ప్రస్తుత లైఫ్ స్టైల్, పని వేళలు ఇతర కారణాలతో మనలో చాలామంది రాత్రిపూట లేటుగా పడుకొని ఉదయం లేటుగా నిద్ర లేస్తుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. రాత్రిపూట టైంకి పడుకొని, ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?
రాత్రిపూట లేటుగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్రలేవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గంటల కొద్దీ ఫోన్లు, టీవీలు చూడటం.. ఏ రాత్రికో నిద్రపోవడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ రాత్రిపూట టైంకి నిద్రపోయి.. వేకువజామున నిద్రలేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఇంకెప్పుడు లేటుగా నిద్రపోరు. సమయానికి నిద్ర పోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
24
ఆరోగ్యానికి మంచిది
రాత్రిపూట శరీరం తగినంత విశ్రాంతి తీసుకుంటే.. కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ల వంటివి సమతుల్యంగా ఉత్పత్తి అవుతాయి. ఉదయం త్వరగా నిద్ర లేవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజు మొత్తం ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
మానసిక ప్రశాంతత
ఉదయం తొందరగా నిద్రలేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో ధ్యానం, యోగా, పఠనం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
34
ఉత్పాదకత పెరుగుతుంది
ఉదయం వేళలో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. ఆ సమయంలో చదవడం, పని చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం చేయడం వల్ల సమయం కూడా వృథా కాకుండా ఉంటుంది.
మెరుగైన నిద్ర
సమయానికి నిద్రపోవడం, సమయానికి నిద్ర లేవడం వల్ల జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. దీనివల్ల నిద్ర సమస్యలు దూరం అవుతాయి. అలసట తగ్గుతుంది. ప్రతి రోజు ఒకే సమయానికి పడుకునే అలవాటు వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది.
వేళకు నిద్ర లేచినవారికి ఎక్కువ సమయం ఉంటుంది. నిదానంగా, సమయానికి బ్రేక్‌ఫాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
రాత్రిపూట త్వరగా నిద్రపోయి.. తెల్లవారుజామున లేచే మంచి అలవాటు మన జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా మారుస్తుంది.