మొంథా తుపాను: పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు, 25 కేజీల బియ్యం

Published : Oct 27, 2025, 04:43 PM IST

Cyclone Motha: మొంథా తుపాను నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3000 నగదు, 25 కేజీల బియ్యం పంపిణీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. రక్షణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

PREV
15
మొంథా తుపాను: అత్యవసర చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుపాను కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజల భద్రత, వారి ఆరోగ్యం, ఆహారం, తాగునీరు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

25
పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు సహాయ పంపిణీ

సంక్షోభ సమయంలో ఎవరికీ ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. మొంథా తుపాను పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు అందించాలన్నారు. అలాగే 25 కేజీల బియ్యం, నిత్యావసరాలను అందించాలని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక ఇన్‌చార్జ్‌లను నియమించి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం చేరాలని, తాగునీరు సమస్య తలెత్తకుండా ముందే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

35
వైద్య సేవలు, పారిశుధ్యంపై కట్టుదిట్టమైన చర్యలు

పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కావాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. తుపాను అనంతరం వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య చర్యలు బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలు ఎవరూ బయటకు వెళ్లకుండా, అప్రమత్తంగా ఉండేలా సమాచారం అందించాలని చెప్పారు. అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

45
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణకు స్పష్టమైన ఆదేశాలు

వర్షాల ప్రభావంతో చెరువులు, కాలువ గట్టులు తెగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చెప్పారు. భారీ వర్షాల వల్ల నీటి నిల్వలు పెరిగే ప్రాంతాలను గుర్తించాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

తుపాను సమయంలో వాహనాల రాకపోకలను పరిమితం చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వాలంటీర్లను సహాయక చర్యల్లో వినియోగించుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేయాలని సీఎం చెప్పారు.

55
మొంథా తుపాను: జిల్లాల నుండి తాజా సమాచారం సేకరణ

టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, వివిధ జిల్లాల కలెక్టర్లను ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. ప్రజలను రక్షణ కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ఆర్టీజీఎస్ ద్వారా మొంథా తుపాను సమాచారం అందుబాటులో ఉండటం వల్ల స్పందన వేగవంతం అవుతుందని సీఎం పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. ఏ ఒక్క జిల్లాలోనూ అలసత్వం కనిపించకూడదని, అధికారులు తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని ఆదేశించారు.

మొంథా తుపాను నిర్వహణ విధానం భవిష్యత్‌లో వచ్చే తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒక మోడల్‌గా నిలవాలని ముఖ్యమంత్రి అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories