ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉండాలంటే వీటిని తినండి..

First Published Jan 21, 2023, 2:49 PM IST

రోజుకు మూడు పూటలా తిన్నా.. మధ్య మధ్యలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అది కూడా ఆరోగ్యాన్ని పాడుచేసేవే. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమొచ్చినట్టు తింటే మీ బరువు ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఆకలి అదుపులో ఉండాలంటే  ఎక్కువ సేపు మీ కడుపును నిండుగా ఉంచే వాటిని తినాలి. 

మితిమీరిన ఆకలి ఈ రోజుల్లో చాలా మందికి ఒక సమస్యగా మారిపోయింది. రోజుకు సరిగ్గా మూడు పూటలా భోజనం చేసినా అప్పుడప్పుడూ ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడే ఏవి పడితే అవి తింటే శరీర బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఆకలిగా అనిపించినప్పుడు చాలా మంది వేయించిన, ఫ్రైడ్ ఫుడ్స్ నే తింటుంటారు. ఇవి బరువును పెంచడంతో పాటుగా గుండె జబ్బులతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తాయి. 
 

నిజానికి సరిగ్గా తిన్నా ఆకలి కావడానికి ఆకలి హార్మోన్లే కారణమంటున్నారు నిపుణులు. అయితే ఆకలిని నియంత్రించడానికి, మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


బాదం

రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులను తింటే మీ బరువు అదుపులో ఉండటమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. బాదం పప్పుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, విటమిన్ ఇ, ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పప్పుల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.  బాదంలో ఉండే విటమిన్ ఇ, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆకలిని నియంత్రిస్తాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనిలో ఉండే  ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. 
 

కొబ్బరి

కొబ్బరిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. కొబ్బరిని తినడం వల్ల ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరిలో మీడియం  చైన్ ట్రైగ్లిజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా ఫాస్ట్ గా కరిగిస్తాయి. అలాగే ఆకలిని నియంత్రిస్తాయి. కొబ్బరిని తీసుకోవడం వల్ల మీరు కేలరీలను తక్కువగా తీసుకుంటారు. మొత్తంగా ఇది మీరు అతిగా తినకుండా చేస్తుంది. 
 


శెనగ మొలకలు

శెనగ మొలకల్లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఎందుకంటే శెనగల్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్లు  నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీంతో మీకు అంత తొందరగా ఆకలి కాదు. ఈ గింజలు ఆకలి హార్మోన్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే మీరు తర్వాతి భోజనంలో చాలా తక్కువగా తింటారు. ఈ గింజల్లో బి విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ మొలకల్లో ఫైబర్, మల్టీ విటమిన్, ప్రోటీన్, మల్టీ మినరల్ ఉంటాయి. వీటిని సలాడ్, ఇతర కూరగాయలతో చాట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. 
 

మజ్జిగ

మజ్జిగ ప్రోబయోటిక్ పానీయం. దీనిలో పాలవిరుగుడు ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీన్ని తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అంతేకాదు ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది. మజ్జిగలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఆకలిని తగ్గించడంలో ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా. 

అవిసె గింజలు, కూరగాయల రసం

కూరగాయల రసం కూడా మీరు సులువుగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఈ రసం మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. గట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే వీటిని కాల్చిన ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను కూడా చేర్చొచంటున్నారు నిపుణులు. 

click me!