
మలబద్దకం (Constipation) సమస్యతో బాధపడేవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. మలవిసర్జన కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరానికి తగినంత ఫైబర్, నీరు తక్కువగా తీసుకోవడం, వ్యాయామం సరిగా చేయకపోవడం, ఒత్తిడి, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఫుడ్ తినడం లాంటి కారణాల వల్ల ఈ మలబద్దకం సమస్య రావచ్చు. అయితే.. దీనిని తగ్గించుకోవడానికి చాలా మంది మందులు కూడా వాడుతూ ఉంటారు. అయితే, మందులతో పని లేకుండా.. కేవలం కొన్ని రకాల పండ్లను డైట్ లో భాగం చేసుకున్నా కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని మీకు తెలుసా? మరి, ఆ పండ్లు ఏంటో చూద్దామా...
నారింజ పండు తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.
నారింజ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నారింజలో సాల్యూబుల్, ఇన్ సాల్యూబుల్ అనే రెండు రకాల ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలన్నా స్మూత్ గా చేయడానిక, పేగుల కదలికను వేగవంతం చేస్తాయి. అంతేకాదు.. నారింజలో దాదాపు 85 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలో హైడ్రేషన్ ను మెరుగుపరిచి, మలబద్దకం రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ పండు తొక్క తీసిన తర్వాత పండు పై తెల్లటి పొర ఉంటుంది. ఆ పొరతో కలిపి తింటే.. ఫైబర్ ఇంకా ఎక్కువగా లభిస్తుంది.
అరటి పండు కూడా మలబద్దకం సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ పేగుల కదలికను సులభతరం చేస్తుంది. పండిన అరటిలో ఉండే సాల్యూబుల్ ఫైబర్ మలాన్ని మృదువుగా చేసి బయటకు సులభంగా వెళ్లేలా చేస్తుంది. అదేవిధంగా, అరటిలోని పొటాషియం పేగుల కండరాల పనితీరును సమన్వయపరుస్తుంది. మలబద్ధకం తగ్గించుకోవాలంటే పండిన అరటిని ఉదయం అల్పాహారంలో లేదా స్నాక్‌గా తినడం మంచిది. అయితే, పండని అరటి పండ్లు (raw banana) తీసుకోవడం కొన్నిసార్లు మలబద్ధకాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి, జీర్ణ సమస్యలున్న వారు పండిన అరటినే తీసుకోవాలి. నీటితో లేదా ఇతర ఫైబర్ రిచ్ ఫుడ్స్‌తో కలిపి తినడం ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది.
పియర్ పండు (Pear) మలబద్ధకం తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే సాల్యూబుల్, ఇన్‌సాల్యూబుల్ ఫైబర్ పేగులలో నీటిని ఆకర్షించి మలాన్ని మృదువుగా చేస్తుంది. పియర్‌లో సహజంగా ఉండే సోర్బిటాల్ అనే చక్కెర మలాన్ని సులభంగా బయటికి పంపేలా సహాయపడుతుంది. ఉదయం అల్పాహారంలో లేదా మధ్యాహ్నం స్నాక్‌గా పియర్ తినడం పేగు ఆరోగ్యానికి మంచిది.
యాపిల్ పండు (Apple) లో ఉండే పెక్టిన్ అనే సాల్యూబుల్ ఫైబర్ పేగుల కదలికను సులభతరం చేసి, మలాన్ని మృదువుగా చేస్తుంది. యాపిల్ తొక్కలో ఉండే ఇన్‌సాల్యూబుల్ ఫైబర్ పేగులలో బల్క్ పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోజుకు ఒక యాపిల్ తినడం పేగు ఆరోగ్యానికి సహజమైన మార్గం.
ఎండు ద్రాక్ష (Raisins) మలబద్ధకం నివారణలో సహజమైన ఔషధంలా పనిచేస్తుంది. వీటిలో ఉండే అధిక ఇన్‌సాల్యూబుల్ ఫైబర్ , సహజ ఫ్రక్టోజ్, సోర్బిటాల్ మలాన్ని మృదువుగా చేసి సులభంగా బయటికి పంపుతాయి. రాత్రి వేడి నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయం తినడం మరింత మంచి ఫలితాలు ఇస్తుంది.
కివి పండు (Kiwi) లో ఉండే ప్రత్యేకమైన ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా, కివిలో పుష్కలంగా ఉండే ఫైబర్ పేగుల కదలికను సక్రమంగా కొనసాగించి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు కివి పండ్లు తినడం పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
'బ్రోమెలైన్' అనే జీర్ణ ఎంజైమ్ అనాస పండులో ఉంటుంది. అందువల్ల ఇది కూడా మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు ఈ పండు తిన్నా.. ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.