ఆరోగ్యంగా ఉండడానికి మనం రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. కొన్ని ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరికొన్ని అంతగా ఫలితాలు ఇవ్వవు. అయితే రోజుకు 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
సైక్లింగ్ కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. శారీరకంగా, మానసికంగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కండరాలను బలపరుస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు కేవలం 30 నిమిషాలు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
కండరాల బలోపేతానికి..
సైక్లింగ్ ఒక ఏరోబిక్ వ్యాయామం. ఇది గుండె, ఊపిరితిత్తులు, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ వ్యాయామం కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించదు. ముఖ్యంగా ఇది అన్ని వయసుల వారికి ఉపయోగకరమైన, సురక్షితమైన వ్యాయామం. ప్రతిరోజు 30 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం ద్వారా సహనం, శక్తి, సామర్థ్యం పెరుగుతాయి. ఫలితంగా రోజువారీ పనులు చురుకుగా చేసుకుంటారు. రక్తప్రసరణ పెరగడం వల్ల చర్మం మెరుస్తుంది, ముడతలు తగ్గుతాయి.
36
మానసిక ఆరోగ్యానికి..
సైక్లింగ్ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రతిరోజూ సైకిల్ తొక్కినప్పుడు మనసు ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం నుంచి బయటపడుతుంది. స్వచ్ఛమైన గాలి, ప్రకృతిలో ఉండడం, శారీరక కదలికల వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సైక్లింగ్ సమయంలో శరీరంలో ఎండోర్ఫిన్లు (సంతోషాన్ని కలిగించే హార్మోన్లు) విడుదలవుతాయి. దానివల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడి తగ్గుతాయి.
రోజూ 30 నిమిషాలు సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సైక్లింగ్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కడం వల్ల సామాజిక బంధాలు బలపడుతాయి.
56
మంచి నిద్ర
ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల చక్కగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ సమయంలో రక్తప్రసరణ మెరుగై.. శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా మెలటోనిన్ ఉత్పత్తి సక్రమమవుతుంది. ఇది నిద్రకు సహాయపడుతుంది. అలాగే, సైకిల్ తొక్కడం మానసిక ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతం చేస్తుంది. ఫలితంగా నిద్రలో గాఢత, స్థిరత్వం వస్తుంది. ప్రతిరోజు సైకిల్ రైడ్ చేసిన వారు త్వరగా నిద్రపోతారు. ఉదయాన్నే త్వరగా, ఉత్సాహంగా నిద్రలేస్తారు.
66
నీళ్లు తప్పకుండా తాగాలి
బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో 10-15 నిమిషాలతో ప్రారంభించి.. క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి అంటున్నారు. సైక్లింగ్ చేసేటప్పుడు నీళ్లు తప్పకుండా తాగాలని సూచిస్తున్నారు.