పురాణ కథనం ప్రకారం, పార్వతీదేవి కుమారుడైన గణేశుడి తల శివుడి చేతిలో తెగిపోతుంది. అనంతరం పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఉత్తర దిశగా తల పెట్టుకుని నిద్రిస్తున్న ఏనుగు తలను తీసుకువచ్చి గణేశుడికి అమర్చినట్లు కథనం. ఆ ఏనుగు నిద్రకు ముందు తుమ్మి ఆకులను ఆహారంగా తీసుకుందని విశ్వసిస్తారు. ఈ కారణంగానే తుమ్మి ఆకులను గణేశుడితో అనుసంధానిస్తూ చవితి రోజున ప్రత్యేకంగా వంటల్లో ఉపయోగించే సంప్రదాయం ఏర్పడిందని పెద్దలు చెబుతారు. ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారంలో స్వల్ప మార్పులు కనిపించినా.. తుమ్మి కూరను వినాయక చవితి నాటి వంటకంగా భావించడం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. కొంతమంది తుమ్మి కూరను నేరుగా వండుకుంటే మరికొందరు మాత్రం తుమ్మి కూర పప్పును చేస్తుంటారు.
24
వర్షాకాలంలో తుమ్మి కూరకు ఎందుకు ప్రాధాన్యం?
వినాయక చవితి సాధారణంగా వర్షాకాలంలోనే వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు నిల్వ ఉండటం వంటి కారణాలతో కొన్ని సీజనల్ అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. సంప్రదాయంగా ఈ కాలంలో లభించే ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు చెబుతుంటారు.
తుమ్మి ఆకుల్లో సహజంగా యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆయుర్వేదంలోనూ ఈ మొక్కను వివిధ సంప్రదాయ ఔషధ వినియోగాల్లో ప్రస్తావిస్తారు. అందుకే ఏడాదికి ఒక్కసారైన తుమ్మి కూరా తినాలనే ఆచారం మొదలైంది. అయితే దీనిని వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ఇది కేవలం సాధారణ ఆహారంలో భాగంగా మాత్రమే చూడాలి.
34
ఎక్కడ పెరుగుతుంది.. తుమ్మి మొక్కను ఎలా గుర్తించాలి?
వర్షాలు ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తుమ్మి మొక్కలు సహజంగా పెరగడం కనిపిస్తుంది. పొలాల గట్లు, ఖాళీ ప్రదేశాలు, బంజరు భూములు, రహదారుల పక్కన తేమ ఉన్న ప్రాంతాల్లో ఇవి మొలుస్తుంటాయి. నువ్వులు పండించే పొలాల్లో కూడా తుమ్మి మొక్కలు కనిపిస్తాయని గ్రామీణ ప్రాంతాల ప్రజలు చెబుతారు.
తుమ్మి మొక్కకు చిన్న ఆకులు, తెల్లటి పువ్వులు ఉంటాయి. స్థానికంగా పెద్ద తుమ్మి, చిన్న తుమ్మి వంటి రకాల పేర్లు కూడా వినిపిస్తాయి. ఆకులను కూరగా ఉపయోగించడంతో పాటు తుమ్మి పువ్వులకు కూడా సంప్రదాయ ప్రాధాన్యం ఉంది.
మొత్తంగా చూస్తే తుమ్మి కూర కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు.. తెలంగాణలో వినాయక చవితితో ముడిపడిన ఓ ప్రత్యేకమైన ఆహార సంప్రదాయం. పురాణ విశ్వాసం, గ్రామీణ జీవన విధానం, వర్షాకాలంలో సహజంగా లభించే ఆకుకూర ఇలా అనేక అంశాలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అందుకే చవితి సమయంలో తుమ్మి కూరను వండి వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఆనవాయితీగా కొనసాగుతోంది.