Pregnancy: గర్భధారణ సమయంలో ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవాలంటే గర్భిణీలు భయంతో ఉంటారు. ముఖ్యంగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు ఆటిజం వచ్చే ప్రమాదం ఉంటుందనే వార్త వైరల్ అవుతోంది. తాజా పరిశోధన వీటికి చెక్ పెట్టింది.
ది లాన్సెట్ ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ అండ్ ఉమెన్స్ హెల్త్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన ప్రకారం, గర్భధారణ సమయంలో సరైన విధంగా పారాసిటమాల్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆటిజం, ADHD లేదా మానసిక అభివృద్ధి సమస్యలు వచ్చే ప్రమాదానికి నేరుగా సంబంధం లేదని తేలింది. ఈ స్టడీ చాలా పెద్దది, నమ్మదగినది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
25
ఈ స్టడీ ఎలా నిర్వహించారు?
ఈ పరిశోధనలో మొత్తం 43 క్లినికల్ స్టడీలను విశ్లేషించారు. అలాగే స్వీడన్‌లో సుమారు 25 లక్షల పిల్లల డేటాను కూడా పరిశీలించారు. శాస్త్రవేత్తలు “సిబ్లింగ్ కంపారిజన్” అనే పద్ధతిని ఉపయోగించారు. అంటే ఒకే తల్లి నుంచి పుట్టిన పిల్లల్లో ఒక గర్భధారణలో పారాసిటమాల్ వాడిన సందర్భం, మరొక గర్భధారణలో వాడని సందర్భాన్ని పోల్చారు. ఫలితంలో తేలిన దాని ప్రకారం ఇద్దరు పిల్లల్లో కూడా ఆటిజం లేదా ఇతర మానసిక సమస్యల ప్రమాదంలో ఎలాంటి తేడా కనిపించలేదు.
35
అంతకు ముందు అధ్యయనాల్లో గందరోళం
ఇంతకు ముందు కొన్ని పరిశోధనల్లో పారాసిటమాల్ వాడకానికి, ఆటిజం మధ్య కొంత సంబంధం ఉన్నట్టు కనిపించింది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం పారాసిటమాల్ తీసుకున్న మహిళలకు ఇప్పటికే జ్వరం, నొప్పి లేదా ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుంది. ఈ సమస్యలే పిల్లల అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే దీనికి జన్యు (Genetic) కారణాలు కూడా పాత్ర పోషిస్తాయి. ఈ కారణాల వల్లే అప్పట్లో తప్పు అర్థం చేసుకున్నారు.
వైద్య నిపుణుల ప్రకారం, పారాసిటమాల్ ఇప్పటికీ గర్భిణీలకు సురక్షితమైన నొప్పి నివారణ మందులలో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని అవసరమైన ముఖ్యమైన మందుల జాబితాలో చేర్చింది. ఇది NSAIDs లేదా ఓపియాయిడ్ మందుల కంటే ఎక్కువ సురక్షితం. అయితే తక్కువ మోతాదులో, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి.
55
మందు తీసుకోకపోతే ప్రమాదమా?
కొంతమంది మహిళలు భయంతో మందులు తీసుకోవడం మానేస్తారు. కానీ ఇది మరింత ప్రమాదకరం కావచ్చు.
జ్వరం తగ్గించకపోతే గర్భస్రావం ప్రమాదం, ముందస్తు ప్రసవం (Preterm Birth), పుట్టే బిడ్డలో ఆరోగ్య సమస్యలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే డాక్టర్ సలహా తీసుకుని చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీలు నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే పారాసిటమాల్ వాడాలి. తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మీ ఇష్టం ప్రకారం ఎక్కువ మోతాదులో తీసుకోకండి.
గమనిక: గర్భధారణ సమయంలో సరైన విధంగా పారాసిటమాల్ వాడితే బిడ్డకు ఆటిజం వస్తుందని చెప్పడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు. కాబట్టి భయపడకుండా, కానీ జాగ్రత్తగా డాక్టర్ సలహాతో మాత్రమే మందులు వాడటం మంచిది.