Milind Soman Fitness Secrets: 60 ఏళ్ల వయసులోనూ సూపర్ మోడల్ మిలింద్ సోమన్ ఎలా అంత ఫిట్‌గా ఉంటారు? ఫిట్‌నెస్ ఐకాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన మిలింద్ సోమన్ తాజాగా తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫిట్‌నెస్ ప్రపంచంలో మిలింద్ సోమన్ ఒక తిరుగులేని ఐకాన్. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా కనిపిస్తారు. అయితే, మిలింద్ తన డైట్ ప్లాన్ ను రివీల్ చేశారు. వరల్డ్ పల్స్ సమ్మిట్‌లో పాల్గొన్న మిలింద్, తన ఫిట్‌నెస్ ప్రయాణం, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మనం తినే ఆహారం పట్ల ఎంత స్పృహతో ఉండాలో ఆయన వివరించారు.
25
ఆహారం తింటున్నారా? మైండ్‌ఫుల్ ఈటింగ్ ఏమిటి?
మిలింద్ సోమన్ మాట్లాడుతూ మైండ్‌ఫుల్ ఈటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అది మనల్ని ఎటు తీసుకెళ్తోంది అనే అవగాహన ఉండటమే మైండ్‌ఫుల్నెస్. ఇది అలవాటైతే, మనం తీసుకునే నిర్ణయాలు దానంతటవే సరైనవిగా మారుతాయి" అని ఆయన అన్నారు. చాలా మందికి చీట్ మీల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ మిలింద్ దాన్ని నమ్మరు. తన మనసు, శరీరం రెండూ కలిసి పనిచేస్తాయని, అందుకే తనకు అనారోగ్యకరమైన కోరికలు కలగవని ఆయన వెల్లడించారు.
35
శరీరానికి బిర్యానీ కావాలా?
బిర్యానీ వంటి ఆహార పదార్థాల మీద కలిగే కోరికల గురించి మిలింద్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. "మీరు ఈరోజు బిర్యానీ తినాలి అనుకుంటున్నారు.. ఎందుకు? మీ శరీరానికి నిజంగా బిర్యానీ అవసరమా? కచ్చితంగాాాా అవసరం లేదు. అది కేవలం మీ మానసిక అవసరం మాత్రమే. మన సమాజంలో చాలా మందికి అసలైన ఆకలి అంటే ఏంటో తెలియదు. మనసు, శరీరం మధ్య సంబంధం తెగిపోయినప్పుడు మాత్రమే మనం తప్పుడు ఆహార నిర్ణయాలు తీసుకుంటాం" అని ఆయన వివరించారు. భావోద్వేగాల కోసం తినడం మానేయాలని ఆయన సూచించారు.
తన వ్యక్తిగత దినచర్య గురించి వివరిస్తూ, గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపారు. "నేను 16 గంటల పాటు ఏమీ తినను. కేవలం 8 గంటల సమయంలోనే ఆహారం తీసుకుంటాను. దీనివల్ల నా శక్తి పెరిగింది, ఏకాగ్రత కుదిరింది. తక్కువ తినడం వల్ల నా శరీరం అద్భుతంగా స్పందిస్తోంది" అని చెప్పారు. ఆ 8 గంటల సమయంలో తనకు నచ్చింది తిన్నప్పటికీ, చక్కెరను తగ్గించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఉదాహరణకు టేబుల్ మీద సమోసా, గులాబ్ జామ్ ఉంటే, షుగర్ తక్కువగా ఉండే సమోసానే తింటానని చెప్పారు.
55
తల్లిదండ్రుల బాధ్యత అదే..
నేటి కాలంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే సాఫ్ట్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు అలవాటు చేయడంపై మిలింద్ ఆందోళన వ్యక్తం చేశారు. "మా నాన్న న్యూక్లియర్ సైంటిస్ట్, అమ్మ బయోకెమిస్ట్. మా తాతమ్మ, తాతయ్యలు నలుగురూ డాక్టర్లే. అందుకే వారికి ఆరోగ్యంపై పూర్తి అవగాహన ఉంది. నేను 23 ఏళ్ల వరకు సాఫ్ట్ డ్రింక్స్ తాగలేదు, బయట ఫుడ్ తినలేదు. చిన్నప్పుడు మనకు ఏది అలవాటు చేస్తే, అదే జీవితాంతం కొనసాగుతుంది" అని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో 40, 50 ఏళ్లకే వస్తున్న ఆరోగ్య సమస్యలకు ఏళ్ల తరబడి చేస్తున్న నిర్లక్ష్యమే కారణమని ఆయన హెచ్చరించారు. చివరగా, భారతదేశంలో రన్నింగ్ చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటం సంతోషంగా ఉందని తెలిపారు.