
ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ డయాబెటీస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ డయాబెటీస్ వల్ల శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాదు. శక్తి కోసం గ్లూకోజ్ ను కణాల్లోకి ఇదే పంపుతుందది. ఇది లేకపోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలోనే ఉంటుంది. దీంతో వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
షుగర్ ఉన్నవారు ఇడ్లీ, దోశ, అన్నం వంటివి తక్కువగా తినాలి. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచుతాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే అన్నం తిన్నా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక్ రైస్ మంచివి
డయాబెటీస్ ఉన్నవారు అన్నాన్ని తినాలనుకుంటే వైట్ రైస్ ను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ముదురు రంగు అంటే బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ వంటి అన్నాన్ని వండుకుని తినొచ్చు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మోతాదులో తింటే షుగర్ లెవెల్స్ పెరగవు.
బాయిల్డ్ రైస్ మంచిది
షుగర్ పేషెంట్లు బాయిల్డ్ రైస్ తింటే మంచిది, అందుకే రేషన్ బియ్యాన్ని తినాలంటారు. అయితే ఈ బియ్యాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా పెరుగుతాయి. బాయిల్డ్ రైస్ ను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ ఉన్నవారు అన్నాన్ని తినేటప్పుడు కూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక వంతు అన్నం ఉంటే రెండు వంతుల కూర ఉండాలి. ఇలా తింటేనే షుగర్ పెరగదు. అలాగే ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినాలి.
తక్కువగా తినాలి
డయాబెటీస్ పేషెంట్లు అన్నాన్ని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ముఖ్యంగా అప్పుడే వండిన వేడి వేడి అన్నానికి బదులు చద్దన్నం తినడమే మంచిది. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అలాగే పొడవాటి అన్నాన్ని తినడం మంచిది. అంటే బాస్మతి బియ్యం వండుకుని తినొచ్చు. చిన్నగా ఉండే బియ్యంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాలైనా నడవాలి.
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ ను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.
కాబట్టి మీరు బరువు కూడా తగ్గుతారు. బ్రౌన్ రైస్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శుద్ధి చేసిన వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యల ప్రమాదాల్ని తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలో ఉండే బి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచుతాయి, అలాగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి నరాలను కాపాడుతాయి.
డయాబెటీస్ పేషెంట్లకు రెడ్ రైస్ కూడా ప్రయోజనకరంగా ఉంటుందది. దీనిలో ఫ్లేవనాయిడ్లు, ఆంథోనిసైనిన్లు వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవే ఈ బియ్యానికి ఎరుపు రంగును ఇస్తాయి. అయితే ఈ పదార్థాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెరస్థాయిలను పెంచకుండా ఉండటానికి సహాయపడతాయి. వైట్ రైస్ కు బదులుగా షుగర్ పేషెంట్లు రెడ్ రైస్ ను కూడా తినొచ్చు.