మనం రెగ్యులర్‍గా వంటల్లో వాడే కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కరివేపాకును ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి ఎవరు తినకూడదు? తింటే ఏమవుతుంది? వంటి విషయాలు ఇక్కడ చూద్దాం.
కరివేపాకు వంటలకు మంచి వాసన, రుచి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. విటమిన్లు A, B, C, Eతో పాటు ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు కరివేపాకులో సమృద్ధిగా ఉంటాయి. మెరుగైన జీర్ణక్రియ, జుట్టు ఆరోగ్యం, షుగర్ నియంత్రణకు కరివేపాకు సహాయపడుతుంది. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు.. కొన్ని సమస్యలు ఉన్నవారికి మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి కరివేపాకును ఎవరు తినకూడదో ఇక్కడ చూద్దాం.
25
అలెర్జీ సమస్య ఉన్నవారు
అలెర్జీ సమస్య ఉన్నవారు కరివేపాకును అస్సలు తినకూడదు. కొందరికి దీన్ని తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, ఎర్రబడటం, వాంతులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించడం మంచిది. అలెర్జీ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
35
డయాబెటీస్ ఉన్నవారు
సాధారణంగా డయాబెటీస్ ఉన్నవారు ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా మంచి లక్షణమే అయినప్పటికీ, ఇప్పటికే షుగర్ నియంత్రణ కోసం మందులు వాడుతున్నవారు ఎక్కువగా కరివేపాకు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా తగ్గిపోవచ్చు. దానివల్ల తల తిరగడం, బలహీనత, చెమటలు పట్టడం, హార్ట్ బీట్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి వారు కరివేపాకును పరిమితంగా తీసుకోవాలి.
కరివేపాకు కొంతవరకు రక్తపోటును తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా హై బీపీ ఉన్నవారికి ఉపయోగపడుతుందే గానీ, ఇప్పటికే బీపీ తక్కువగా ఉన్నవారికి ప్రమాదకరం కావచ్చు. ఎక్కువగా తీసుకుంటే తల తిరగడం, అలసట, మూర్ఛ వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల లో బీపీ ఉన్నవారు దీన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
55
శస్త్ర చికిత్సకు ముందు
శస్త్ర చికిత్సకు సిద్ధమవుతున్నవారు కూడా కరివేపాకు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. నిపుణుల ప్రకారం, శస్త్రచికిత్సకు ముందు, తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. కరివేపాకు చక్కెర స్థాయిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, సర్జరీకి కనీసం రెండు వారాల ముందు దీన్ని తగ్గించడం లేదా పూర్తిగా ఆపేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.