అంగస్తంభన సమస్య గుండె జబ్బుకు సంకేతమా? పురుషులు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ని హెచ్చ‌రిక‌లివే

Published : Jun 03, 2026, 08:39 PM IST

Men Health: వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. అలసట, సరిగా నిద్ర పట్టకపోవడం, గురక పెట్టడం లేదా లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను చాలా మంది పురుషులు సాధారణ విషయాలుగా భావిస్తారు. కానీ దీనిని లైట్ తీసుకోకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
అంగస్తంభన సమస్య సాధార‌ణం కాదు

అంగస్తంభన లోపం (Erectile Dysfunction) అనేది కేవలం లైంగిక సమస్య మాత్రమే కాదని వైద్యులు చెబుతున్నారు. పురుషాంగానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు శరీరంలోని అత్యంత సన్నని రక్తనాళాల్లో ఒకటిగా ఉంటాయి. ఈ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినా లేదా రక్తప్రసరణ తగ్గినా, దాని ప్రభావం మొదటగా అంగస్తంభనపై కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఛాతినొప్పి, గుండెపోటు వంటి లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాల ముందే అంగస్తంభన సమస్య మొదలవుతుంది. ఒకవేళ అకస్మాత్తుగా ఈ సమస్య ప్రారంభమైతే, కేవలం మందులు వాడటంతో సరిపెట్టకుండా గుండె ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

25
తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా హెచ్చరిక కావచ్చు

చాలా మంది పురుషులు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడాన్ని వయసు ప్రభావంగా భావిస్తారు. కానీ దీని వెనుక ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. పొట్ట చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం, సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, వ్యాయామం చేయకపోవడం. ఇలాంటి కారణాల వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పులు చేసి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హార్మోన్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

35
పురుషుల్లో గుండె జబ్బులు త్వరగా ఎందుకు వస్తాయి?

మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండె సంబంధిత వ్యాధులు సుమారు పదేళ్లు ముందుగానే వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో మెనోపాజ్ వచ్చే వరకు ఈస్ట్రోజెన్ హార్మోన్ గుండెకు కొంత రక్షణ కల్పిస్తుంది. అయితే పురుషులకు అలాంటి సహజ రక్షణ ఉండదు. అందువల్ల గుండె ఆరోగ్యంపై శ్రద్ధ 60 ఏళ్ల తర్వాత కాదు, 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే ప్రారంభించాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం.

45
గట్టిగా గురక పెడుతున్నారా? ఇది కూడా ప్రమాద సంకేతమే

రాత్రి సమయంలో ఎక్కువగా గురక పెట్టడం, తరచూ నిద్ర మధ్యలో మేల్కొనడం లేదా తగినంత నిద్రపోయినా అలసటగా అనిపించడం వంటి లక్షణాలు స్లీప్ అప్నియా (Sleep Apnea) సమస్యకు సంకేతాలు కావచ్చు. స్లీప్ అప్నియా వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది, గుండె స్పందనలో అసమతుల్యత ఏర్పడవచ్చు, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది, భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఆందోళనకర విషయం ఏమిటంటే, చాలా మంది పురుషులకు ఈ సమస్య ఉన్నా దాని గురించి తెలియదు.

55
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరం ఇచ్చే చిన్నచిన్న హెచ్చరికలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా అంగస్తంభన సమస్య, తక్కువ టెస్టోస్టెరాన్, అధిక గురక, నిద్ర సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ధూమపానం, ఆల్కహాల్ అలవాట్లకు దూరంగా ఉండాలి, సరైన నిద్రపోవాలి, గుండె ఆరోగ్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు భవిష్యత్తులో గుండెపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. శరీరం ఇచ్చే సంకేతాలను సమయానికి గుర్తిస్తే అనేక ప్రాణాంతక సమస్యలను ముందుగానే నివారించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories