పెరుగు, మజ్జిగ రెండూ పాల నుంచి వచ్చేవే. చూడటానికి ఒకేలా ఉన్నా.. తయారు చేసే విధానం వేరు. రుచి, ఉపయోగం కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇవి రుచిగా ఉండటమే కాదు. శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. వీటి తయారీ విధానం నుంచి పోషక విలువల వరకు చాలా తేడాలున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? వేసవికి ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాం.
పెరుగు
పెరుగును పాలల్లో మంచి బ్యాక్టీరియాను చేర్చి పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా.. పాలలో ఉండే లాక్టోస్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. ఇది పాలను గట్టిగా చేసి పెరుగుగా మారుస్తుంది. రుచిని ఇస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ లేదా మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యం, మెరుగైన జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది.
పెరుగులోని పోషకాలు, ప్రయోజనాలు:
పెరుగులో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇంకా చాలా విటమిన్లు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు చాలా మంచిది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను కాపాడుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒక అధ్యయనంలో, పెరుగు రక్తపోటును అదుపులో ఉంచుతుందని తేలింది. కానీ, వేసవిలో పెరుగు ఎక్కువగా తీసుకుంటే శరీరం వేడెక్కుతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది.
మజ్జిగ:
పెరుగు నుంచి వెన్నను తీసేసి కొంత నీటిని కలిపి మజ్జిగను తయారు చేస్తారు. మజ్జిగ.. పెరుగుకి ఉప ఉత్పత్తి. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. పెరుగుతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో చాలామంది మజ్జిగను తాగడానికి ఇష్టపడతారు.
మజ్జిగలోని పోషకాలు, ప్రయోజనాలు:
మజ్జిగలో కాల్షియం, జింక్, ప్రోటీన్, విటమిన్ 2, విటమిన్ బి 12 వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగుతో పోలిస్తే మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది అజీర్ణం, ఎసిడిటీ లాంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. మజ్జిగ చల్లగా ఉండటం వల్ల వేసవిలో తాగితే శరీరం చల్లగా ఉంటుంది.
పెరుగా లేదా మజ్జిగా: ఏది బెస్ట్?
పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివే. రెండింటిలోనూ పోషకాలు ఉన్నాయి. విటమిన్లు కూడా ఉంటాయి. మజ్జిగ ఎప్పుడైనా తాగొచ్చు. ఇందులో ఎక్కువశాతం నీళ్లే ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో మజ్జిగ చాలా మంచిదట. ఆయుర్వేదం ప్రకారం పెరుగు కంటే మజ్జిగ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది.