తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల శారీరక, మానసిక స్థితి దెబ్బతింటుంది. కొన్నిసార్లు తలనొప్పి పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అయితే కొన్ని సహజ చిట్కాల ద్వారా తలనొప్పిని త్వరగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
తలనొప్పి చిన్న సమస్యలా అనిపించినా.. అనేక పెద్ద సమస్యలకు అదే మూలం. విశ్రాంతి లేని పని, తల ఎత్తుకునే తీరిక లేని వారికి తలనొప్పి త్వరగా తగ్గదు. కొందరికి రెండు లేదా మూడు గంటలు, మరికొందరికి రెండు లేదా మూడు రోజులు కూడా తట్టుకోలేని నొప్పి వస్తుంది. తలనొప్పికి అనేక కారణాలున్నాయి.
26
తలనొప్పికి కారణాలు..
కొందరికి మందులను ఎక్కువగా వాడటం వల్ల తలనొప్పి రావచ్చు. కొన్ని అంటువ్యాధులు కూడా తలనొప్పిని కలిగిస్తాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు, ధూమపానం చేసేవారు, నిద్రలేమితో బాధపడేవారు, కెఫిన్ ఎక్కువగా తీసుకునేవారికి తలనొప్పి సమస్య వస్తుంది. తలనొప్పిని తగ్గించుకోవడానికి కొందరు కాఫీ తాగుతారు. కానీ అందులోని కెఫిన్ కూడా తలనొప్పికి కారణమవుతుంది. రెండు సార్లకు మించి కాఫీ తాగడం మంచిదికాదు.
36
తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
ఎక్కువ నీళ్లు తాగండి
తలనొప్పి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎక్కువ నీళ్లు తాగాలి. మన శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్లిపోయినప్పుడు తలనొప్పి రావచ్చు. నీటి కొరత శరీరంలో కొన్ని మార్పులను కలిగిస్తుంది. ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లండి. సరిపడా నీళ్లు తాగండి.
మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే తలనొప్పి వస్తుంది. బాదం, ఆపిల్, అత్తిపండు, బెండకాయ, పాలకూర, మునగకాయ, పల్లీలు, నువ్వులు, ధాన్యాలు వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మెగ్నీషియం లభిస్తుంది.
56
వ్యాయామం
తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. 2018లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. కొందరు వ్యక్తులు మితమైన వ్యాయామాలు చేయడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు తేలింది. రోజువారీ జీవితంలో కనీసం 30 నిమిషాల నడక, సైక్లింగ్ వంటివి చేయడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
66
సరైన నిద్ర
ఒక అధ్యయనం ప్రకారం.. సరైన నిద్ర లేకపోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కాబట్టి తలనొప్పి తగ్గాలంటే హాయిగా నిద్రపోవాలి. కనీసం 6 గంటల నిద్ర అవసరం. సరైన విశ్రాంతి, పోషకాహారం, వ్యాయామాలు తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. మీకు తరచుగా తలనొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.