డ‌బ్బులుంటేనే గొప్ప అనుకుంటున్నారా.? ఈ పుస్త‌కం చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం

Published : Apr 11, 2026, 10:06 AM IST

Book Review: వ్యక్తిత్వ వికాసం గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వీటిలో చాలా వ‌ర‌కు మనిషి ఎలా గొప్పవాడిగా మారాలి అనే విషయాలపైనే దృష్టి పెడతాయి. అయితే మీరు సామాన్యులు కావ‌డం ఎలా అనే ఓ పుస్త‌కం మీ ఆలోచ‌న‌ను పూర్తిగా మార్చేస్తుంది. 

PREV
15
శిఖరాలను కాదు… మైదానాలను సృష్టించే ఆలోచన

చాలా సెల్ఫ్‌హెల్ప్ పుస్తకాలు “మీరు ఎలా అసాధారణంగా మారాలి?” అనే ప్రశ్నకు సమాధానం చెబుతాయి. కానీ ఈ పుస్తకం మాత్రం “ఎలా సరళంగా జీవించాలి?” అనే ప్రశ్నను ముందుకు తీసుకొస్తుంది. జర్నలిస్టు, రచయిత కందుకూరి రమేష్ బాబు “మీరు సామాన్యులు కావడం ఎలా?” పుస్త‌కాన్ని రచించారు. ఈ పుస్త‌కం ఒక వ్యక్తి గొప్పవాడిగా మారడాన్ని కాదు… సామాన్యుడిగా మారడం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. సమాజంలో పెద్ద పేరు, పదవి, ప్రతిష్ఠ‌ లేకపోయినా మానవీయ విలువలతో జీవించే సాధారణ మనుషుల జీవితం ఎంత గొప్పదో ఈ పుస్తకం వివరంగా చూపిస్తుంది. 

రచయిత అనుభవాలు, పరిశీలనలు, సమాజంలో కలిసిన వ్యక్తుల కథల ఆధారంగా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. రెండు దశాబ్దాలకుపైగా సామాన్యుల జీవన విధానాన్ని అధ్యయనం చేసి రచయిత ఈ ఆలోచనలను అభివృద్ధి చేశారని చెబుతారు. ఇది కేవలం వ్యక్తిత్వ వికాస పుస్తకం మాత్రమే కాదు. మనిషి జీవన దృక్పథాన్ని మార్చే జీవన తత్వం అని చెప్పాలి. రచయిత అభిప్రాయం ప్రకారం సమాజంలో అందరూ శిఖరాలుగా మారాలని ప్రయత్నిస్తే అసమానతలు పెరుగుతాయి. కానీ మనుషులు మైదానాల్లా విస్తరించాలి – అంటే అందరికీ దగ్గరగా ఉండాలి, అందరినీ అర్థం చేసుకోవాలి.

25
“సామాన్యుడు” అంటే ఎవరు?

“సామాన్యుడు” అనే పదం వినగానే చాలామంది దాన్ని సగటు వ్యక్తిగా భావిస్తారు. కానీ ఈ పుస్తకంలో రచయిత ఇచ్చిన నిర్వచనం చాలా లోతైనది. రమేష్ బాబు దృష్టిలో సామాన్యుడు అంటే సరళమైన జీవితం గడిపే వ్యక్తి, మనుషుల మధ్య భేదాలు చూడని వ్యక్తి, పేరు, ప్రతిష్ఠల కోసం కాకుండా జీవించే వ్యక్తి, ప్రకృతికి, సమాజానికి దగ్గరగా ఉండే వ్యక్తి. అంటే ఇది బలహీనత కాదు, అది సహజమైన మానవత్వం. రచయిత చెప్పిన విధంగా చూస్తే, సామాన్యుడు కావడం అంటే సాధారణంగా ఉండడం కాదు… అహంకారాన్ని విడిచిపెట్టే ధైర్యం కలిగి ఉండడం.

35
సాధారణ మనుషుల అసాధారణ కథలు

చరిత్రలో ఎక్కువగా రాజులు, రాజకీయ నాయకులు, ప్రముఖుల జీవితాలే నమోదు అవుతాయి. కానీ సమాజాన్ని నిజంగా నిలబెట్టేది మాత్రం సామాన్యులే. ఈ పుస్తకం ఆ సామాన్యుల కథలను వెలుగులోకి తీసుకువస్తుంది. రచయిత తన అనుభవాలలో కలిసిన చాలా మంది వ్యక్తుల గురించి చెప్పాడు. సమాజానికి సేవ చేసే ఉపాధ్యాయులు, పేదలకు సహాయం చేసే వ్యక్తులు, ప్రచారం లేకుండా పని చేసే సామాజిక కార్యకర్తలు, నిస్వార్థంగా జీవించే సాధారణ మనుషులు ఇలాంటి వ్యక్తుల జీవితం ద్వారా రచయిత ఒక గొప్ప సందేశం చెబుతాడు.

45
అహంకారాన్ని వదిలే జీవన తత్వం

ఈ పుస్తకంలో ముఖ్యంగా చెప్పిన‌ విషయం అహం (Ego) గురించి. ప్రస్తుత కాలంలో మనుషులు ఎక్కువగా పేరు కోసం, పదవుల కోసం, గుర్తింపు కోసం, పరుగులు తీస్తున్నారు. రచయిత అభిప్రాయం ప్రకారం ఈ పోటీ జీవితం మనిషిని అసలు సంతోషం నుంచి దూరం చేస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడం, సరళ జీవనాన్ని స్వీకరించడం, మనుషుల్ని ప్రేమతో చూడడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం వంటి వాటిని ఈ పుస్త‌కంలో ప్ర‌స్తావించారు. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు. దాన్ని రచయిత రోజువారీ జీవిత ఉదాహరణలతో వివరించాడు. 

55
ఈ పుస్తకం అసలు సందేశం అదే..

చాలా పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుతాయి. కానీ ఇది మాత్రం జీవన వికాసం గురించి మాట్లాడుతుంది. మనిషి లోపల మార్పు రావడం, మనసులో సరళత పెరగడం, సమాజం పట్ల బాధ్యత పెరగడం, ఇతరుల పట్ల కరుణ కలగడం వంటివి రచయిత అభిప్రాయంలో జీవన వికాసం. అందుకే ఈ పుస్తకం వ్యక్తిగత మార్పు ద్వారా సామాజిక మార్పు సాధ్యమని సూచిస్తుంది. సమాజం, మనిషి, జీవితం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ తప్పక చదవదగ్గ పుస్తకం ఇది.

Read more Photos on
click me!

Recommended Stories