
మునగ ఆకులో ఎన్నో రకాల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనల్ని అందంగానూ ఉంచుతుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది మునగపొడిని తినడం అలవాటు చేసుకున్నారు. ఈ పొడిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి. దీన్ని తింటే ఎముకలు బలంగా ఉండటం నుంచి బరువు తగ్గడం, హెయిర్ ఫాల్ తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
పుష్కలమైన ప్రోటీన్: మునగపొడిలో మన శరీరానికి అవసరరైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో అమైనో ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది
కాల్షియం: మునగపొడిలో కాల్షియం, ఐరన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పొడిని తింటే ఎముకలు బలంగా, హెల్తీగాఉంటాయి. అలాగే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య పోతుంది. హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది.
రక్తపోటు తగ్గుతుంది: అధిక రక్తపోటుతో బాధపడేవారికి మునపొడి చాలా మంచిది. దీనిలో భాస్వరం, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అలాగే కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.
ఇమ్యూనిటీ పవర్: మునగపొడిలో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఈ పొడిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర మంట తగ్గుతుంది.
హెల్తీ జుట్టు: మునగాకు పొడి జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఇ, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే చుండ్రు లేకుండా చేస్తుంది. వెంట్రుకలను బలంగా చేసి హెల్తీగా పెరగడానికి సహాయపడుతుంది.
మునగాకు పొడి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అలాగని దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం మీరు లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ పొడిని ఎక్కువగా తీసుకుంటే వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అలెర్జీ ఉన్నవారికి ఈ పొడి మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందుకే స్కిన్ అలెర్జీ, ఇతర అలెర్జీ సమస్యలు ఉన్నవారు దీన్ని కొద్దికొద్దిగానే తీసుకోవాలి.
ఇకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఈ పొడిని అసలే తినకూడదు. మునగచెట్టు పువ్వులు, ఆకులు, బెరలు గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే పాలిచ్చే తల్లులు డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఈ పొడిని తీసుకోవాలి.
బీపీకి, షుగర్ కు మందులను వేసుకునే వారు మునగపొడిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రక్తపోటును, షుగర్ ను మరింత తగ్గిస్తుంది. అలాగే అలసట, మైకం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇకపోతే హైపోథైరాయిడిజం ఉన్నవారు కూడా దీన్ని ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుంది.
నిపుణుల ప్రకారం.. మొదట్లో రోజుకు 2నుంచి 3 గ్రాముల మునగాకు పొడిని తీసుకుంటే మంచిది. అయితే రోజుకు మీరు 5 నుంచి 10 గ్రాముల పొడిని తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ రోజుకు 70 గ్రాముల మునగపొడిని తింటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి.