సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపిఐ పేమెంట్స్ విషయంలో కొత్త రూల్ తీసుకువస్తోంది. ఈ రూల్ ఏమిటి..? దీనివల్ల సైబర్ నేరాలు ఆగుతాయా..?
UPI New Rules : డిజిటల్ లావాదేవీల వేగం కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లకు అస్త్రంగా మారుతోంది. యూపిఐ పేమెంట్స్ వేగం పెరిగేకొద్ది సైబర్ నేరగాళ్లు అంతే వేగంగా బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటివాటి ద్వారా క్షణాల్లో నగదు బదిలీ చేయవచ్చు... అయితే ఒక్కసారి డబ్బు బదిలీ అయ్యాక వెనక్కి తీసుకోలేం. ఇదే సైబర్ నేరగాళ్ళు అమాయకులను ఆర్థికంగా మోసంచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూపిఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. సైబర్ నేరగాళ్ల బారినపడిన బాధితులు వెంటనే స్పందిస్తే కోల్పోయిన సొమ్మును వెనక్కి తెచ్చుకునే 'గోల్డెన్ అవర్' (Golden Hour) అవకాశాన్ని ఆర్బీఐ కల్పించబోతోంది.
25
ఏమిటీ గోల్డెన్ అవర్ రూల్..?
ఇప్పటివరకు యూపీఐ అంటే 'క్లిక్ - సెండ్ - డన్'.. అంటే ఒక్క క్లిక్ తో వెంటనే డబ్బులు బదిలీ అయిపోతాయన్నమాట. అయితే ఇకపై ఇలా కాదు... కొన్ని యూపిఐ పేమెంట్స్ విషయంలో 'క్లిక్ - వెయిట్ - వెరిఫై - డన్' అనే సూత్రం అమలులోకి రానుంది. అంటే డబ్బులు బదిలీ అయ్యేందుకు సమయం పడుతుంది... దీంతో ఏదైనా మోసం జరిగినట్లు గ్రహిస్తే వెంటనే అలర్ట్ కావచ్చు. లావాదేవీని నిలిపివేయవచ్చు. ఇలా ఇకపై రూ.10000 కంటే ఎక్కువ డబ్బులు యూపిఐ ద్వారా బదిలీ కావాలంటే గంట సమయం పడుతుంది... ఇదే 'గోల్డెన్ అవర్' రూల్.
35
ఎందుకు ఈ గంట విరామం..?
సాధారణంగా సైబర్ నేరగాళ్ళ ప్రధాన అస్త్రమే వేగం. ఎంత తొందరగా అమాయకుల నుండి డబ్బులు తమ ఖాతాల్లో బదిలీ చేసుకుంటే అంత లాభమని భావిస్తారు. కాబట్టి సైబర్ మోసానికి గురైన వ్యక్తి ఆ నిజాన్ని గ్రహించేలోపే డబ్బు పది చేతులు మారిపోతోంది. ఇలా జరక్కుండా ఉండేందుకే గోల్డెన్ అవర్ రూల్ తీసుకువస్తున్నారు. ఈ 60 నిమిషాల సమయం సైబర్ మోసాల నుండి 'అలర్ట్' అయ్యే సమయాన్నిస్తుంది. ఒకవేళ పొరపాటున డబ్బులు పంపినా లేదా మోసపోయామని తెలిసినా ఆ గంటలోపు లావాదేవీని ఆపేసే వెసులుబాటు కలుగుతుంది.
1. రెగ్యులర్ లావాదేవీలు : మీరు రోజూ చేసే రీఛార్జ్‌లు, కరెంట్ బిల్లులు లేదా ఇప్పటికే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారితో చేసే ఆర్థిక లావాదేవీలకు ఈ గోల్డెన్ అవర్ రూల్ వర్తించదు. కాబట్టి మీ నిత్యావసరాలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
2. అపరిచిత లావాదేవీలు : కొత్త వ్యక్తికి లేదా మొదటిసారి పెద్ద మొత్తంలో డబ్బులు (₹10k+) పంపేటప్పుడు మాత్రమే ఈ 'హోల్డ్' పీరియడ్ ఉంటుంది. ఇది ముఖ్యంగా 'అర్జెంట్' అని నమ్మించి మోసం చేసే కేటుగాళ్ల పాలిట శాపంగా మారనుంది.
55
సైబర్ క్రైమ్స్ కి చెక్ మేట్..
సైబర్ నేరాల విషయంలో చాలామంది బాధితులు తమ అకౌంట్లోంచి డబ్బు కట్ అయిన 15-20 నిమిషాల తర్వాత గానీ మోసపోయామని గుర్తించలేకపోతున్నారు. ఆర్బీఐ ప్రతిపాదించిన ఈ గోల్డెన్ అవర్ రూల్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించడానికి పోలీసులకు, బ్యాంకులకు ఒక బలమైన ఆయుధం కాబోతోంది.
అయితే ప్రస్తుతం ఈ గోల్డెన్ అవర్ నిబంధన ప్రయోగదశలో ఉంది... మే 8 వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే డిజిటల్ ఇండియాలో 'భయం లేని లావాదేవీల' కొత్త శకం మొదలైనట్లే..!