
అందమైన ముఖం, పొడవాటి జుట్టు కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసే వారు ఎంతో మంది. నిజానికి ఆ రెండింటినీ చాలా సింపుల్ గా పొందవచ్చు. మనం తీసుకునే ఆహారమే చర్మం, జుట్టును పోషిస్తుంది. కాబట్టి వాటిని మెరిపించే శక్తి ఉన్న ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. మీరు తాగే మిల్క్ టీ, కాపీలు మానేయండి. వాటికి బదులు హెర్బల్ టీలు తాగేందుకు ప్రయత్నించండి.
హెర్బల్ టీలు రుచిగా ఉండకపోవచ్చు కానీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అవి శరీరాన్ని లోపలి నుంచి రక్షిస్తాయి. చర్మం, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
ప్రతి ఇంట్లోను తులసి మొక్క ఉంటుంది. తులసిని పరమ పవిత్రంగా భావిస్తాం. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ సౌందర్యానికి, జుట్టు పెరుగుదలకు ఇవి ఎంతో సహాయపడతాయి. ఈ ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే అద్భుతమైన శక్తి వీటికి ఉంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో కూడా ఇవి ముందుటాయిి.
తులసి టీని ప్రతిరోజూ తాగడం వల్ల మన శరీరంలో యాంటీ బాక్టీరియల్ గుణాలు పెరుగుతాయి. దీనివల్ల మొటిమలు, చర్మపు పగుళ్లను రాకుండా ఉంటాయి. తలపై ఉన్న చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో ఇది ముందుంటుంది. ప్రతిరోజూ ఒక కప్పు వేడి తులసి టీ తాగితే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం.
చామంతి పూలో చేసే చమోమిల్ టీ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనసును తేలికగా ఉంచుతుంది. దీనివల్ల ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ టీ తాగడం వల్ల నాడీ వ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది. మంచి నిద్రను ఇస్తుంది. సరైన నిద్ర లేక కంటి కింద వచ్చే వాపు, నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. మీరు యవ్వనంగా కనిపిస్తారు. వారానికి ఒకసారి చల్లటి కెచమోమిల్ టీతో జుట్టుకు మసాజ్ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
మీరు హార్మోన్ల అసమతుల్యత, మొటిమలు, జిడ్డు చర్మం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే పుదీనా టీ ప్రయత్నించండి. ఇది మీకు అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరం లోపలి నుంచి శుభ్రపడుతుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యలను తగ్గించే శక్తి పుదీనా టీకి ఉంది. దీనిలోని మెంథాల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. చర్మాన్ని కాపాడడంలో ఇది సహాయపడుతుంది. ఇది తలపై రక్త ప్రసరణను ప్రేరేపించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. భోజనం తర్వాత ఒక కప్పు పుదీనా టీ తాగితే పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఎక్కువ. ఇది జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో కాటెచిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించి చర్మ రంధ్రాలను పూరిస్తాయి. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగితే వాపు, జుట్టు రాలడం తగ్గుతాయి. వారానికి ఒకసారి గ్రీన్ టీని చల్లార్చి ముఖానికి టోనర్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాగే జుట్టుకు షాంపూ చేసిన తర్వాత గ్రీన్ టీతో జుట్టును శుభ్రపరచుకుంటే మంచిది.
ఎండిన గులాబీ రేకులను దాచుకుని దానితో టీ చేసుకుని తాగితే ఎంతో మంచిది. ఈ టీ చర్మంలోని సహజ నూనెలను సమతుల్యం చేస్తుంది. చర్మాన్ని తేమవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల పొడి చర్మం తాజాగా మారుతుంది. గులాబీ రేకులలోని యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తాయి. రోజ్ టీతో తులసి ఆకులను కలిపి తాగితే ఇంకా మంచిది.
పైన చెప్పిన టీలు ఒక్క రోజు తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు కనిపించవు. వరుసగా వారం రోజుల పాటూ తాగి చూడండి… మీ చర్మంలో కచ్చితంగా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.