Vibrio Vulnificus: అమెరికా తీరాల్లో మనిషి మాంసాన్ని తీసే బాక్టీరియా.. భారత్‌ కూడా ముప్పే!

Published : Jul 27, 2025, 02:01 PM IST

Vibrio Vulnificus:  అమెరికాలోని ఫ్లోరిడాలో మాంసం తినే ‘విబ్రియో వల్నిఫికస్’ అనే బాక్టీరియా వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రమాదకర బాక్టీరియా భారత తీరప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

PREV
16
మాంసం తినే బాక్టీరియా

విబ్రియో వల్నిఫికస్ అనేది ఒక ప్రమాదకరమైన బాక్టీరియా. ఇది మనుషుల శరీరంలోకి ప్రవేశించి కణజాల నష్టం చేస్తుంది. ఈ బాక్టీరియా మానవ కణజాలాన్ని నేరుగా తినదు, కానీ విషపూరిత పదార్థాలను విడుదల చేసి కణాలను నాశనం చేస్తుంది. అందుకే దీనిని ‘మాంసం తినే బాక్టీరియా’ అని పిలుస్తుంటారు. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా తీరప్రాంత జలాల్లో, ముఖ్యంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాల్లో ఉంటుంది. మితమైన లవణీయత, వెచ్చని నీటి పరిస్థితులు దాని పెరుగుదలకు అనుకూలం. ఇవి కలుషితమైన నీరు లేదా మురుగునీటిలో కాకుండా సముద్ర పర్యావరణ వ్యవస్థలో సహజంగానే జీవిస్తాయి.

26
విబ్రియో వల్నిఫికస్ ఎలా వ్యాపిస్తుంది?

విబ్రియో వల్నిఫికస్ బాక్టీరియా సంక్రమణ రెండు ప్రధాన మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది వండని లేదా సరిగ్గా వండని సముద్రపు ఆహారం వ్యాప్తి చెందుతుంది.  ముఖ్యంగా సిప్పి, క్లామ్స్, మస్సెల్స్ వంటి షెల్ఫిష్ తినడం ద్వారా ఇది జీర్ణవ్యవస్థలోకి చేరి రక్తంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా శరీరంపై గాయాలు ఉన్నప్పుడు, సముద్రపు నీటిలో ఈత కొడితే, బాక్టీరియా నేరుగా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

36
సంక్రమణ లక్షణాలు

చేపలు పట్టేవారికి లేదా సముద్రపు ప్రయాణాలు చేసేవారికి విబ్రియో వల్నిఫికస్ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే, ఈ బాక్టీరియా ఒక వ్యక్తి నుండి మరొకరికి నేరుగా వ్యాపించదు. కానీ, శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. 

ఆరోగ్యవంతుల వ్యక్తుల్లో సాధారణంగా తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ,  కాలేయ సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వారిలో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాంతక పరిస్థితుల బారిన పడవచ్చు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, చలి, తక్కువ రక్తపోటు వంటి లక్షణాలు కనిపించవచ్చు. 

46
ఎవరిపై తీవ్ర ప్రభావితం చేస్తుంది?

విబ్రియో వల్నిఫికస్ బలహీనమైన, రోగనిరోధక శక్తి  తక్కువ ఉన్నవారికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా కాలేయ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, HIV, లేదా ఇమ్యూనిటీని అణిచివేసే మందులు వాడే వారికి తీవ్ర ప్రమాదం. 

ఈ పరిస్థితుల్లో బాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి సెప్టిసీమియా అనే ప్రాణాంతక రక్త సంక్రమణకు దారితీస్తుంది. దీని వల్ల దాదాపు 50% కేసుల్లో మరణం సంభవించే ప్రమాదం ఉంది. ఒకసారి సంక్రమణ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్య చికిత్స పొందాలి. ఆలస్యం ప్రాణాంతకంగా మారవచ్చు. చికిత్సకు యాంటీబయోటిక్స్ అవసరం అవుతాయి. తీవ్రమైన చర్మ సంక్రమణ ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం.  గాయం తీవ్రంగా ఉండినప్పుడు, కొన్ని సందర్భాల్లో అవయవాన్ని తొలగించాల్సి రావచ్చు.

56
ఈ జాగ్రత్తలు తప్పనిసరి

విబ్రియో వల్నిఫికస్ సంక్రమణను నివారించడానికి, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

  • మొదటిగా వండని లేదా సరిగ్గా వండని సముద్రపు ఆహారం తినడం మానుకోవాలి. సముద్రపు ఆహారాన్ని ఎప్పుడూ బాగా ఉడికించి తినాలి.
  • గాయాలు ఉన్నప్పుడు సముద్రపు నీటిలో ఈత వెళ్లకూడదు. గాయాలపై వాటర్‌ప్రూఫ్ బ్యాండేజ్ వేయాలి. చేపలు లేదా షెల్‌ఫిష్ హ్యాండిల్ చేయాలంటే చేతి తొడుగులు (గ్లోవ్స్) వాడాలి.
  • వండిన, వండని సముద్రపు ఆహారాన్ని వేర్వేరుగా ఉంచాలి. వండిన వాటిని కలుషితం చేయకుండా జాగ్రత్త పడాలి. 
  • వండని సముద్రపు ఆహారాన్ని తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
  • కాలేయ వ్యాధి, డయాబెటిస్ వంటి  వ్యాధులు ఉన్నవారు సముద్రపు నీటిలో ఈత కోట్టడం లేదా షెల్ఫిష్ తినడం మానుకోవాలి. 
66
ముందస్తు జాగ్రత్త చర్యలు

విబ్రియో వల్నిఫికస్ బాక్టీరియా సంక్రమణ చాలా అరుదు. కానీ, ఇది సంభవించినప్పుడు తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ బాక్టీరియా అమెరికాలో, ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో పెద్ద ముప్పుగా మారింది. గత కొన్ని రోజుల్లోనే నలుగురు మృతిచెందారు. 2016 నుండి ఇప్పటివరకు 448 కేసులు నమోదు కాగా, దాదాపు 100 మంది మరణించారు. 

ఇప్పటివరకు భారతదేశంలో విబ్రియో వల్నిఫికస్ ప్రభావం అరుదు. తక్కువగానే కేసులు నమోదయ్యాయి. అయితే, భారతదేశంలోని తీరప్రాంతాలు, వెచ్చని జలాలు ఈ బాక్టీరియాకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి, ఇది భారతదేశంలో కూడా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే, ప్రజలు ఈ బాక్టీరియా గురించి అవగాహన కలిగి ఉండాలి, అలాగే సముద్రపు ఆహారం, ఈత, గాయాల నిర్వహణ వంటి విషయాల్లో నివారణ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.  

Read more Photos on
click me!

Recommended Stories