తాలిబాన్ల ఆక్రమణలో ఆఫ్ఘనిస్తాన్‌.. భారతదేశ పెట్టుబడులు, వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపనుంది..?

First Published Aug 17, 2021, 3:02 PM IST

గత 20 సంవత్సరాల తరువాత ఆఫ్ఘనిస్తాన్ ని మరోసారి తాలిబాన్లు ఆక్రమించారు. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు  స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు దేశం విడిచి వెళ్ళేందుకు  ప్రయత్నిస్తున్నారు.

 ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి విషమంగానే ఉన్నపటికి ఈ ప్రభావం భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వాణిజ్యంపై చూపుతుంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు శతాబ్దాల నాటివి. దక్షిణాసియాలో ఆఫ్ఘన్ ఉత్పత్తులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్. 
 

2020-2లో రెండు దేశాల మధ్య రూ. 10,387 కోట్ల వాణిజ్యం

ఎండుద్రాక్ష, వాల్‌నట్‌లు, బాదం, పిస్తాపప్పులు, ఎండిన ఆప్రికాట్లను ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. దీనితో పాటు దానిమ్మ, యాపిల్, చెర్రీ, ఖర్జూరం, పుచ్చకాయ, ఇంగువ, జీలకర్ర, కుంకుమ కూడా అక్కడ నుండి దిగుమతి అవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య 1.4 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 10,387 కోట్ల వ్యాపారం జరిగింది. అంతకు ముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య 1.5 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ.11,131 కోట్ల బిజినెస్ జరిగాయి. 2020-21లో ఆఫ్ఘనిస్తాన్‌కు భారతదేశం సుమారు రూ .6,129 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది, అయితే భారతదేశం రూ.37,83 కోట్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.

 తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ ఎగుమతిదారులు చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. అలాగే ఎఫ్‌ఐ‌ఈ‌ఓ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ ఎగుమతిదారి ఎస్‌కే సరాఫ్ కూడా ఈ విషయంపై ఒక ప్రకటన చేస్తూ ఈ ఆందోళన కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. అంతే కాదు ఎఫ్‌ఐ‌ఈ‌ఓ ఉపాధ్యక్షుడు ఖలీద్ ఖాన్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. కొంతకాలం పాటు వ్యాపారం కూడా పూర్తిగా నిలిచిపోవచ్చని అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ రూ. 22,350 కోట్లు పెట్టుబడి

తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడం అనేది భారతదేశానికి పెద్ద సవాలు. ఎందుకంటే విద్యతో సహా మౌలిక సదుపాయాలపై ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం దాదాపు రూ. 22,350 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌లో రోడ్లు, డ్యామ్‌లు, ఆసుపత్రులు మొదలైనవాటిని భారతదేశం నిర్మించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో 400 కంటే ఎక్కువ చిన్న, పెద్ద ప్రాజెక్టులపై భారతదేశం పని చేసింది. 
 

కొన్ని ప్రధాన ప్రాజెక్టుల గురించి

భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటును కూడా దాదాపు 675 కోట్ల రూపాయలకు నిర్మించింది. దీనిని 2015 సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమయంలో భారతదేశం-ఆఫ్ఘనిస్తాన్ స్నేహం గురించి ప్రధాని మోదీ ఎన్నో విషయాలు చెప్పారు. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కోసం భారతదేశ పాత్ర కూడా ప్రస్తావించబడింది. ఇంకా అక్కడి పార్లమెంట్‌లోని ఒక బ్లాక్‌కు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు కూడా పెట్టారు.
 

సల్మా డ్యామ్

2016లో ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రావిన్స్‌లో సల్మా డ్యామ్‌ను ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది 42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ఇంకా నీటిపారుదల ప్రాజెక్ట్. ఈ డ్యామ్‌ను ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్ అని కూడా అంటారు. హెరాత్ ప్రావిన్స్‌లోని హరి రుడ్ నదిపై నిర్మించిన సల్మా డ్యామ్ పెద్ద ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఆనకట్ట 75 వేల హెక్టార్ల భూమికి నీరు అందించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
 

జరంజ్-దేలారం హైవే

భారతదేశం 218 కిలోమీటర్ల పొడవున జరంజ్-దేలారం హైవేని నిర్మించింది. జరాంజ్ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇరాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. దీనిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బి‌ఆర్‌ఓ) తయారు చేసింది. ఈ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం  150 మిలియన్లు డాలర్లు. జరాంజ్-దెలారం హైవే నుండే కోవిడ్ -19 మహమ్మారి సమయంలో భారతదేశం 75,000 టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పిన విషయం తెలిసిందే. 

స్టోర్ ప్యాలెస్

2016లో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ప్రధాని మోడీ 19వ శతాబ్దపు స్టోర్ ప్యాలెస్‌ను కాబూల్‌లో ప్రారంభించారు. 2009లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని కింద ప్యాలెస్ పునర్నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. 1919 సంవత్సరంలో ఈ ప్యాలెస్ రావల్పిండి ఒప్పందంలో స్థావరంగా పరిగణించబడుతుందని తెలిసింది. ఈ ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా మారవచ్చు. 
 

ఆరోగ్య రంగంలో రెండు దేశాల మధ్య సంబంధం చాలా పాతది. భారతదేశం 1972లో కాబూల్‌లో పిల్లల ఆసుపత్రిని పునర్నిర్మించింది. దీని తరువాత, 1985 సంవత్సరంలో దీనికి ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ అని పేరు పెట్టారు. ఇది మాత్రమే కాదు అప్ఘనిస్తాన్‌లో బడాఖాషన్, బల్ఖ్, కాందహార్, ఖోస్ట్, కునార్‌తో సహా అనేక ప్రాంతాల్లో భారత్ క్లినిక్‌లను కూడా నిర్మించింది.
 

రవాణా విభాగం

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం పట్టణ రవాణా కోసం భారతదేశం 400 బస్సులు, 200 మినీ బస్సులను ఆఫ్ఘనిస్తాన్‌కు ఇచ్చింది. అలాగే ఆఫ్ఘన్ జాతీయ సైన్యం కోసం 285 సైనిక వాహనాలు, ఐదు నగరాల్లోని ఆసుపత్రులకు 10 అంబులెన్సులు కూడా  ఇచ్చినట్లు సమాచారం.

undefined
click me!