
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల జాతర వచ్చినట్టే. మామిడి పండు కనిపిస్తే నోరు ఊరాల్సిందే, అస్సలు కంట్రోల్ చేసుకోలేం. అయితే, ప్రతి సమ్మర్ సీజన్‌లోనూ మన ఇంట్లోని పెద్దవాళ్ల నుంచి ఒకే హెచ్చరిక వినిపిస్తూ ఉంటుంది.. అదే "ఎక్కువ మామిడి పండ్లు తినకు, ఒంట్లో వేడి చేస్తుంది!". మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
మన సాంప్రదాయ ఆహార అలవాట్లలో కొన్ని పదార్థాలను వేడి చేసేవి అని పిలవడం కామనే. కానీ ఆధునిక సైన్స్ దీనిని కొంచెం డిఫరెంట్‌గా చూస్తుంది. "మామిడి పండ్లను సాధారణంగా వేడి చేసే పండుగా చెప్తారు. కానీ సైన్స్ పరంగా చూస్తే, ఒక ఆహారాన్ని అది వేడిదా లేక చల్లనిదా అనేదాని కంటే, దానిలోని కెమికల్ కాంపోజిషన్ బట్టి గుర్తిస్తారని" అని వైద్యులు చెబుతున్నారు.
మామిడి పండ్లలో సహజ చక్కెరలు, మ్యాంగిఫెరిన్ వంటి ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి. మనం వీటిని తిన్నప్పుడు జీర్ణక్రియ ప్రక్రియలో భాగంగా శరీరంలో కొద్దిగా వేడి ఉత్పత్తి పెరుగుతుంది. "మామిడి పండ్లు తిన్న వెంటనే శరీరంలో కొంత వేడి పెరిగినట్లు అనిపించినప్పటికీ, జ్వరం వచ్చినప్పుడు పెరిగినట్లుగా అది బాడీ కోర్ టెంపరేచర్ మాత్రం పెంచదు" అని వైద్యులు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే, మామిడి పండ్లు మీ శరీర ఉష్ణోగ్రతను నిజంగా పెంచవు. జీర్ణక్రియ స్పీడప్ అవ్వడం వల్ల వచ్చే లైట్ వార్మ్‌నెస్ మాత్రమే అది. ఇది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది.
ఒక్క మామిడి పండు తినడానికి, ఒకేసారి కూర్చుని మూడు, నాలుగు పండ్లను లాగించేయడానికి చాలా తేడా ఉంది. మన శరీరం కేవలం ఆ పండుకే కాదు, మనం తినే క్వాంటిటీకి కూడా రియాక్ట్ అవుతుంది. "ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లు తినడం వల్ల మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ పండులో ఉండే హై లెవెల్ ఫైబర్, ఫ్రక్టోజ్ వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు వస్తాయి" అని వైద్యులు చెబుతున్నారు.
సమస్యలు వస్తాయని మామిడి పండ్లను తినడం మానేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం స్మార్ట్‌గా, పద్ధతిగా తినాలి. దాని కోసం.. ఒకేసారి విపరీతంగా తినేయకుండా, రోజుకు ఒక పండు లేదా కప్పు ముక్కలు మాత్రమే తినాలి. దీనిని తిన్నప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ బ్యాలెన్స్ చేయడానికి పెరుగు లేదా నానబెట్టిన చియా సీడ్స్ వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. మీకు సెన్సిటివ్ బాడీ ఉంటే, ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినడం మానేయండి. మామిడి పండ్లను తినడానికి కనీసం 30 నిమిషాల ముందు నీళ్లలో నానబెట్టండి. మన పెద్దలు చేసే ఈ పాత పద్ధతి వల్ల పండుపై ఉండే జిగురు తొలగిపోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. అనారోగ్య సమస్యలు, ఫుడ్ విషయంలో నిపుణుల సూచనలను తీసుకోండి.