Cyclone Motha: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా జిల్లాతో సహా తీరప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు ప్రాంతాల్లో అంచనాల కంటే ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావాన్ని నిరంతరంగా పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం ప్రజలకు చేరాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం నుంచి ప్రతీ గంటకూ తుఫాన్ బులిటెన్‌లు విడుదల చేస్తూ అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష జరిపిన సీఎం, కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
శాటిలైట్ ఫోన్లు వినియోగించడంతో పాటు, తాత్కాలిక మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. 110 మండలాల్లో పవర్ బ్యాకప్ కోసం 3,211 జెనరేటర్లు వినియోగించాలని చెప్పారు.
25
ప్రాణ–ఆస్తి రక్షణ ప్రభుత్వం చర్యలు
మొంథా తుపాను కారణంగా ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలని సీఎం పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు. తుపాను అనంతరం అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్యాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని చెప్పారు.
గర్భిణీలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 108, 104 వాహనాలను సిద్ధం చేయాలని, యాంటీ స్నేక్ వెనోమ్, యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్లు పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
35
కృష్ణా జిల్లాలో అతిభారీ వర్షాల హెచ్చరిక
అధికారులు ముఖ్యమంత్రికి ఇచ్చిన వివరాల ప్రకారం, మొంథా తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో 16 కి.మీ వేగంతో కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురుస్తున్నాయని, మంగళవారం కృష్ణా జిల్లాలో అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని చెప్పారు.
గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెనక్కి రప్పించామని తెలిపారు.
రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు అవాంతరాలు తలెత్తిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సీఎం చెప్పారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, రియల్ టైమ్ పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 851 జేసీబీలు, 757 పవర్ సాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి వినియోగంపై మ్యాపింగ్ చేయాలని, ఆడిటింగ్ కూడా నిర్వహిస్తామని సీఎం తెలియజేశారు.
వరద నీరు వెళ్లేందుకు డ్రెయిన్లను శుభ్రపరచాలని సూచించారు. వ్యవసాయ పంటలు, పశుసంపద నష్టం జరగకుండా టార్పాలిన్లు నిల్వలో ఉంచాలని ఆదేశించారు.
55
తుపాను ప్రభావం పై ప్రధాని మోదీ ఆరా
తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం వివరించారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు.
ప్రధాని కార్యాలయంతో సమన్వయం బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.