
డాక్టర్ జీ సమరం.. బహుశా ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అపోహలు, మరెన్నో అనుమానాలపై సమర శంఖం పూరించిన గొప్ప మానవతావాది ఈయన. లైంగిక విద్య అనే పేరు వినగానే ముఖం తిప్పుకునే ఆ రోజుల్లోనే పాఠశాల స్థాయిలో ఈ విద్య ఉండాలన్న ఆవశ్యకతను చాటి చెప్పారు. మనిషి జీవితంలో సహజ క్రియ అయిన శృంగారానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి రకరకాల మార్గాల ద్వారా సలహాలు ఇస్తున్నారు. ఈయన సలహాలతో జీవితాలను ఆనంద ప్రదంగా మార్చుకున్న వారు కో కొల్లలు.
సమరం అనగానే చాలా మంది కేవలం లైంగిక విద్యకే పరిమితం అనుకుంటారు. కానీ ఆయన మూఢ నమ్మకాలను పటాపంచలు చేసే గొప్ప వైద్యుడు, మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో చెప్పే గొప్ప సైకాలజిస్ట్.
ఆధునిక జీవన శైలితో సంతానలేమి, మానసిక సమస్యలు పెరుగుతోన్న ప్రస్తుత తరుణం సమరం అవసరం మరింత పెరిగింది. అందుకే ఏసియా నెట్ న్యూస్ తెలుగు సమరాన్ని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తోంది. నేటి జెన్ జీ తరానికి అర్థమయ్యేలా డాక్టర్ సమరం ద్వారా ఆరోగ్య విషయాలను వివరిస్తోంది. మీ ప్రతీ సందేహానికి ఈ సమరం సరికొత్త వెర్షన్ లో కచ్చితంగా సమాధానం దొరుకుతుంది.
డా. గోపరాజు సమరం.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1939 జూలై 30న జన్మించారు. చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై సున్నితమైన దృక్కోణం కలిగి ఉన్నారు. నాస్తిక ఉద్యమాన్ని ముందుకు నడిపిన గోరా, సరస్వతి గోరాల కుమారుడు సమరం. ఈయన శాస్త్రీయ ఆలోచన, సమానత్వ భావనలను వారసత్వంగా పొందారు.
కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుంచి ఎం.బీ.బీ.ఎస్. పూర్తి చేసిన సమరం, 1970లో విజయవాడలో వైద్యవృత్తిని మొదలుపెట్టారు. వైద్యునిగా పనిచేస్తూనే వందలాది ఉచిత వైద్య శిబిరాలు, నేత్ర శస్త్రచికిత్సలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్సా శిబిరాలు నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిండంలో ఆయన చేసిన కృషి విశేషం.
సమాజంలో ఇప్పటికీ బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలు ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలను సమరం చాలా ముందుగానే గుర్తించారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మూఢనమ్మకాల నిర్మూలన కోసం వైద్యులు, శాస్త్రజ్ఞులు, మంత్రజాలికులు, మిమిక్రీ కళాకారులతో బృందాలు ఏర్పాటు చేసి పర్యటించారు. జిల్లాస్థాయి అధికారుల ఆహ్వానంపై ఈ కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి శాస్త్రీయ దృక్కోణాన్ని అందించారు.
డా. సమరం భారతీయ వైద్య సంఘం (IMA)లో కీలక పాత్ర పోషించారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పదవులు చేపట్టారు. 1980-81లో ఉత్తమ రాష్ట్రాధ్యక్షునిగా సత్కారం పొందారు. 1996-97లో IMA ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.అంతేకాకుండా డాక్టర్ సమరం చేసిన మానవతా సేవలకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నారు. ఆయన భార్య డా. రష్మీ కూడా ఈ సేవలో భాగమై, పలు కార్యక్రమాల్లో పక్కన నిలిచారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతో మంది సందేహాలను తీర్చుతున్నారు.
సమరం తెలుగు పాఠకులకు వైద్య శాస్త్రాన్ని సులభంగా అర్థమయ్యేలా పలు పుస్తకాలు రాశారు. ఆయన రచనలు నేటి యువతకు కూడా మార్గదర్శకం అవుతాయి. ముఖ్యమైన రచనలు:
సైన్సు – నాస్తికత్వం (1981), సైన్సు – మనస్సు (1982), ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు (1993),
కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఆధునిక ఆరోగ్య రక్షణ గ్రంథావళి (హార్ట్ ఎటాక్, వ్యాధులు-భయాలు)
ఈ పుస్తకాలు ఆరోగ్యంపై అవగాహన పెంచడమే కాకుండా, మూఢనమ్మకాలను తొలగించడానికి ఉపయోగపడుతున్నాయి.