Police Constable Sonika Yadav : 7 నెలల గర్భిణీగా ఉన్న ఢిల్లీ కానిస్టేబుల్ సోనికా యాదవ్, 145 కిలోల బరువు ఎత్తి ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్‌లో కాంస్యం గెలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 పోటీలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ సోనికా యాదవ్ (31) అందరినీ ఆశ్చర్యపరిచింది. 65 కిలోల విభాగంలో పోటీ పడే ఆమె, ఈసారి 84 కిలోల విభాగంలో పాల్గొంది. స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే ఆమె 145 కిలోల డెడ్‌లిఫ్ట్‌కు సిద్ధమై బార్‌బెల్ పట్టుకోగానే ప్రేక్షకులు నిశ్శబ్దం అయ్యారు. అప్పుడే అందరికీ తెలిసింది… ఆమె ఏడు నెలల గర్భిణి అని. ఆ తర్వాత ఆమె బరువు ఎత్తడం చూసి చప్పట్లతో హోరెత్తించారు.
25
గర్భం అడ్డే కాదు.. సంకల్పం ఉంటే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి
సోనికా యాదవ్ 2023 లో పవర్‌లిఫ్టింగ్ ప్రారంభించింది. 2024 మేలో ఆమె గర్భవతి అయ్యింది. భర్త అంకుర్ బనా ఆమె శిక్షణ ఆపుతుందేమో అనుకున్నాడు. కానీ సోనికాకు వెనక్కి తగ్గే ఆలోచనే లేదు.
“గర్భం ఒక అడ్డంకి కాదు. స్త్రీలు చేయలేరన్న భావన తప్పు. నేను కూడా అలాగే ప్రాక్టీస్ కొనసాగించాను” అని ఆమె చెప్పారు.
35
పోటీలో మూడు విభాగాల్లో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగిన సోనికా
పవర్‌లిఫ్టింగ్‌లో ఆమె ప్రదర్శన గమనిస్తే..
• స్క్వాట్స్: 125 కిలోలు
• బెంచ్ ప్రెస్: 80 కిలోలు
• డెడ్‌లిఫ్ట్: 145 కిలోలు
మొదట 135 కిలోల డెడ్‌లిఫ్ట్ చేయాలని నిర్ణయించినా, మెడల్ సాధించాలంటే ఎక్కువ బరువు ఎత్తాల్సి ఉంటుందని భావించి 145 కిలోలకు ప్రయత్నించింది. ఫలితంగా ఆమె కాంస్య పతకం గెలిచింది.
పోటీకి ముందుగానే ఇంటర్నెట్‌లో శోధించిన సోనికా, ఇలాంటి కృషి గర్భధారణ సమయంలో చేసిన మహిళలు చాలా తక్కువగా ఉన్నారని గుర్తించింది. పవర్‌లిఫ్టింగ్‌లో లూసీ మార్టిన్స్ అనే మహిళ ఇదే సమయంలో విజయం సాధించిందని తెలుసుకుని, ఆమెను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి సూచనలు తీసుకుంది.
“కడుపును లోపలికి సెట్ చేసుకుని లిఫ్టింగ్ చేయాలి అని ఆమె చెప్పింది. నేను అదే పాటించాను” అని సోనికా చెప్పింది.
55
పోలీస్ సేవలో టాప్ లో సోనికా యాదవ్
2014 బ్యాచ్‌లో ఎంపికైన సోనికా యాదవ్, ప్రస్తుతం కమ్యూనిటీ పోలీసింగ్ సెల్‌లో పనిచేస్తోంది. తన అద్భుతమైన పనితీరు, సేవలతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. మజ్నూకా తిల్లా ప్రాంతంలో మాదక ద్రవ్యాల నియంత్రణలో కృషి చేశారు. 2022లో ఢిల్లీ పోలీస్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్మృతి ఇరానీ చేతుల మీదుగా సత్కారం కూడా అందుకున్నారు. ఆమె భర్త ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ట్రైనింగ్ సమయంలో ఆమె తరచూ గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ భద్రతా అంశాలను పరిశీలించింది.
సోనికా యాదవ్ : కబడ్డీ నుండి వెయిట్‌లిఫ్టింగ్ వరకు
సోనికా యాదవ్ ముందుగా కబడ్డీ ఆడేది. శరీర దృఢత్వం కోసం జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెరిగింది. 2023 ఆగస్టులో, ఢిల్లీ స్టేట్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి బంగారు పతకం అందుకుంది. అప్పటి నుంచి ఆమె ప్రయాణం కొనసాగుతోంది. సోనికా యాదవ్ కథ, స్త్రీ ధైర్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.