చిరు, ప్రభాస్‌, పవన్‌, రామ్‌చరణ్‌..2022లో మూడు సినిమాలతో రాబోతున్న స్టార్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే

First Published Sep 13, 2021, 4:44 PM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి సినిమా పరిశ్రమ కుదేలైపోతుంది. థియేటర్లు ఇంకా ఓపెన్‌ అయ్యే పరిస్థితి లేదు. ఓపెన్‌ అయిన చోట జనాలు థియేటర్‌కి రావడం లేదు. దీంతో రిలీజ్‌కి రెడీగా ఉన్న పెద్ద సినిమాలన్నీ 2022కి పోటెత్తుతున్నాయి. సినిమాల జాతరకి నెక్ట్స్ అడ్డా కాబోతుంది.
 

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. జనం థియేటర్‌కి రాకపోవడమే అందుకు కారణం. భారీ బడ్జెట్‌తో తీసిన చిత్రాలు ఆడియెన్స్ రాకపోతే దారుణంగా పరాజయాలు అవుతాయి. కలెక్షన్ల విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద సినిమాలన్నీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్‌ అవుతున్నాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌`, `భీమ్లా నాయక్‌`, `ఆచార్య` వంటి సినిమాలు 2022లో రాబోతున్నాయి. 
 

దీంతో టాలీవుడ్‌లో నెక్ట్స్ ఇయర్‌ సినిమాల జాతర సాగబోతుంది. ఏడాది మొత్తం పెద్ద స్టార్లు రెండు మూడు సినిమాలతో రాబోతున్నారు. చిరంజీవి, పవన్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ వంటి హీరోలు ఏకంగా మూడు సినిమాలతో రాబోతుండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆయా హీరోల ఫ్యాన్స్ కి పూనకాలు తీసుకొస్తుంది. 
 

చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రం ఓరకంగా రిలీజ్‌కి రెడీగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటించగా, రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే చరణ్‌కి జోడీకడుతుంది. ఈ సినిమాని సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇది ఈ ఏడాది చివర్లో వచ్చినా, నెక్ట్స్ ఇయర్‌ మాత్రం చిరుకి మూడు సినిమాలున్నాయని చెప్పొచ్చు. 

ప్రస్తుతం ఆయన `లూసీఫర్‌` రీమేక్‌ స్టార్ట్ చేశాడు. `గాడ్‌ఫాదర్‌`గా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకుడు. ఇందులో చిరుకి సోదరిగా కీర్తిసురేష్‌. హీరోయిన్‌గా త్రిషగానీ, నయనతారగానీ నటించే అవకాశాలున్నాయి. ఇది వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో `భోళాశంకర్‌` సినిమా కూడా చేయబోతున్నారు. ఇది కూడా నెక్ట్స్ ఇయర్‌ టార్గెట్‌గానే ప్రారంభం కాబోతుంది. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. `మెగా154`పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. బాబీ దర్శకుడు. దీన్ని కూడా వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తంగా వచ్చే ఏడాది మూడు నాలుగు సినిమాలతో చిరు తన ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారని చెప్పొచ్చు. 

ఈ జాబితాతో తమ్ముడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం `భీమ్లా నాయక్‌` చిత్రంలో నటిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్‌, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది.

దీంతోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో `హరి హరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు పవన్‌. నిధి అగర్వాల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. దీంతోపాటు హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లోనూ మరో సినిమా చేస్తున్నారు పవన్‌. దీనికి `భవదీయుడు భగత్‌సింగ్‌` అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఇలా మూడు సినిమాలతో ఫ్యాన్స్‌ కి పూనకాలు తెప్పించబోతున్నారు పవన్‌. 
 

వీరితోపాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మూడు సినిమాలతో రాబోతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `రాధేశ్యామ్‌` వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న విడుదల కాబోతుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ చిత్రమిది. దీంతోపాటు `ఆదిపురుష్‌` చిత్రాన్ని కూడా నెక్ట్స్ ఇయర్‌ ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కూడా ప్రకటించారు. దీనికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తుండగా, కృతి ససన్‌ సీతగా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. రాముడిగా ప్రభాస్‌ కనిపిస్తారు. 

మరోవైపు `కేజీఎఫ్‌` వంటి పాన్‌ ఇండియా చిత్రంతో రికార్డులు తిరగరాసిన ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లోనూ `సలార్‌` చిత్రం చేస్తున్నారు ప్రభాస్‌. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. దసరాకిగానీ, క్రిస్మస్‌కి గానీ ఈ చిత్రం థియేటర్‌లోకి రాబోతుంది. ఇలా మూడు సినిమాలతో నేషనల్‌ వైడ్‌గా ఉన్న తన అభిమానులకు పండగని తీసుకురాబోతున్నారు ప్రభాస్‌. 
 

ఈ జాబితాలో నెక్ట్స్ పాన్ ఇండియా స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఉన్నారు. ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌`తో రాబోతున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్‌ కాబోతుందని టాక్‌. ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌` ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరో హీరోగా నటిస్తున్న చిత్రమిది. దీన్ని సంక్రాంతికిగానీ, ఏప్రిల్‌లోగానీ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. 

మరోవైపు రామ్‌చరణ్‌ `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ అయితే చెర్రి మూడు సినిమాలతో సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు. మరోవైపు ఆయన శంకర్‌ డైరెక్షన్‌లో `ఆర్‌సీ15` చేస్తున్నారు. ఇటీవలే ఇది ప్రారంభమైంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఇది కూడా పాన్‌ ఇండియా చిత్రం కావడం విశేషం. 

click me!