
మనకు అవసరం లేకున్నా ఫోన్లు చేసి లోన్స్ ఇస్తామని వెంటపడతారు… తీరా డబ్బులు తీసుకున్నాక తిరిగి కట్టమని వేదిస్తుంటాయి కొన్ని బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు. ఒకవేళ EMI కట్టడం లేట్ అయినా, తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించకున్నా ఫోన్లు చేసి బెదిరించడం, లోన్ రికవరీ ఏజెంట్లను పంపించి పరువు తీయడం చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి… ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిద్దమయ్యింది.
లోన్ EMIలు కట్టని కస్టమర్లను రికవరీ ఏజెంట్లు వేధించకుండా, మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఆర్బిఐ చర్యలు చేపట్టింది. లోన్ రికవరీ ప్రక్రియ కోసం కొత్త, కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు లోన్ వసూలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇందులో ఉన్నాయి.
కస్టమర్లతో మాట్లాడటం, ఏజెంట్ల ప్రవర్తన, ఇంటికి లేదా ఆఫీసుకు రావడం, టెక్నాలజీ ద్వారా లోన్ వసూలు చేయడం వంటి అనేక విషయాలపై ఆర్బిఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. లోన్‌పై కొన్న స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను డబ్బు కట్టనప్పుడు రిమోట్‌గా లాక్ చేసే విధానాన్ని కూడా ఆర్బిఐ తొలిసారిగా తన నియంత్రణలోకి తెచ్చింది.
ఆర్బిఐ కొత్త నిబంధనల ప్రకారం… లోన్ ఇచ్చిన సంస్థలు, రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి. ఈ సమయం దాటి మాట్లాడాలంటే కస్టమర్ అనుమతిస్తేనే సాధ్యమవుతుంది. అంతేకాకుండా కస్టమర్ ఇంట్లో ఏదైనా విషాద ఘటన, అత్యవసర వైద్య పరిస్థితి లేదా పెళ్లి వంటి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు రికవరీ ఏజెంట్లు ఇబ్బంది పెట్టకూడదని RBI స్పష్టంగా చెప్పింది.
రికవరీ ఏజెంట్లకు కఠిన నిబంధనలు
లోన్ వసూలు చేసేటప్పుడు బెదిరించడం, అసభ్యకరమైన లేదా భయపెట్టే పదాలు వాడటాన్ని కొత్త రూల్స్ పూర్తిగా నిషేధించాయి. పేరు చెప్పకుండా ఫోన్ చేయడం, బెదిరింపులకు పాల్పడటం, పదేపదే ఫోన్ చేసి వేధించడం, బహిరంగంగా అవమానించడం లేదా కస్టమర్ కుటుంబం, ఆస్తి, ప్రతిష్ఠకు భంగం కలిగిస్తామని బెదిరించడం వంటి చర్యలపై నిషేధం విధించింది.
సోషల్ మీడియాను లోన్ రికవరీ కోసం దుర్వినియోగం చేయడాన్ని కూడా ఆర్బిఐ నిషేధించింది. కస్టమర్లను పబ్లిక్‌గా అవమానించే ఉద్దేశంతో వారి వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు లేదా ఆడియో రికార్డింగ్‌లను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదు.
నేరుగా కలవడానికి కూడా ఆర్బిఐ కొత్త భద్రతా నియమాలను తీసుకొచ్చింది. రికవరీ ఏజెన్సీ, కస్టమర్ ఇంటికి లేదా ఆఫీసుకు మొదటిసారి రావడానికి కనీసం ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలి. అంతేకాకుండా ఆ కేసును హ్యాండిల్ చేస్తున్న రికవరీ ఏజెన్సీ వివరాలను బ్యాంకులు కస్టమర్‌తో పంచుకోవడం తప్పనిసరి.
సాధారణంగా కస్టమర్ చెప్పిన ప్రదేశంలోనే అతన్ని కలవాలి. ఒకవేళ కస్టమర్ ఏ ప్రదేశం చెప్పకపోయినా లేదా చెప్పిన చోటుకు రాకపోయినా మాత్రమే, ఏజెంట్లు అతని ఇంటికి లేదా ఆఫీసుకు వెళ్లొచ్చు.
రికవరీ ఏజెంట్లు తమ అధికారిక గుర్తింపు కార్డు (ID Card), అధికార పత్రం (Authorisation Letter), నోటీస్ కాపీని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఈ అధికార పత్రంలో రికవరీ ఏజెన్సీ, బ్యాంకు గ్రీవెన్స్ ఆఫీసర్ కాంటాక్ట్ నంబర్లు ఉండటం అవసరం.
సంభాషణలను రికార్డ్ చేయడం బ్యాంకుకు తప్పనిసరి
లోన్ రికవరీకి సంబంధించిన అన్ని సంభాషణలను రికార్డ్ చేసి, వసూలు కార్యకలాపాలను పర్యవేక్షించాలని బ్యాంకులను RBI ఆదేశించింది. లోన్ వసూలు కోసం చేసే అన్ని ఫోన్ కాల్స్‌ను బ్యాంకులు రికార్డ్ చేయాలి. కాల్ చేసిన సమయం, ఫోన్ నంబర్ వివరాలను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి.
లోన్ రికవరీ పనిని బయటి సంస్థలకు (అవుట్‌సోర్సింగ్) ఇచ్చినా, రికవరీ ఏజెంట్లు చేసే అన్ని పనులకు లోన్ ఇచ్చిన సంస్థలే పూర్తి బాధ్యత వహించాలని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఏజెంట్ల కార్యకలాపాలను బ్యాంకులు నిరంతరం పర్యవేక్షించాలి. వారికి సరైన శిక్షణ ఇవ్వాలి. వారికి ఇచ్చే కమీషన్/ఇన్సెంటివ్ విధానం దూకుడుగా వసూలు చేసేలా ప్రేరేపించకూడదని కూడా బ్యాంకులు నిర్ధారించుకోవాలి.
కస్టమర్ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి ఈ కొత్త మార్గదర్శకాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బకాయి డబ్బులు వసూలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే రికవరీ ఏజెంట్లకు ఇవ్వాలి. కస్టమర్ డేటా దుర్వినియోగం కాకుండా బ్యాంకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.
ఫోన్ లాక్ చేయడానికీ RBI కొత్త రూల్స్
లోన్ డబ్బుతో కొన్న స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా లాక్ చేయడాన్ని కూడా ఆర్బిఐ తన నియంత్రణలోకి తెచ్చింది. ఒక నిర్దిష్ట డివైజ్ కొనడానికి మాత్రమే లోన్ తీసుకుంటే, ఆ డివైజ్‌పై మాత్రమే ఈ రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగించవచ్చు.
సాధారణ పర్సనల్ లోన్ల కోసం, కస్టమర్ అప్పటికే వాడుతున్న డివైజ్‌లను లాక్ చేయకూడదు. EMI బకాయి పడిన వెంటనే డివైజ్ సేవలను నిలిపివేయకూడదు. లోన్ బకాయి 30 రోజులు దాటితేనే, సేవలను క్రమంగా తగ్గించగలరు. 60 రోజులు బకాయి ఉంటేనే డివైజ్‌ను పూర్తిగా లాక్ చేయగలరు.
పూర్తిగా లాక్ చేసిన తర్వాత కూడా, అత్యవసర సేవలను ఆపలేరు. ఇన్‌కమింగ్ కాల్స్, SMS, ఎమర్జెన్సీ కాల్స్, పనికి అవసరమైన ఫీచర్లు పనిచేస్తూనే ఉండాలి. అంతేకాకుండా కస్టమర్ ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలు, కాల్ లాగ్‌లు, మెసేజ్‌లు లేదా లొకేషన్ హిస్టరీ వంటి ఏ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడాన్ని RBI పూర్తిగా నిషేధించింది.
డబ్బు కట్టగానే ఫోన్ ఆన్ చేయాలి
కస్టమర్ బకాయి డబ్బు చెల్లించిన వెంటనే అతని డివైజ్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కూడా గడువు నిర్దేశించారు. సాధారణంగా డబ్బు చెల్లించిన 1 గంటలోపు డివైజ్‌పై నియంత్రణను తొలగించాలి. ఒకవేళ నిర్దిష్ట సమయంలోగా డివైజ్ సేవలను తిరిగి ప్రారంభించడంలో బ్యాంకు విఫలమైతే, ఆలస్యమైన ప్రతి గంటకు కస్టమర్‌కు రూ.250 నష్టపరిహారం చెల్లించాలి (ఇది లోన్ బకాయి మొత్తానికి లోబడి ఉంటుంది). ఈ రిమోట్ లాకింగ్ సౌకర్యం గురించి, లోన్ అగ్రిమెంట్‌లో ఎక్కడో దాచిపెట్టకుండా, లోన్ ఇచ్చేటప్పుడే కస్టమర్‌కు స్పష్టంగా తెలియజేయాలని కూడా RBI తప్పనిసరి చేసింది.