భూమి లోపల దాగి ఉండే అద్భుతం.. ఎల్లేరు గడ్డ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Published : Nov 12, 2026, 02:32 PM IST

Yelleru Gadda: అడవుల్లో సహజంగా లభించే ఆహార పదార్థాల్లో ఎల్లేరు గడ్డ ఒకటి. కేవ‌లం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఉపాధి కల్పిస్తున్న ఈ గడ్డ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

PREV
15
అడవుల్లో సహజంగా లభించే ఎల్లేరు గడ్డ

ఎల్లేరు గడ్డ ప్రధానంగా అడవి ప్రాంతాల్లో సహజంగా పెరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఇది ఎక్కువగా లభిస్తుంది. తిమ్మాయిపల్లి, పిల్లుట్ల, శివంపేట గ్రామాల పరిసరాల్లో స్థానికులు వీటిని ఎక్కువగా సేకరిస్తుంటారు. ఈ గడ్డకు సంబంధించిన తీగ నేలపై నుంచి పైకి పాకుతూ పెరుగుతుంది. దానిని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. అనుభవం ఉన్నవారు మాత్రమే ఆ తీగను గుర్తించి, దాని కింద నేలను తవ్వి గడ్డలను బయటకు తీస్తారు.

25
సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకే ల‌భ్యం

ఎల్లేరు గడ్డ ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు. సాధారణంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మాత్రమే అడవుల్లో లభిస్తుంది. ఈ మూడు నెలల కాలంలోనే స్థానికులు అడవులకు వెళ్లి వీటిని సేకరిస్తారు. మిగతా సీజన్లలో ఇవి దొరకడం చాలా అరుదు. ప్రకృతిలో సహజంగా లభించే ఆహారం కావడంతో వీటిని కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు.

35
ఎల్లేరు గడ్డను ఎలా తయారు చేస్తారు?

ఎల్లేరు గడ్డలను సేకరించిన తర్వాత వాటిని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. అనంతరం పొయ్యిపై తక్కువ మంటతో గంటల తరబడి ఉడికిస్తారు. గడ్డలు పూర్తిగా మెత్తబడి పిండి ముద్దలా మారే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇలా తయారైన ఎల్లేరు గడ్డను విక్రయిస్తారు. దీనిని చక్కెరతో క‌లిపి తింటుంటారు.

45
పోషక విలువలు.. తినేందుకు ఆసక్తి

ఎల్లేరు గడ్డలో పిండిపదార్థాలు సహా పోషకాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. సహజంగా లభించే ఆహారం కావడంతో చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. మెత్తగా ఉడికించిన తర్వాత పిండి ముద్దలా ఉండే వీటిని చక్కెరతో కలిపి తింటే రుచిగా ఉంటాయి. కిడ్నీ, షుగర్ బాధితులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

55
కిలో రూ. 100 నుంచి రూ. 150

ఎల్లేరు గడ్డకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం కిలో ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. మెదక్ జిల్లాలోని శివంపేట మండలంతో పాటు నర్సాపూర్, తూప్రాన్, మేడ్చల్, హైదరాబాద్ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా పిల్లుట్ల, శివంపేట, తిమ్మాయిపల్లి, నర్సాపూర్ గ్రామాల ప్రజలకు ఈ సీజన్‌లో ఎల్లేరు గడ్డల సేకరణ ఉపాధి మార్గంగా మారింది. మూడు నెలల పాటు చాలామంది అడవుల్లో వీటిని సేకరించి విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఇలా ప్రకృతి అందించే ఈ అరుదైన ఆహారం గ్రామీణ ప్రజలకు ఉపాధిని కల్పించడంతో పాటు వినియోగదారులకు సరికొత్త రుచిని పరిచయం చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories