
తమకు ఇష్టమైనవారి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇలా కొందరు ఇష్టమైన హీరోల గురించి, మరికొందరు సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తల గురించి, ఇంకొందరు ప్రముఖ రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ నుండి ప్రస్తుతం కొనసాగుతున్న నరేంద్ర మోదీ వరకు ఎవరు, ఏ అహారం ఇష్టంగా తినేవారో తెలుసా?
భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ పుట్టుకతోనే శ్రీమంతుడు... అందుకే అతడి ఆహారపు అలవాట్లలో రాయల్ టచ్ కనిపిస్తుంది. ఆయన తందూరీ చికెన్, శమీ కబాబ్‌లు, కాశ్మీరీ నాన్‌వెజ్ వంటకాలను ఇష్టంగా తినేవారని ఆరోజుల్లో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు, అధికారులు చెప్పేవారు. ఇండియన్ ఫుడ్స్ నే కాదు వెస్ట్రన్ (కాంటినెంటల్) ఆహారాన్ని ఆయన ఇష్టపడేవారట. భోజనం చేశాక లక్నోకు చెందిన ప్రసిద్ధ ‘మలై పాన్’ (గిలౌరి), సాంప్రదాయ మిఠాయిలను ఆస్వాదించడం ఆయనకు బాగా అలవాటు అని చెబుతుంటారు.
లాల్ బహదూర్ శాస్త్రి
దేశ ప్రధానిగా అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. ఆయన అహారం కూడా అంతే సింపుల్ గా ఉండేది... సంపూర్ణ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేవారు. ఎక్కువ కారం, మసాలాలు లేని తేలికపాటి పప్పు-అన్నం, కిచిడీ, రొట్టెలు ఆయన రోజువారీ భోజనంలో భాగంగా ఉండేవి. ఆరోగ్యాన్ని దృష్టిలో మంచి పోషకాహారం మాత్రమే శాస్త్రి తీసుకునేవారని ఆయన సన్నిహితులు చెప్పేవారు.
భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ కూతురు, దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ. ఈమె చాలా రాజకీయంగా చాలా పవర్ ఫుల్ లేడీగా గుర్తింపు పొందారు... ఓ దశలో 'ఇండియా అంటే ఇందిరా - ఇందిరా అంటే ఇండియా' అనేలా పరిస్థితులు ఉండేవి. ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ ఇందిరా గాంధీ తన ఫిట్‌నెస్ పట్ల చాలా శ్రద్ధ వహించేవారు.. అందుకే తండ్రిలా రిచ్ ఫుడ్ కాకుండా సింపుల్ అహారం తీసుకునేవారని చెబుతుంటారు.
ఇందిరా గాంధీ ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండేవారు...గ్రిల్ చేసిన పదార్థాలు, ఫ్రెష్ సలాడ్లు, సీఫుడ్ (ముఖ్యంగా చేపలు)ను ఇష్టపడేవారట. విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు జపనీస్ వంటకమైన ‘సుషి’ (Sushi)ని ఇష్టంగా తినేవారని చెబుతుంటారు.
మొరార్జీ దేశాయ్
భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆహార నియమాలు చాలా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి. ఆయన ప్రకృతి వైద్య సిద్ధాంతాలను కఠినంగా పాటించేవారు... అందుకే ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండేవారు. మేక పాలు, ఖర్జూరాలు, రకరకాల ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్), పచ్చి కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవారని చెబుతుంటారు.
దేశానికి మన తెలుగు నేల అందించిన దిగ్గజ నాయకుడు పి.వి. నరసింహారావు. ఆయన దేశ ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వర్తించే సమయంలోనూ తెలుగు నేలపై మమకారాన్ని, తెలుగు రుచులపై ఇష్టాన్ని వదులుకోలేదు. ఆయన జీవితాంతం పక్కా తెలుగు సాంప్రదాయ ఆహారాన్ని ఇష్టపడేవారు. ఇంట్లో కాచిన చారు (దీనిని ఆయన 'ఇండియన్ టానిక్' అని పిలిచేవారని చెబుతుంటారు), ముద్దపప్పు-నెయ్యి, గుత్తి వంకాయ కూర, గుమ్మడికాయ చట్నీ ఆయన భోజనంలో ప్రధానంగా ఉండేవి.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప భోజనప్రియుడు. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా స్ట్రీట్ ఫుడ్స్ నుండి నాన్‌వెజ్ వంటకాల వరకు అన్నీ రుచి చూసేవారు. లక్నో చాట్, జిలేబీలతో పాటు ఫ్రైడ్ ప్రాన్స్ (రొయ్యలు), సముద్రపు చేపల కూరను అమితంగా ఇష్టపడేవారని చెబుతుంటారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్
ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహార విషయంలోనూ చాలా నియమబద్ధంగా ఉండేవారని చెబుతారు. తక్కువ నూనెతో వండిన పంజాబీ పప్పు, రొట్టెలు, ఉడకబెట్టిన కూరగాయలు తినేవారు... ప్రత్యేకంగా బ్లాక్ టీని మాత్రమే తీసుకునేవారట.
సాధారణంగా గుజరాతీలు మంచి భోజనప్రియులు... వివిధ రకాల స్వీట్స్, ప్రత్యేక అహార పదార్థాలు వారి మెనూలో ఉంటాయి. కాబట్టి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫిట్ నెస్ ను కాపాడుకుంటూనే సాత్విక అహారాన్ని రుచిచూస్తుంటారు.
సంపూర్ణ శాకాహారి అయిన మోదీ గుజరాతీ కిచిడీ, ఢోక్లా, మునగాకు పరోటా, మఖానా ఇష్టంగా తింటారని చెబుతారు. చిరుధాన్యాలతో చేసిన వంటకాలను ఆయన చాలా ఇష్టపడతారు.
అయితే రోజువారీ జీవితంలో యోగా, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే నరేంద్ర మోదీ చాలా లిమిట్ గా తింటారు. ఎంత ఇష్టమైన అహారమైన చాలా తక్కువగా తింటారు... ద్రవ పదార్థాలు అంటే జ్యూస్ లు ఎక్కువగా తీసుకుంటారు. నవరాత్రుల సమయంలో నరేంద్ర మోదీ చాలా నిష్ఠగా ఉపవాసం చేస్తారు.
భారత ప్రధానుల ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే... దేశంలోని వైవిధ్యమైన సంస్కృతి, భౌగోళిక ప్రాంతాల రుచులు స్పష్టంగా కనిపిస్తాయి. కొందరు సాత్విక ఆహారానికి ప్రాధాన్యమిస్తే, మరికొందరు ప్రాంతీయ, సంప్రదాయ వంటకాలను ఆస్వాదించి దేశ వైవిధ్యాన్ని తమ పళ్ళెంలోనూ ప్రతిబింబించారు.