ఉదయం హుషారుగా నిద్రలేచి రోజును ఉత్సాహంగా మొదలుపెట్టాలని అనుకుంటాం. కానీ, కొన్నిసార్లు నిద్రలేచేసరికి మెడ నొప్పి వస్తుంది. ఎందుకొచ్చిందో కూడా తెలీదు. నొప్పి మాత్రం బాధిస్తుంది. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే చింతించకండి. కొన్ని సులువైన చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మెడ నొప్పి త్వరగా తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
మెల్లగా మెడను తిప్పండి
నిద్రలేచిన వెంటనే మెడ నొప్పి వస్తే, వెంటనే ఏ పనీ చేయకండి. ముందుగా మీ మెడను మెల్లగా తిప్పండి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో రక్త ప్రసరణ పెరిగి, వాపు తగ్గుతుంది. ముందుగా మీ తలను నిటారుగా పెట్టండి. ఆ తర్వాత మీ మెడను కుడివైపుకు మెల్లగా తిప్పాలి. కొన్ని సెకన్ల తర్వాత ఎడమవైపుకు తిప్పండి. చివరిగా మీ తలను పైకి, కిందకు మెల్లగా కదపండి. ఈ సులువైన వ్యాయామం చేయడం వల్ల మెడ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేడి నీళ్లతో కాపడం
మెడ నొప్పికి మంచి ఉపశమనం కోసం వేడి లేదా చల్లని నీటితో కాపడం పెట్టవచ్చు. దీనికోసం మార్కెట్లో కాపడం సంచులు దొరుకుతాయి. వాటిని కొనుక్కొని వాడుకోవచ్చు. లేకపోతే ఒక వస్త్రాన్ని వేడి నీరు లేదా చల్లని నీటిలో ముంచి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టాలి. రోజుకు మూడుసార్లు, 10 నిమిషాల పాటు ఇలా చేస్తే మెడ నొప్పి తగ్గడం మొదలవుతుంది.
దీన్ని కూడా చదవండి: 6-6-6 నడక అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క వాకింగ్ రూల్‌తో పూర్తి ఆరోగ్యం
వేడి నీటి స్నానం
మెడ నొప్పికి మంచి పరిష్కారం కావాలంటే కొద్దిగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అంటే వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే మెడ నొప్పి తగ్గడమే కాకుండా, వాపు కూడా తగ్గుతుంది. ఇలా స్నానం చేయడం వల్ల మెడ భాగంలో రక్త ప్రసరణ పెరిగి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
దీన్ని కూడా చదవండి: ఎండాకాలంలోనే కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?
కొబ్బరి నూనె మసాజ్
కొబ్బరి నూనె లేదా మీకు నచ్చిన ఏదైనా నూనెను కొద్దిగా వేడి చేసి, మెడలో నొప్పి ఉన్న చోట రాసి మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల మెడ కండరాలు వదులై, నొప్పి, వాపు తగ్గుతుంది.
గమనిక: పైన చెప్పిన పద్ధతులు పాటించినా మెడ నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.