
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాను బీభత్సం కొనసాగుతోంది. ఇప్ప టికే బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ (అక్టోబర్ 28, మంగళవారం) ఇది తీవ్ర తుపానుగా మారి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ పై మొంథా తుపాను ప్రభావం ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రాణనష్టం జరక్కుండా, ఆస్తినష్టం కూడా ఎక్కువగా లేకుండా ముందుగా జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాన్ కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో ముందుకు కదులుతోందని... ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230కి.మీ, కాకినాడకి 310కి.మీ, విశాఖపట్నంకి 370కి.మీ దూరంలో ఉందని తెలిపింది. మంగళవారం ఉదయం అంటే మరికొద్దిసేపట్లో తుపాను కాస్త తీవ్ర తుపానుగా మారనుందని APSDMA తెలిపింది.
మొంథా తుపాను ఆంధ్ర ప్రదేశ్ వైపు దూసుకువస్తోంది... ఇవాళ రాత్రికే తీరం దాటుతుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించింది. తుపాను తీరందాటే సమయంలో తీరంవెంబడి ఏకంగా గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాబట్టి తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మొంథా తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని APSDMA తెలిపింది. ఇలా దాదాపు 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు రికార్డయినట్లు తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలోని కాపులుప్పాడలో 125మిమీ, విశాఖ రూరల్ ప్రాంతాల్లో 120మిమీ, ఆనందపురంలో 117మిమీ వర్షపాతం నమోదైందని APSDMA వెల్లడించింది.
ఇవాళ (మంగళవారం) ఏర్పడే తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాల తీవ్రత పెరుగుతుందని... భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు కుండపోత వర్షాలు తప్పవంటోంది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు తోడయి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కాబట్టి వర్షప్రభావిత జిల్లాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రావొద్దని హెచ్చరించింది. ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించింది.
మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు ,44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. 338 మండలాల్లో అధిక వర్షాలకు కురిసే అవకాశాలు ఉన్నాయంటోంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. భారీ వర్షప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ను మొహరించామని... స్థానిక ప్రభుత్వ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉన్నట్లు APSDMA తెలిపింది. కాబట్టి ప్రజలు మొంథా తుఫాను గురించి ఆందోళన చెందరాదని... అప్రమత్తంగా ఉంటే చాలని అంటోంది.
ఇవాళ్టినుండి తుఫాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తుఫాను ప్రభావంపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించనున్నారు. పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్సెమెంట్ సిస్టం ఏర్పాటుచేశారు. ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలెర్ట్ చేసే ఏర్పాట్లు కూడా చేశారు.
మొంథా తుపాను ప్రభావంతో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు, తీరందాటే సమయంలో భయానక పరిస్థితుల హెచ్చరికలపై చర్చించేందుకు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని... ఇందుకోసం ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సిఎం సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్దతపై ఐవిఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైనా సీఎం సమీక్ష చేశారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83 శాతం సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు.
28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ ఉదయం లోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ముప్పు తప్పే వరకూ ప్రతీ శాఖ, ప్రతీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సిఎం సూచించారు.
ఇక మొంథా తుపాను వార్తలపై సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంయమనం పాటించాలని హోంమంత్రి అనిత సూచించారు. థంబ్ నెయిల్స్, క్లిక్స్ కోసం ప్రజలను తప్పుదారి పట్టించొద్దని... సంచలన హెడ్డింగ్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని సూచించారు. విపత్కర సమయంలో తప్పుడు ప్రచారాలకు, గందరగోళానికి ఆస్కారం ఇవ్వొద్దని... నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని హోంమంత్రి అనిత సూచించారు.