
పాములంటే చాలామందికి చాలా భయం ఉంటుంది. కానీ ఆ భయంతో పాటు వాటి గురించి ఎన్నో కథలు, సినిమాలు, మూఢనమ్మకాలు కూడా మన సమాజంలో చాలా బలంగా నాటుకుపోయాయి. సోషల్ మీడియా కాలంలో కూడా "పాము పగబట్టింది", "నాగపాముకు పాలు పోశారు", "నాగమణి దొరికింది" వంటి వార్తలు, వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే వీటిలో ఎంత నిజం ఉంది? ఎంత ఫేక్? సింపుల్‌గా చెప్పాలంటే... సినిమాల్లో చూపించేదంతా రియల్ లైఫ్‌లో నిజం కాదు. అసలు సైన్స్ ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
మన దేశంలో ఉన్న అతిపెద్ద అపోహల్లో ఇది మొదటిది. నాగపంచమి లేదా ఇతర పండుగల వేళల్లో పాములకు పాలు పోయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ సైంటిఫిక్‌గా చూస్తే పాములు క్షీరదాలు కావు, అవి సరిసృపాలు. అందుకే పాలను జీర్ణం చేసుకునే శక్తి లేదా ఎంజైమ్‌లు వాటి శరీరంలో ఉండవు. సహజంగా అడవుల్లో ఉండే పాములు ఎప్పుడూ పాలను వెతుక్కుంటూ వెళ్లవు.
మరి కొన్ని సందర్భాల్లో పాములు పాలు ఎందుకు తాగుతాయి? పాములు పట్టేవారు నాగపంచమికి ముందు రోజుల్లో వాటిని బంధించి, తీవ్రమైన దాహంతో డీహైడ్రేషన్‌కు గురిచేస్తారు. రోజుల తరబడి నీళ్లు లేక అల్లాడిపోయే పాము ముందు పాల గిన్నె ఉంచినప్పుడు, ప్రాణాలు కాపాడుకోవడానికి ద్రవపదార్థం కాబట్టి వేరే దారి లేక పాలు తాగుతాయి. అంతే తప్ప దానికి పాలు ఇష్టమని కాదు. నిజానికి పాలు తాగించడం వల్ల పాముల ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతిని అవి చనిపోయే ప్రమాదం ఉంది.
సినిమాల్లో హీరోను లేదా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని, ఏళ్ల తరబడి వెంబడించి పగ తీర్చుకునే పాములను మనం చూసే ఉంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఇది పూర్తిగా అబద్ధం. పాముల మెదడు పరిమాణం చాలా చిన్నది. మనుషుల ముఖాలను గుర్తుంచుకునే సామర్థ్యం లేదా రివెంజ్ తీర్చుకోవాలనే భావోద్వేగాలు వాటికి ఉండవు.
పాము మనిషిని కాటేయడానికి ప్రధాన కారణాలు కేవలం భయపడటం, తనను తాను రక్షించుకోవడం లేదా ప్రమాదాన్ని ఊహించడం మాత్రమే. మన కదలికల వల్ల దానికి ముప్పు అనిపిస్తేనే అది దాడి చేస్తుంది. అంతే తప్ప నిన్ను గుర్తుపెట్టుకున్నా, మళ్లీ వచ్చి కాటేస్తా అనే కాన్సెప్ట్ కేవలం రీల్ లైఫ్ డ్రామా మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.
నాగమణి గురించి మన జానపద కథల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటారు. రాత్రి వేళల్లో అది కాంతులు చిమ్ముతుందని, కోట్ల రూపాయల విలువ ఉంటుందని, అది ఉన్నవారికి అదృష్టం కలసి వస్తుందని చాలామంది నమ్ముతారు. ఇప్పటికీ నాగమణి పేరుతో మోసాలు చేసేవారు కూడా ఉన్నారు.
కానీ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా, ఏ శాస్త్రీయ పరిశోధనలోనూ పాము తలలో అలాంటి మణి ఉన్నట్లు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. జీవశాస్త్రం ప్రకారం పాము తలలో ఎముకలు, కండరాలు, విష గ్రంథులు తప్ప ఎలాంటి రత్నాలు ఉండవు. నాగమణి అనేది కేవలం కల్పిత కథల్లో వచ్చిన ఒక భావన మాత్రమే.
పాములవాడు పుంగి లేదా మకుటం ఊపుతుంటే నాగుపాము పడగ విప్పి డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. చాలామంది పాము ఆ సంగీతాన్ని విని మైమరిచిపోతుందని అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే.. పాములకు బయట చెవులు ఉండవు.
గాలి ద్వారా వచ్చే శబ్దాలను పాములు వినలేవు. అవి కేవలం నేల ద్వారా వచ్చే కంపనాలను మాత్రమే గుర్తించగలవు. పాములవాడు పుంగిని అటుఇటు ఊపుతున్నప్పుడు, ఆ వస్తువు కదలికలను పాము ఒక ప్రమాదంగా భావిస్తుంది. ఆ వస్తువును గమనిస్తూ అలర్ట్‌గా ఉండటానికి తన తలను అటుఇటు తిప్పుతుంది. చూసేవారికి అది సంగీతానికి నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది తప్ప, దానికి సంగీతం వినపడదు.
పాము కనిపిస్తే చాలు వెంటనే కర్ర తీసుకుని చంపేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి భారతదేశంలో కనిపించే మెజారిటీ పాములు విషరహితమైనవే. కేవలం కొన్ని రకాల జాతులు (ఉదాహరణకు నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటివి) మాత్రమే మనుషులకు ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి.
చాలా పాములు మనిషిని చూస్తే భయపడి పారిపోవడానికే చూస్తాయి. తప్పించుకునే దారి లేనప్పుడు లేదా మనం దానిపై కాలు వేసినప్పుడు మాత్రమే అవి దాడి చేస్తాయి. పాములు పర్యావరణ వ్యవస్థలో ఎలుకలు, పురుగుల సంఖ్యను అదుపు చేస్తూ పంటలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మూఢనమ్మకాలతో పాములను చంపకుండా, ఇంట్లో లేదా పరిసరాల్లో పాము కనిపిస్తే వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌కు లేదా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.