చాలామందికి చేతి గోళ్ల చుట్టూ చర్మం ఊడిపోవడం మనం చూస్తుంటాం. దీనివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. కొందరైతే సరిగ్గా తినలేరు కూడా. చాలా మంది దీన్ని చిన్న విషయంగా భావించి పట్టించుకోరు. అయితే ఈ సమస్య తరచుగా వస్తుంటే దానికి కారణాలు తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. గోళ్ల చుట్టూ చర్మం ఊడడానికి కారణాలు, నివారించే చిట్కాలు ఇక్కడ చూద్దాం.
వేలి గోళ్ల చుట్టూ చర్మం ఊడటానికి కారణాలు:
చలి కాలం, పొడి వాతావరణం:
చలి కాలంలో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల చర్మం పొడిబారి పగుళ్లు వస్తాయి. ఈ మార్పు మొదట చేతులపై కనిపిస్తుంది. క్రమంగా వేళ్లపై చర్మం ఊడటం మొదలవుతుంది.
తరచుగా చేతులు కడగడం లేదా శానిటైజర్ ఉపయోగించడం:
కరోనా తర్వాత శానిటైజర్ వాడటం, తరచుగా చేతులు కడగడం ఎక్కువైంది. అయితే, ఎక్కువగా సబ్బు లేదా ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ వాడటం వల్ల చర్మం పొడిబారుతుంది. దీని వల్ల చర్మం ఊడిపోతుంది.
పోషకాహార లోపం:
శరీరానికి తగినంత విటమిన్ బి, ఈ, సి, ఐరన్ అందకపోతే చర్మం బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా మీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లేకపోతే వేళ్లపై చర్మం త్వరగా ఊడిపోతుంది.
చర్మ ఇన్ఫెక్షన్:
వేళ్లపై చర్మం దురదగా, ఎర్రగా, వాపుగా ఉంటే అది చర్మ ఇన్ఫెక్షన్ లేదా అలర్జీకి సంకేతం కావచ్చు. దీని వల్ల వేళ్లపై చర్మం ఊడటం మొదలవుతుంది.
మానసిక ఒత్తిడి:
కొందరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో తెలియకుండా వేళ్లపై చర్మాన్ని తీయడం మొదలుపెడతారు. ఇది ఒక రకమైన ఆందోళనకరమైన అలవాటు. ఈ అలవాటు క్రమంగా పెరిగి వేళ్ల చర్మాన్ని దెబ్బతీస్తుంది.
గోళ్ల దగ్గర చర్మం ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మాయిశ్చరైజర్:
పొడిబారిన చర్మాన్ని నయం చేయడానికి చర్మాన్ని తేమగా ఉంచాలి. కొబ్బరి నూనె, కలబంద లేదా ఏదైనా మంచి మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు, మూడు సార్లు చేతులకు రాయండి.
వేడి నీరు:
వేలి కొనల వద్ద చర్మం తరచుగా ఊడుతుంటే, చేతులను గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ లేదా గ్లిసరిన్ రాయండి. ఇది చర్మాన్ని బాగు చేస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం:
పండ్లు, కూరగాయలు, గింజలు, పెరుగు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోండి.
చేతులను రక్షించుకోండి:
పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా చేతి తొడుగులు వాడండి.
చర్మం ఊడగొట్టే అలవాటును మానుకోండి!
ఒత్తిడిలో ఉన్నప్పుడు గోళ్ల వద్ద చర్మాన్ని ఊడగొట్టే అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించండి. బదులుగా వేరే ఏదైనా విషయంపై దృష్టి పెట్టండి.