
Cyclone Montha : వర్షాకాలం ముగిసింది... కానీ తెలుగురాష్ట్రాలను మాత్రం వానలు వదల బొమ్మాళి అంటూ వెంటపడుతున్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్ లో కేవలం బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడితేనే ఎలాంటి వర్షాలు కురిశాయో చూశాం... మరి ఇప్పుడు ఏకంగా తుపాను ఏర్పడింది... ఇంకే స్థాయితో వర్షాలుంటాయో ఊహించవచ్చు. భారత వాతావరణ శాఖ (IMD) కూడా మొంథా తుపాను ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై గట్టిగానే ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ సోమవారం నుండి వారంరోజులపాటు కుండపోత వానలు తప్పవని ప్రకటించింది. ముఖ్యంగా అక్టోబర్ 27,28,29 భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ప్రస్తుతం మొంథా తుపాను ఆంధ్ర ప్రదేశ్ దిశగా దూసుకువస్తోంది... నిన్న(ఆదివారం) తీవ్ర వాయుగుండం, ఇవాళ (సోమవరం) తుపాను కొనసాగగా... రేపు (మంగళవారం) తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. మొంథా సముద్రం నుండి భూమికి దగ్గరయ్యేకొద్ది ప్రభావం పెరుగుతుందని... తీరందాటే సమయంలో కుండపోత వానలతో పాటు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదముందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రాష్ట్రానికి భారి వర్షాలు, వరదలు, ఈదురుగాలుల ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు, తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వీరి ఆదేశాల మేరకు తుపాను ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందకు ప్రత్యేక అధికారులను నియమించారు... అలాగే టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటుచేశారు.
తుఫాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించగలరు.
బంగాళాఖాతంలో అల్లకల్లోలం సృష్టిస్తూ మొంతా తుపాను ముందుగు సాగుతోందని... ఇది ప్రస్తుతం నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోందని.. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570కి.మీ., విశాఖపట్నంకి 650కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు(మంగళవారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని... ఇదేరోజు సాయంత్రానికి తీరందాటే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
మొంథా తుఫాన్ ప్రభావం, తీవ్రతపై చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావంగురించి సోషల్ మీడియా, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తుగానే సమాచారం అందించాలని... తద్వారా వాళ్లు ముందుగానే అప్రమత్తం అయ్యేందుకు వీలుంటుందని అన్నారు.
తీరప్రాంతాల్లో SDRF, NDRF బృందాలు మోహరించాలని సీఎం సూచించారు. ఈదురుగాలులు, వర్షాల కారణంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ కు అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు... ఇందుకోసం ఇప్పటికే 27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి రప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు.