లు నిజంగా ఆరోగ్యానికి మంచే చేస్తాయా?

First Published Jan 28, 2023, 12:56 PM IST

డార్క్ చాక్లెట్లలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చక్కెర ఎక్కువగా ఉండే వాటికి ఇవి మంచి ప్రత్యమ్నాయాలు. వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని అనుకుంటారు. మరి దీనిలో నిజమెంతుందో తెలుసా..? 
 

డార్క్ చాక్లెట్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో కారకాలు ఉంటాయని చాలా మందికి తెలుసు. దీనిలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాల కంటే ఇవే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు బదులుగా వీటిని తింటుంటారు. 
 

డార్క్ చాక్లెట్లను తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతుంటారు. ఈ డార్క్ చాక్లెట్లు గుండెకు రక్తప్రసరాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఇది స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని డార్క్ చాక్లెట్లను రోజూ తినేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు డార్క్ చాక్లెట్లను గురించి పూర్తిగా తెలుసుకోవాలంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. 
 

కొన్ని డార్క్ చాక్లెట్ బార్లలో కాడ్మియం, సీసం ఉంటాయి. రెండు హెవీ లోహాలు ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. డార్క్ చాక్లెట్లను గర్భిణీలు, చిన్న పిల్లలు తినడం అంత మంచిది కాదు. ఇవి వారికి ఎన్నో సమస్యలను కలిగిస్తాయి. ఈ రెండు లోహాలు పిల్లల్లో పెరుగుదల సమస్యలను కలిగిస్తాయి. అలాగే దీన్ని ఎక్కువ కాలంగా తింటే మాత్రం రక్తపోటు బాగా పెరిగిపోతుంది.  మూత్రపిండాల వైఫల్యాలు, పునరుత్పత్తి సమస్యలతో పాటుగా, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి’అని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్వీట్ చేశారు.  
 

డార్క్ చాక్లెట్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఈ చాక్లెట్లలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. 50 శాతం మంది ఈ డార్క్ చాక్లెట్లను ఆరోగ్యకరమైన వాటిగా భావిస్తారు. మనం ఆరోగ్యంగా భావించే ఈ చాక్లెట్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో హానికలిస్తాయి. కొన్ని డార్క్ చాక్లెట్ బార్లలో సీసం, కాడ్మియం లు ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లోహాలు ఎన్నో దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని చెప్పారు. 
 

ముఖ్యంగా చిన్నపిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీలకు  ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇవి తక్కువ ఐ క్యూకు దారితీస్తాయట. అలాగే మెదడును కూడా ప్రభావితం చేస్తాయని నిరూపించబడింది. 
 

ఇక ఈ డార్క్ చాక్లెట్లలో ఉండే సీసం పెద్దవారిలో అధిక రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, నాడీ వ్యవస్థ సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వంటి సమస్యలను కలిగిస్తుందని డాక్టర్ సుధీర్ తెలుపుతున్నారు. అయితే డార్క్ చాక్లెట్లను కొనే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు కొనే చాక్లెట్లలో కాడ్మియం, సీసం స్థాయిలు తక్కువగా ఉండేలా చూసుకోండి. మరీ ముఖ్యంగా వీటిని రోజూ తినకండి. అప్పుడప్పుడు తింటేనే  ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అలాగే కోకో కంటెంట్ తక్కువగా ఉండే చాక్లెట్లనే తినండి. మరొక ముఖ్యమైన విషయం డార్క్ చాక్లెట్లను గర్భిణులు, చిన్నపిల్లలు అసలే తినకూడదు. 

click me!