Slowest Train in India : భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలుగా నీలగిరి మౌంటైన్ రైల్వే గుర్తింపు పొందింది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఊటీ టాయ్ ట్రైన్ అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. స్లోగా వెళ్లినా ఎందుకు స్పెషలో ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియాలోనే అత్యంత స్లోయెస్ట్ రైలు.. ఐనా సీట్ల కోసం నెలల తరబడి వెయిటింగ్ ఎందుకు?
ప్రస్తుతం మనమంతా లైఫ్‌లో ఒక రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాం. చేతిలో స్మార్ట్‌ఫోన్, చేరాల్సిన డెస్టినేషన్, ఆఫీస్ డెడ్‌లైన్స్.. అంతా స్పీడ్, స్పీడ్, స్పీడ్.. రైల్వే ట్రాక్‌ల మీద కూడా గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్, బుల్లెట్ రైళ్ల ముచ్చట్లే వినిపిస్తున్నాయి.
కానీ, ఈ జెట్ స్పీడ్ కాలంలో కూడా సైకిల్ తొక్కే వేగంతో, గంటకు కేవలం 9 నుంచి 12 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లే ఒక వింత రైలు మన దేశంలో ఉంది. అయితే, ఈ వేగమే దీని అసలైన బ్యూటీ. ఈ రైలు ఎక్కడానికి జనాలు నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుని క్యూ కడుతుంటారు. అదే తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వే, మనందరికీ ఇష్టమైన 'ఊటీ టాయ్ ట్రైన్'.
26
ప్రపంచాన్నే ఆకర్షించిన యునెస్కో వారసత్వం
ఈ రైలు కేవలం కొండల మీద తిరిగే బొమ్మ రైలు మాత్రమే కాదు, దీని వెనుక ఒక శతాబ్ద కాలపు ఘన చరిత్ర ఉంది. బ్రిటీషర్ల కాలంలో, అంటే 1908లో నిర్మించిన ఈ అద్భుతమైన రైల్వే లైన్‌కు ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభ, చారిత్రక ప్రాధాన్యం గుర్తించి 2005లో 'యునెస్కో' (UNESCO) దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
కేవలం 46 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఈ రైలుకు దాదాపు 5 గంటల సమయం పడుతుంది. టైమ్ ఎక్కువైనా సరే, ఈ రూట్‌లో వచ్చే విజువల్స్ చూస్తే రెండు కళ్లూ చాలవు.
36
కొండలు, కోనలు దాటుకుంటూ అద్భుత ప్రయాణం
మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు సాగే ఈ 5 గంటల జర్నీలో ప్రయాణికులకు ప్రకృతి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ మార్గంలో రైలు ఏకంగా 208 ప్రమాదకరమైన మలుపులు, 16 చీకటి సొరంగాలు, 250కి పైగా ఎత్తైన వంతెనల మీదుగా ప్రయాణిస్తుంది.
కిటికీలోంచి బయటకు చూస్తే దట్టమైన లోయలు, పచ్చని తేయాకు తోటలు, జలపాతాల నుంచి వచ్చే చల్లటి తుంపరలు మిమ్మల్ని పలకరిస్తాయి. సినిమా రీల్ లాంటి ఈ సీనరీలను ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లేదా ఫోటోల్లో క్యాప్చర్ చేసుకోవడానికి ఈ స్లో స్పీడ్ సూపర్ గా ఉంటుంది.
ఈ రైలు అంత నెమ్మదిగా వెళ్లడానికి ఒక బలమైన సాంకేతిక కారణం ఉంది. మెట్టుపాళయంలో సముద్ర మట్టానికి కేవలం 326 మీటర్ల ఎత్తులో ప్రారంభమయ్యే ట్రాక్, ఊటీకి చేరేసరికి ఏకంగా 2,203 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఇంత నిటారైన కొండలను సాధారణ రైళ్లు ఎక్కడం అసాధ్యం. అందుకే ఇక్కడ బ్రిటీష్ కాలం నాటి 'రాక్ అండ్ పీనియన్' అనే వినూత్న టెక్నాలజీని వాడుతున్నారు.
రెండు సాధారణ పట్టాల మధ్యలో పళ్లు ఉండే మరో ప్రత్యేకమైన మూడో పట్టా ఉంటుంది. రైలు ఇంజన్‌కు ఉండే పళ్ల చక్రం ఈ పట్టా పళ్లతో లాక్ అయి, రైలు వెనక్కి జారిపోకుండా కొండపైకి నెమ్మదిగా నెడుతుంది. భారతదేశంలో ఈ టెక్నాలజీ ఉన్న ఏకైక రైల్వే లైన్ ఇదే.
56
ఊటీ టాయ్ ట్రైన్ షెడ్యూల్, టైమింగ్స్ ఇవే
మీరు కూడా ఈ అద్భుతమైన నీలగిరి పర్వత రైల్వేలో ప్రయాణించాలనుకుంటే పక్కా ప్లానింగ్ అవసరం. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 07:10 గంటలకు మెట్టుపాళయం స్టేషన్ నుండి బయలుదేరి.. కల్లార్, హిల్ గ్రోవ్, కూనూర్, వెల్లింగ్టన్, లవ్‌డేల్ మీదుగా మధ్యాహ్నం 12:00 గంటలకు ఊటీ చేరుకుంటుంది.
తిరిగి మధ్యాహ్నం 02:00 గంటలకు ఊటీలో బయలుదేరి సాయంత్రం 05:30 కల్లా మెట్టుపాళయం వచ్చేస్తుంది. ఇందులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ సీటింగ్ ఆప్షన్లు ఉంటాయి. కూనూర్ వరకు పాతకాలపు స్టీమ్ ఇంజన్‌తో నడిచే ఈ రైలు, అక్కడి నుంచి డీజిల్ ఇంజన్‌గా మారుతుంది.
66
ప్రయాణానికి ముందు గుర్తుంచుకోవాల్సిన టిప్స్
ఈ టాయ్ ట్రైన్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి ప్రయాణానికి కనీసం 2 నుండి 3 నెలల ముందే ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున టికెట్ దొరకకపోతే, ఊటీ - కూనూర్ మధ్య నడిచే షటిల్ ట్రైన్ సర్వీసులనైనా ట్రై చేయవచ్చు.
కొండల్లోకి వెళ్లేకొద్దీ చలి పెరుగుతుంది కాబట్టి లైట్ స్వెటర్ లేదా జాకెట్ వెంట ఉంచుకోండి. అలాగే ట్రైన్‌లో స్నాక్స్, వాటర్ బాటిల్స్ ముందే తెచ్చుకోవడం మంచిది. వీకెండ్స్, సమ్మర్ హాలిడేస్‌లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ బుకింగే బెస్ట్ ఛాయిస్.