రాగి జావ ప్రయోజనాలు..
1.రోగనిరోధక శక్తిని పెంచుతుంది....
చలికాలంలో పిల్ల నుంచి పెద్దల వరకు అందరికీ జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి బలమైన రోగనిరోధక శక్తి అవసరం. రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ , అమైనో యాసిడ్స్ శరీర రక్షణా వ్యవస్థను బలపరుస్తాయి. రోజూ లేదా వారానికి ఒకసారి రాగి జావ తీసుకుంటే, చలికాలంలో వచ్చే వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడే కవచంలా పని చేస్తుంది.
2.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది...
చలికాలంలో నీరు తక్కువగా తాగడం, శారీరక చురుకుదనం తగ్గడం వల్ల మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రాగి జావలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది పేగుల కదలికలను సరిచేసి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాదు, పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతూ, మొత్తం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
3. శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది
చలికాలంలో ఆకలి ఎక్కువవడం సహజం. దీంతో వేడి, నూనెలో వేయించిన ఆహారాలు, స్వీట్లు ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. రాగి జావ తాగితే ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. రాగిలోని ట్రిప్టోఫాన్ వంటి అమైనో ఆమ్లాలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు తగ్గి, బరువు అదుపులో ఉంటుంది.