Interesting Fact: మనలో చాలా మంది రక్తాన్ని చూడగానే తల తిరిగిన భావన కలుగుతుంది. కొందరైతే స్పృహ తప్పి కింద కూడా పడుతుంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
కొంతమందికి రక్తం చూడగానే ఒక్కసారిగా తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొందరైతే స్పృహ కూడా కోల్పోతారు. చాలామంది దీన్ని భయం లేదా మానసిక బలహీనతగా భావిస్తారు. కానీ ఇది భయంతో సంబంధం లేని, శరీరంలో సహజంగా జరిగే ఒక ప్రతిచర్య మాత్రమే.
25
వాసోవేగల్ సింకోప్
వైద్యపరంగా ఈ పరిస్థితిని “వాసోవేగల్ సింకోప్” అని అంటారు. రక్తం, గాయం లేదా తీవ్రమైన ఒత్తిడిని చూసినప్పుడు నాడీ వ్యవస్థ ఒక్కసారిగా అతిగా స్పందిస్తుంది. దీని వల్ల గుండె స్పందన మందగిస్తుంది, రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా మెదడుకు చేరాల్సిన రక్తం కొద్దిసేపు తగ్గిపోతుంది. అదే సమయంలో తల తిరగడం లేదా మూర్ఛ వస్తుంది.
35
శరీరం ముందుగా ఇచ్చే హెచ్చరిక సంకేతాలు
మూర్ఛ అనేది ఒక్కసారిగా జరగదు. శరీరం ముందే కొన్ని సూచనలు ఇస్తుంది. తల తిరగడం, చల్లని చెమటలు రావడం, చూపు మసకబారడం, చెవుల్లో శబ్దం వినిపించడం, వికారం, చర్మం పాలిపోయినట్లు కనిపించడం ఇవన్నీ హెచ్చరికలుగా భావించాలి. ఈ లక్షణాలను గుర్తిస్తే ప్రమాదాన్ని ముందే నివారించవచ్చు.
ఈ సమస్య ముఖ్యంగా యువతలో, ఆరోగ్యంగా కనిపించే వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువసేపు నిలబడి ఉండేవారు, తక్కువ నీరు తాగే వారు, ఆకలితో ఉన్నవారు, తీవ్రమైన అలసటలో ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువగా లోనవుతారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా మూర్ఛ అనుభవించే అవకాశం ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
55
తల తిరిగితే వెంటనే ఏం చేయాలి.?
తల తిరుగుతున్నట్లు అనిపించిన వెంటనే నేలపై పడుకుని కాళ్లను పైకి లేపాలి. అది సాధ్యం కాకపోతే కూర్చుని తలను మోకాళ్ల మధ్య ఉంచాలి. బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే వెంటనే విప్పేయాలి. లోతుగా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. చేతులు, కాళ్ల కండరాలను బిగించడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. అయితే తరచూ మూర్ఛలు వస్తే, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.